త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

One Nation One Election 2029 | 2029లోనే ‘జమిలి’ సమరం? ఎన్డీయే మాస్టర్ ప్లాన్

దేశవ్యాప్తంగా 2029లోనే జమిలి ఎన్నికలు తీసుకురావాలని ఎన్డీయే పావులు కదుపుతోంది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ హైకమాండ్, సీఎం రేవంత్ రెడ్డి భిన్న వ్యూహాలు ఏంటంటే?

J

National | Published On Aug 25, 2026, 7.04 pm IST

One Nation One Election 2029 | 2029లోనే ‘జమిలి’ సమరం? ఎన్డీయే మాస్టర్ ప్లాన్

సంక్షిప్త సారాంశం

2034కు బదులుగా 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటే, 22 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం వ్యూహరచన చేస్తోంది. ఈ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధమని, చట్టంలోని నిబంధనల ప్రకారం 2029లో జమిలి ఎన్నికలు నిర్వహించడం సాంకేతికంగా అసాధ్యమని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం జేపీసీకి తేల్చిచెప్పారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నా, తెలంగాణలో మాత్రం 2029లో జమిలి వస్తే ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కి పెరుగుతాయని, తమ ప్రభుత్వ పదవీకాలం మరో ఆరు నెలలు పొడిగించబడుతుందని సీఎం అంచనా వేశారు.

Advertisement
  • 22 రాష్ట్రాలతో కలిసి జమిలికి
  • ఢిల్లీ, గోవా, ఉత్తరాఖండ్ గ్రీన్ సిగ్నల్
  • బిల్లులోని నిబంధనల ప్రకారం సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాతే ఈ చట్టం అమలులోకి రావాలని కాంగ్రెస్ వాదన
  • తెలంగాణ ఎన్నికలు 2028 డిసెంబర్‌లోనా? లేక 2029 జూన్‌లోనా?

త్రినేత్ర.న్యూస్ : దేశ రాజకీయాల్లో ఇప్పుడు 'జమిలి ఎన్నికల' (ఒకే దేశం - ఒకే ఎన్నిక) ఫీవర్ మొదలైంది. ముందుగా అనుకున్న 2034 డెడ్‌లైన్ కాకుండా, 2029 నాటికే దేశవ్యాప్తంగా లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా తమ పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ముందుగానే అసెంబ్లీలను రద్దు చేసి ఈ జమిలి ప్లాన్‌ను అమలు చేయాలని భావిస్తోంది.

ఎన్డీయే మాస్టర్ ప్లాన్ ఏంటి?

ప్రస్తుతం జమిలి ఎన్నికల బిల్లులపై పార్లమెంటరీ జాయింట్ కమిటీ (జేపీసీ) ముమ్మర కసరత్తు చేస్తోంది. 22 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో సుమారు 11 రాష్ట్రాల ఎన్నికలు రాబోయే రెండేళ్లలో జరగాల్సి ఉంది. వీటన్నింటినీ 2029 లోక్‌సభ ఎన్నికలతో క్లబ్ చేయడానికి, 2029 జనవరి నాటికి ఆయా రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రులు, మంత్రుల మండలి అంగీకరిస్తే ఇది సాధ్యమేనని జేపీసీ ఛైర్మన్ పీపీ చౌదరి స్పష్టం చేశారు. ఇప్పటికే ఢిల్లీ, గోవా, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలు ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఎలాగూ ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కీం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు లోక్ సభ ఎన్నికలతో పాటే జరుగనున్నాయి.

11 రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోగలిగితేనే?

రాబోయే రెండేళ్లపాటు ఎన్డీయే తన రాష్ట్ర ప్రభుత్వాలను నిలబెట్టుకుంటుందని భావిస్తే, ఆయా రాష్ట్రాల మంత్రుల మండలి సలహా మేరకు 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలను 2029 జనవరి నాటికి అక్కడి గవర్నర్లు రద్దు చేసే అవకాశం ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 (2)(b) ప్రకారం, అసెంబ్లీని రద్దు చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. సాధారణంగా మంత్రుల మండలి సలహా మేరకు లేదా ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినప్పుడు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకుంటారు.

అసెంబ్లీ రద్దయిన తర్వాత, 1950 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆరు నెలల్లోపు ఎన్నికల సంఘం తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలి. ప్రస్తుతం కమిటీ పరిశీలనలో ఉన్న 'రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు 2024', 'కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు 2024' ప్రకారం.. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగే లోక్‌సభ తొలి సమావేశం అనంతరం ఎన్నికయ్యే అన్ని అసెంబ్లీల పదవీకాలాన్ని కుదిస్తారు. తద్వారా తదుపరి ఎన్నికల సైకిల్‌లో జమిలి ఎన్నికల నిర్వహణకు వీలు కలుగుతుంది. ఒకవేళ ఈ బిల్లులు ఆమోదం పొందితే, మొట్టమొదటి జమిలి ఎన్నికలు వీలైనంత త్వరగా 2034లో మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది.

ఇది రాజ్యాంగ విరుద్ధం: చిదంబరం

జమిలి ఎన్నికలపై కాంగ్రెస్, ఇండియా కూటమి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఇటీవల జేపీసీ ముందు హాజరై తన వాదన వినిపించారు. ప్రజలు ఐదేళ్ల కోసం ఎన్నుకున్న ప్రభుత్వాలను మధ్యలో రద్దు చేయడం ఫెడరల్ వ్యవస్థకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు.

Also Read : One Nation One Election | 2029లో జ‌మిలి సాధ్య‌మే.. రాష్ట్రాల‌దే తుది నిర్ణ‌యం : జేపీసీ చైర్మన్

బిల్లులోని నిబంధనల ప్రకారం సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాతే ఈ చట్టం అమలులోకి రావాలని, కాబట్టి 2029లో జమిలి ఎన్నికలు నిర్వహించడం సాంకేతికంగా, చట్టపరంగా అసాధ్యమని చిదంబరం తేల్చిచెప్పారు. అంతేకాదు, రాజ్యాంగ సవరణలు చేయడానికి ఎన్డీయే ప్రభుత్వానికి ఉభయ సభల్లో తగినంత మెజారిటీ లేదని ఆయన గుర్తుచేశారు.

సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి?

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఈ బిల్లును సిద్ధాంతపరంగా తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కేంద్రం 2029లో జమిలి ఎన్నికలు తీసుకొచ్చినా దీటుగా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

తెలంగాణ ఎన్నికలు వాస్తవానికి 2028 డిసెంబర్‌లో జరగాల్సి ఉంది. ఒకవేళ జమిలి వస్తే లోక్‌సభ ఎన్నికలతో పాటే జరగాలి కాబట్టి, 2029 జూన్ వరకు (మరో ఆరు నెలలు అదనంగా) కాంగ్రెస్ ప్రభుత్వ పదవీకాలం పెరుగుతుందని ఆయన ప్రజలకు వివరించారు.

డీలిమిటేషన్‌తో పెరగనున్న సీట్లు

2029 ఎన్నికల కంటే ముందే దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన కూడా పూర్తవుతుందని రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు. అదే జరిగితే, తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 182కి, లోక్‌సభ స్థానాల సంఖ్య 17 నుంచి 26కి భారీగా పెరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రం జమిలి బిల్లును ఆమోదింపజేసుకోలేకపోతే మాత్రం, షెడ్యూల్ ప్రకారం 2028 డిసెంబర్‌లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.

Advertisement
Advertisement