One Nation One Election | 2029లో జమిలి సాధ్యమే.. రాష్ట్రాలదే తుది నిర్ణయం : జేపీసీ చైర్మన్
One Nation One Election | మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' (One Nation One Election) విధానంపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) చైర్మన్, బీజేపీ ఎంపీ పీపీ చౌదరి (PP Chaudhary) కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 నాటికి లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనని తెలిపారు.
- 2028 నాటికి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందితే..
- అదే ఏడాది వన్ నేషన్, వన్ ఎలక్షన్ అమలు ప్రక్రియ ప్రారంభం
- మొదటి నాలుగు సాధారణ ఎన్నికలు ఒకేసారి జరిగాయి
- కాబట్టి ఇప్పుడు ఇది సాధ్యమే
- అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తోంది
One Nation One Election | త్రినేత్ర.న్యూస్ : మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' (One Nation One Election) విధానంపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) చైర్మన్, బీజేపీ ఎంపీ పీపీ చౌదరి (PP Chaudhary) కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 నాటికి లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనని తెలిపారు. అయితే దీనికి రాజ్యాంగ సవరణలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ 2028 నాటికి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందితే.. అదే ఏడాది వన్ నేషన్, వన్ ఎలక్షన్ అమలు ప్రక్రియను ప్రారంభించొచ్చని తెలిపారు.
రాష్ట్రాలదే తుది నిర్ణయం..
అయితే, అసెంబ్లీ రద్దు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని తెలిపారు. అది పూర్తిగా ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రివర్గాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలతో పాటే తమ రాష్ట్ర ఎన్నికలను కూడా నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గాలు భావిస్తే.. భారత రాజ్యాంగం అందుకు అనుమతిస్తుందని వెల్లడించారు. ప్రజాస్వామ్యం అంటే రాజకీయ పార్టీల ఇష్టం కాదని, ప్రజల ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. తాము ఇప్పటివరకు 10 రాష్ట్రాల్లో పర్యటించి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు చెప్పారు. దాదాపు 99 శాతం మంది ప్రజలు, పౌర సమాజం లోక్‌సభ, అసెంబ్లీలకు జమిలి ఎన్నికలే జరగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో జమిలి ఎన్నికల నిర్వహణపై అడిగిన పలు ప్రశ్నలకు జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి సమాధానాలిచ్చారు.
ఒకే దేశం-ఒకే ఎన్నిక అన్న భావన కొత్తదేమీ కాదు..
ఒకే దేశం - ఒకే ఎన్నికలు (ONOE) అన్న భావన కొత్తదేమీ కాదని తెలిపారు. దేశంలో 1951 నుంచి 1967 మధ్యకాలంలో మొదటి నాలుగు సాధారణ ఎన్నికలు ఒకేసారి జరిగాయని గుర్తు చేశారు. అప్పట్లో మన వద్ద అంతగా మౌలిక వసతులు, లాజిస్టిక్స్ లేకపోయినా ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. ప్రస్తుత కాలంలో సాంకేతికత, లాజిస్టిక్స్ చాలా అభివృద్ధి చెందాయని చెప్పారు. కాబట్టి ఈ విధానం మన దేశానికి సరిగ్గా సరిపోతుందని, ఎంతో ప్రయోజనకరంగానూ ఉంటుందని అభిప్రాయపడ్డారు. తరచూ ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై తీవ్రమైన భారం పడుతుందని చెప్పారు. ముఖ్యంగా ఎన్నికల కారణంగా అసలు పాలన వెనుకబడిపోతుందని చెప్పారు. నిరంతరం ఎన్నికల కోడ్ (Model Code of Conduct) అమలులో ఉండటం వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోతాయన్నారు. ఏకకాల ఎన్నికల వల్ల పాలనపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు.
Also Read : One Nation One Election 2029 | 2029లోనే ‘జమిలి’ సమరం? ఎన్డీయే మాస్టర్ ప్లాన్
ఇది సాధ్యమే..
ఒకే దేశం, ఒకే ఎన్నిక అనేది ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది దేశంలోని ధనాన్ని, మానవ వనరులను ఆదా చేయడమే కాకుండా మన విద్యా రంగం ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేయడానికి సహాయపడుతుందని చెప్పారు. "ఎన్నికల సమయంలో వేలాది పాఠశాలలు మూతపడతాయి. ఉపాధ్యాయులు పోలింగ్ పనుల్లో నిమగ్నమవుతారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సహా యంత్రాంగం కూడా నెలల తరబడి ఎన్నికల విధుల్లోనే బిజీగా ఉండాల్సి వస్తుంది. దీనివల్ల సాధారణ ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని.. ఏకకాలిక ఎన్నికలను నిర్వహించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది సాధ్యం కూడా.
లోక్‌సభ, విధాన సభ, పంచాయతీ.. ఎన్నికలు ఏవైనా వలసలు సర్వసాధారణం. సగటున తరచూ జరిగే ఎన్నికల వల్ల రూ.7 లక్షల కోట్లకుపైగా ఖర్చు అవుతుంది. ప్రజాస్వామ్యం అనేది ప్రధానంగా ప్రజల ఆకాంక్ష. మనం రాజకీయ పార్టీల నాడిని కాదు. ప్రజల నాడిని తెలుసుకోవాలని. మనం ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం ఎందుకు పనిచేయాలి..? మనం ప్రజల ప్రయోజనాలను పరిరక్షించాలి అని ఆయన చెప్పుకొచ్చారు.
జమిలితో ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది
లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలను నియంత్రించే చట్టాలను రూపొందించడానికి పార్లమెంటుకు ఆర్టికల్ 327 అధికారం ఇస్తుందని చెప్పారు. అయితే 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' (ONOE) అనేది కేవలం ఎన్నికల క్యాలెండర్‌ను క్రమబద్ధీకరించడం గురించేనన్నారు. ఎన్నికల ఒకేసారి నిర్వహిస్తే.. ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుంది. అదెలా అంటారా..? ఓటర్ల భాగస్వామ్యం పెరుగుతుంది. ఒకవేళ ఓటర్ల భాగస్వామ్యం తక్కువగా ఉంటే.. దేశం నిజమైన ప్రజాస్వామ్య దేశమని మనం అనలేం. రాష్ట్ర శాసనసభ, పార్లమెంటు ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే వలసదారులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే వారు ఎన్నికలకు అనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోగలరని అభిప్రాయపడ్డారు.
విపక్షాలు దీనికి అంగీకరిస్తాయా..?
రాజకీయాల్లో రేపు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. పరిస్థితులకు తగినట్లు నిర్ణయాలు మారుతుంటాయి. ఈ రోజు ఒక నిర్దిష్ట వైఖరిని తీసుకున్న రాజకీయ పార్టీ, రేపు తన నిర్ణయాన్ని మార్చుకోదని మనం చెప్పలేం. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే జమిలి ఎన్నికలు ఆ పార్టీకి ఖచ్చితంగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఆ పార్టీకి కూడా ఈ విషయం తెలుసు. కానీ, ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించారు కాబట్టి.. వ్యతిరేకిస్తోంది.
ఇది 'ఒకే దేశం, ఒకే తీర్పు' దిశగా సాగుతున్నట్లు కాదా..?
మన ఓటర్లను తక్కువ అంచనా వేయకూడదు. మన ఓటరు చాలా తెలివైనవాడు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలే రాజకీయాల గురించి ఎక్కువగా చర్చించుకుంటారు. గ్రామీణ ప్రజలు తమ మనసులోని మాటను బయటపెట్టరు కానీ, ప్రతి విషయాన్నీ గమనిస్తూనే ఉంటారు. జర్నలిస్టులు వారి అభిప్రాయాల గురించి అడిగినప్పుడు వారు నోరు తెరవరు. ఉదాహరణకు ఢిల్లీలోని ఓటర్లను చూడండి అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్' (AAP)కు ఓటు వేస్తే, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేశారు. గెలుపోటములను పక్కన పెడితే.. ప్రాథమికంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల దేశానికి ఎలా ప్రయోజనం చేకూరుతుందో మనం చూడాలి. రాజకీయ పార్టీలు ఏమి కోరుకుంటున్నాయో కాదు.. దేశం ఏమి కోరుకుంటుందో మనం అర్థం చేసుకోవాలి.
జమిలి విధానం అమల్లోకి వస్తే.. తరచుగా అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి తలెత్తదా..?
ప్రాథమికంగా చెప్పాలంటే.. అవిశ్వాస తీర్మానం అనేదే అరుదుగా జరుగుతుంది. ఏ రాజకీయ పార్టీ కూడా రెండేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని కోరుకోదు. కాబట్టి, అవిశ్వాస తీర్మానాలు చాలా తక్కువగా ఉంటాయి. అవి అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే వస్తాయి. అటువంటి అరుదైన సందర్భాలను మనం సాధారణ నియమంగా పరిగణించలేము. అది అత్యంత అరుదైన సందర్భం అయితే, ఏ రాజకీయ పార్టీ లేదా నాయకుడు కూడా తేలికగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టరు. ప్రభుత్వాన్ని నడిపించడానికే ప్రయత్నిస్తారు. కానీ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోతే.. శాసనసభ ఎలా పనిచేస్తుంది..? చట్టాలను ఎలా ఆమోదించగలదు..? అటువంటి పరిస్థితిలో మనం రాష్ట్రపతి పాలనకు వెళ్లొచ్చు.
రాష్ట్రపతి పాలన సమయంలో చట్టాలు చేసేందుకు పార్లమెంటు రాష్ట్ర శాసనసభ అధికారాలను వినియోగించుకోవచ్చు. అదేవిధంగా అటువంటి పరిస్థితిని పరిష్కరించడంలో ఏవైనా ఆటంకాలు ఉంటే.. బడ్జెట్ వంటి కీలకమైన చట్టాలను ఆమోదించాల్సి ఉంటుంది కాబట్టి మనం పార్లమెంటుకు ఆరు నెలలు లేదా ఒక ఏడాది పాటూ చట్టాలు చేసే అధికారాన్ని కల్పించొచ్చు. రాష్ట్ర కార్యకలాపాలు ఆగిపోయేలా మనం అనుమతించలేము. రాష్ట్రంలో పనులు కొనసాగాలి. రాష్ట్రపతి పాలనలానే.. పార్లమెంటు ఉభయ సభలు రాష్ట్ర శాసనసభ విధులను నిర్వహించగలవు. అయితే, ఈ అంశాలు బిల్లులో భాగంగా లేవు. కానీ రాష్ట్రం సజావుగా ఎలా సాగాలి అనే దాని గురించి మేము తీవ్రంగా ఆలోచిస్తున్నాము అని జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి చెప్పుకొచ్చారు.
బిల్లులోని ప్రతి నిబంధనకు సంబంధించిన సవరణలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు, నిపుణుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు వివరించారు. వ్యవస్థలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి, దేశ ప్రయోజనాలకు అనుగుణంగా అది పనిచేసేలా చూడడానికి ఎలాంటి నిబంధనలు ఉండాలనే అంశంపై న్యాయ విశ్వవిద్యాలయాలు, నిపుణులు, సుప్రీంకోర్టు, ఇతరుల నుంచి ప్రతి క్లాజుకు సంబంధించి అనేక సూచనలు అందినట్లు ఆయన వివరించారు.
Also Read..
‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకం.. దరఖాస్తు ప్రక్రియ షురూ..
రవితేజ ఇరుముడికి రష్మిక మందన్న ఎమోషనల్ రివ్యూ
తాజావార్తలు
- ●One Nation One Election 2029 | 2029లోనే 'జమిలి' సమరం? ఎన్డీయే మాస్టర్ ప్లాన్
- ●Traffic Restrictions | వాహనదారులకు అలర్ట్.. రేపు ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు
- ●Minors Arrest | గేమింగ్ కోసం డబ్బుల్లేవు.. అప్పుడే ఓ తాళం కనబడింది
- ●Malayalam OTT | ఓటీటీలోకి మైండ్ బ్లాక్ ట్విస్ట్‌లతో సాగే మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ - తెలుగులో రిలీజ్
- ●Japan companies in Telangana | అందుకే తెలంగాణ యువతకు జపనీస్ భాష, స్కిల్స్ నేర్పిస్తున్నాం
- ●TTD | బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి సేవ చేయాలనుకుంటున్నారా..? అయితే మీకో గుడ్‌న్యూస్..!

One Nation One Election 2029 | 2029లోనే 'జమిలి' సమరం? ఎన్డీయే మాస్టర్ ప్లాన్

Traffic Restrictions | వాహనదారులకు అలర్ట్.. రేపు ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

Minors Arrest | గేమింగ్ కోసం డబ్బుల్లేవు.. అప్పుడే ఓ తాళం కనబడింది

Malayalam OTT | ఓటీటీలోకి మైండ్ బ్లాక్ ట్విస్ట్‌లతో సాగే మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ - తెలుగులో రిలీజ్






