త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pakistani Woman Arrested Karnataka | కర్ణాటకలో పాక్ మహిళ అరెస్ట్.. దేశం పేరు దాచిపెట్టి ఓటర్, రేషన్ కార్డులు

కర్ణాటకలో నివాసం ఉంటున్న ఓ పాకిస్థాన్ మహిళ, ఆమె కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు గుర్తింపు దాచిపెట్టి రేషన్, ఓటర్ కార్డులు పొందడమే ఇందుకు కారణం.

J

National | Published On Jul 12, 2026, 6.38 pm IST

Pakistani Woman Arrested Karnataka | కర్ణాటకలో పాక్ మహిళ అరెస్ట్..  దేశం పేరు దాచిపెట్టి ఓటర్, రేషన్ కార్డులు
Advertisement

Pakistani Woman Arrested Karnataka | త్రినేత్ర.న్యూస్ : కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. తమ జాతీయతను అధికారుల నుంచి దాచిపెట్టి.. అక్రమంగా రేషన్, ఓటర్ కార్డులు పొందిన ఓ పాకిస్థాన్ మహిళను, ఆమె కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాగేపల్లి తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

యూఏఈలో పెళ్లి.. ఇండియాలో కాపురం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగేపల్లికి చెందిన మహ్మద్ అయూబ్ ఖాన్ ఉపాధి కోసం యూఏఈ వెళ్లాడు. అక్కడే పాకిస్థాన్‌కు చెందిన ఫరా నాజ్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు మొత్తం నలుగురు పిల్లలు. వారిలో మహ్మద్ ఫర్దీన్ పాకిస్థాన్‌లో జన్మించాడు. దీంతో అయూబ్ ఖాన్, మిగతా ముగ్గురు పిల్లలు భారతీయ పౌరులు కాగా.. ఫరా నాజ్, ఫర్దీన్ ఇద్దరూ పాకిస్థానీలుగానే ఉండిపోయారు.

గుట్టు రట్టయిందిలా..

ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత.. ఫరా నాజ్, ఫర్దీన్ తమ పాకిస్థాన్ గుర్తింపును అధికారుల నుంచి దాచిపెట్టారు. స్థానికంగా తప్పుడు వివరాలు సమర్పించి రేషన్ కార్డు, ఓటర్ ఐడీలను సైతం పొందారు. అయితే, చిక్కబల్లాపూర్ పోలీసులకు వచ్చిన అనుమానంతో వీరి అసలు గుట్టు రట్టయింది.

పోలీసులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన డిప్యూటీ కమిషనర్.. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. వారు వాస్తవాలను దాచిపెట్టి కార్డులు పొందారని నిర్ధారించుకున్న తర్వాత వెంటనే ఆ రేషన్ కార్డును రద్దు చేశారు. అలాగే, సంబంధిత అధికారులు వారి ఓటర్ కార్డును కూడా క్యాన్సిల్ చేశారు.

తీవ్రమైన సెక్షన్ల కింద కేసు

ఈ పరిణామాల తర్వాత బాగేపల్లి తహసీల్దార్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీంతో పాకిస్థాన్‌కు చెందిన ఫరా నాజ్, ఫర్దీన్‌లపై భారతీయ న్యాయ సంహిత, ఫారినర్స్ యాక్ట్, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరికి ఈ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడంలో స్థానికంగా ఎవరైనా సాయం చేశారా? అన్న కోణంలో తదుపరి విచారణ కొనసాగుతోంది.

Advertisement
Advertisement