త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Emergency | ఎన్‌సీఈఆర్‌టీ చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యం.. 9వ త‌ర‌గ‌తి బుక్‌లో ఎమ‌ర్జెన్సీపై పాఠం

Emergency | నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేష‌న‌ల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) తాజాగా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. భార‌త్‌లో ఎమ‌ర్జెన్సీ (Emergency) విధించి ఐదు ద‌శాబ్దాలు పూర్తైన సంద‌ర్భంగా తొలిసారిగా తొమ్మిదోత‌ర‌గ‌తి సోష‌ల్ సైన్స్ పాఠ్య‌పుస్త‌కంలో మొదటిసారిగా ఎమర్జెన్సీకి సంబంధించిన పాఠాన్ని చేర్చింది.

D

National | Published On Jun 25, 2026, 11.05 am IST

Emergency | ఎన్‌సీఈఆర్‌టీ చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యం.. 9వ త‌ర‌గ‌తి బుక్‌లో ఎమ‌ర్జెన్సీపై పాఠం
Advertisement

Emergency | భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైన, వివాదాస్పద ఘట్టంగా నిలిచిన 'అత్యవసర పరిస్థితి' (ఎమర్జెన్సీ) విధించి ఐదు దశాబ్దాలు పూర్తైంది. ఈ సంద‌ర్భంగా నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేష‌న‌ల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) తాజాగా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తొమ్మిదోత‌ర‌గ‌తి సోష‌ల్ సైన్స్ పాఠ్య‌పుస్త‌కంలో మొదటిసారిగా ఎమర్జెన్సీకి సంబంధించిన పాఠాన్ని చేర్చింది.

ఎన్‌సీఈఆర్‌టీ కొత్త‌గా రూపొందించిన సామాజిక శాస్త్ర పుస్తకం 'అండర్‌స్టాండింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్'లోని (Understanding Society: India and Beyond) ఓ అధ్యాయంలో భారత ప్రజాస్వామ్య బలాలు, సవాళ్లను విశ్లేషిస్తూ ఈ ఎమర్జెన్సీ విభాగాన్ని చేర్చింది. ఈ అత్యవసర పరిస్థితిని భారత ప్రజాస్వామ్యానికి ఎదురైన అతిపెద్ద అంతర్గత సవాళ్లలో ఒకటిగా అభివ‌ర్ణించింది. ఎమ‌ర్జెన్సీకి దారి తీసిన ప‌రిస్థితులు, ప్ర‌జాస్వామ్య హ‌క్కుల‌పై దాని ప్ర‌భావాన్ని ఈ పాఠ్య‌పుస‌క్తంలో వివ‌రించారు.

ఈ కొత్త పాఠ్యపుస్తకంలో ఏముందంటే..?

1975–1977 మధ్య కాలంలో విధించిన జాతీయ ఎమర్జెన్సీని భారత ప్రజాస్వామ్యానికి ఎదురైన అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా ఈ పుస్తకంలో పేర్కొన్నారు. 1970ల ప్రారంభంలో అప్ప‌టి ప్ర‌ధాని ఇందిరా గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ వ‌చ్చింది. పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ దుష్పరిపాలన వంటి అంశాలు ప్రజల్లో, ముఖ్యంగా యువతలో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. దేశ‌వ్యాప్త నిర‌స‌న‌ల‌కు దారితీశాయి. ఈ క్రమంలో జూన్ 1975లో అంతర్గత అల్లర్ల నెపంతో ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించింది అని పాఠ్యపుస్తకం పేర్కొంది.

ప్ర‌జాస్వామ్యంలో మీడియా పాత్ర కీల‌కం..

ఎమ‌ర్జెన్సీతోపాటూ ప్ర‌జాస్వామ్యానికి ఎదుర‌వుతున్న ఇత‌ర స‌వాళ్ల‌ను కూడా ఈ పాఠ్య‌పుస్తకంలో పొందుప‌రిచారు. న‌కిలీ వార్త‌లు, త‌ప్పుడు స‌మాచారం, పేద‌రికం, ప్రాంతీయ‌త‌త్వం, సామాజిక వివ‌క్ష‌, లింగ అస‌మాన‌త‌లు కూడా ఉన్నాయి. దాదాపు 21 నెల‌లుగా సాగిన ఈ ఎమర్జెన్సీ కాలంలో భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన అత్యధిక ప్రాథమిక హక్కులను పూర్తిగా రద్దు చేసినట్లు, ప్రజాస్వామ్యానికి జీవనాడి లాంటి పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు విధించినట్లు స్పష్టం చేసింది. సమాజంలో మీడియాను ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభం (Fourth Pillar)గా అభివర్ణిస్తూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడంలో దాని ప్రాధాన్యతను వివరించారు.

జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ పాత్ర హైలెట్‌..

ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా లోక్‌నాయక్‌గా యావత్ భారతదేశ ప్రజల గుండెల్లో నిలిచిన ప్రముఖ సోషలిస్టు నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ నడిపించిన చారిత్రక ప్రజా ఉద్యమానికి ఎన్‌సీఈఆర్‌టీ ఈ పుస్తకంలో ప్రత్యేక స్థానం కల్పించింది. ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేయ‌డంలో ఆయ‌న‌ పాత్రను ఈ పాఠంలో ప్రత్యేకంగా హైలైట్ చేశారు.

అదో చీక‌టి ఘ‌ట్టం..

కాగా, భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) 1975 జూన్ 25 న విధించిన విష‌యం తెలిసిందే. ఇది 1977 మార్చి 21 వరకు దాదాపు 21 నెలల పాటూ కొన‌సాగింది. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సలహా మేరకు రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 కింద అంతర్గత భద్రతకు ముప్పు ఉందనే కారణంతో దీనిని ప్రకటించారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఈ ఎమర్జెన్సీ అత్యంత వివాదాస్పదమైన, చీకటి ఘట్టంగా చెబుతారు. ఆ స‌మ‌యంలో పౌరుల ప్రాథ‌మిక హ‌క్కుల‌ను తాత్కాలికంగా నిలిపివేయ‌డమే కాకుండా.. జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజపేయ్ వంటి లక్ష మందికి పైగా రాజకీయ ప్రత్యర్థులు, పాత్రికేయులు, ప్రజాస్వామ్య వాదులను జైళ్ల‌లో బంధించారు. మీడియాపై క‌ఠిన ఆంక్ష‌లు విధించారు.

Advertisement
Advertisement