Teenmar Mallanna | ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా : తీన్మార్ మల్లన్న
Teenmar Mallanna | రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రకటించారు. సెప్టెంబర్ 17 నుంచి పాదయాత్ర చేపడుతానని, ఈ పాదయాత్ర 14 వేల కిలోమీటర్లు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
జెన్ జీ ప్రశ్నలకు తీన్మార్ మల్లన్న సూటి సమాధానాలు
విద్య, వైద్యానికి 40% బడ్జెట్ కేటాయించాలని డిమాండ్
అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం మా పాలసీ
ప్రైవేట్ విద్యా దోపిడీపై పోరాటం కొనసాగిస్తా
రిజర్వేషన్లు పోవాలంటే ముందుగా కుల వ్యవస్థ పోవాలి
సెప్టెంబర్ 17 నుంచి 14 వేల కిలోమీటర్ల పాదయాత్ర
Teenmar Mallanna | త్రినేత్ర.న్యూస్ : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రకటించారు. సెప్టెంబర్ 17 నుంచి పాదయాత్ర చేపడుతానని, ఈ పాదయాత్ర 14 వేల కిలోమీటర్లు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జి బంధారపు నర్సయ్య గౌడ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు చక్రపాణి గౌడ్, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం అరుణ్ పటేల్ ఆధ్వర్యంలో ఈసీఐఎల్ మైదానంలో నిర్వహించిన "Gen Z Adda with Mallanna" కార్యక్రమంలో పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాది మంది విద్యార్థులు హాజరై తమ సమస్యలు, సందేహాలు, అభిప్రాయాలను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో నేరుగా పంచుకున్నారు. విద్య, ఉపాధి, సామాజిక న్యాయం, రాజకీయాలు, రిజర్వేషన్లు, స్కాలర్‌షిప్‌లు వంటి అంశాలపై విద్యార్థులు సంధించిన పదునైన ప్రశ్నలకు మల్లన్న సూటిగా సమాధానాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. నేటి రాజకీయ నాయకులు ప్రజల కంటే ఎక్కువగా ప్రశ్నించే యువతను చూసి భయపడుతున్నారని అన్నారు. సోషల్ మీడియా యుగంలో జనరేషన్ జెడ్ దేశ రాజకీయ దిశను మార్చగల శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు. యువత ప్రశ్నించే ధైర్యం పెంచుకోవాలని, అన్యాయాలపై గళమెత్తాలని పిలుపునిచ్చారు.
ప్రతి విద్యార్థికి పూర్తిగా ఉచిత విద్య
విద్యా రంగంపై మాట్లాడుతూ, దేశంలోనే విద్య కోసం అత్యల్పంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్య రంగాలకు కలిపి బడ్జెట్‌లో కనీసం 40 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మొదటి తరగతి నుంచి ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థికి పూర్తిగా ఉచిత విద్య అందించడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్లు
ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీపై తీవ్ర విమర్శలు గుప్పించిన మల్లన్న, విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న వారిపై నిరంతర పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. RTE-2009 చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్లు కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు.
ప్రశ్నించినందుకే తనపై చర్యలు
విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తన సస్పెన్షన్ వెనుక కారణాలను వివరించారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, ఆకలితో బాధపడుతున్న వారి లెక్కలు ఎందుకు లేవని ప్రశ్నించినందుకే తనపై చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.
పాలిటెక్నిక్ విద్యార్థులకు అండగా నిలుస్తాం..
పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థుల ఆందోళనలపై స్పందిస్తూ, సరైన మౌలిక వసతులు లేకుండా స్కిల్ ఇండియా యూనివర్సిటీ కింద విద్యాసంస్థలను విలీనం చేయడం సరైంది కాదన్నారు. విద్యార్థుల ఉద్యమాలకు తాము అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.
కుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాటం
రిజర్వేషన్ల అంశంపై మాట్లాడుతూ, సమాజంలో కుల వివక్ష కొనసాగుతున్నంత కాలం రిజర్వేషన్లు అవసరమేనన్నారు. రిజర్వేషన్లపై చర్చ చేసే వారు ముందుగా కుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడాలని సూచించారు.
రూ.9,000 కోట్ల మేర బకాయిలు పెండింగ్‌లో
రాష్ట్రంలో పేరుకుపోయిన విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన మల్లన్న, దాదాపు రూ.9,000 కోట్ల మేర బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థుల తరపున గట్టిగా పోరాడతానని హామీ ఇచ్చారు. స్కాలర్‌షిప్‌లు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉప్పల్ నియోజకవర్గం నుంచి చక్రపాణి గౌడ్ పోటీ
రాజకీయంగా కూడా కీలక ప్రకటనలు చేసిన మల్లన్న, 2028 ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఉప్పల్ నియోజకవర్గం నుంచి టీఆర్పీ తరపున చక్రపాణి గౌడ్ పోటీ చేస్తారని వెల్లడించారు. అలాగే సెప్టెంబర్ 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 14 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి రాజ్యాధికారం సాధిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.
అవినీతి శక్తుల తోకలు కత్తిరించడానికే "కత్తెర" గుర్తు
తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎన్నికల గుర్తు "కత్తెర" అని గుర్తు చేస్తూ, ప్రజల జీవితాలను దోచుకుంటున్న అవినీతి శక్తుల తోకలు కత్తిరించడానికే ఈ గుర్తును ఎంచుకున్నామని పేర్కొన్నారు. "విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ నుంచి ఉద్యమాల వరకు పోరాడతాం... యువత భవిష్యత్తు కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది" అని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు.
కార్యక్రమం అనంతరం వివిధ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక మెరిట్ అవార్డులను తీన్మార్ మల్లన్న చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో టీఆర్పీ నాయకులు, యువజన విభాగం ప్రతినిధులు, విద్యార్థి నాయకులు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. హైదరాబాద్‌లో 25న ట్రాఫిక్ ఆంక్షలు..
- ●KRMB | కృష్ణా నది నీటి పంపిణీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
- ●Harish Rao | గుండె తరుక్కుపోతున్నది : హరీశ్‌రావు
- ●BRS Party | 22A బాధితులకు బాసటగా బీఆర్ఎస్ పార్టీ
- ●Telangana Assembly | సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు
- ●తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌లో వలసవాదుల పెత్తనం..!








