త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NHAI Free Flow Tolling | ఇకపై టోల్‌ గేట్ల వద్ద ఆగక్కర్లేదు.. హైస్పీడ్‌లోనే టోల్ కట్

నేషనల్ హైవేలపై ఇక టోల్ బూత్‌లు కనిపించవు. వాహనాలు ఆపకుండానే ఆటోమేటిక్‌గా ఫాస్టాగ్ ద్వారా కట్ అయ్యే కొత్త రూల్‌ను NHAI తప్పనిసరి చేసింది. పూర్తి వివరాలు ఇవే

J

National | Published On Nov 2, 2026, 5.17 pm IST

NHAI Free Flow Tolling | ఇకపై టోల్‌ గేట్ల వద్ద ఆగక్కర్లేదు.. హైస్పీడ్‌లోనే టోల్ కట్

సంక్షిప్త సారాంశం

భవిష్యత్ జాతీయ రహదారులన్నింటికీ మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టోలింగ్ విధానాన్ని NHAI తప్పనిసరి చేసింది. భౌతిక టోల్ బూత్‌ల స్థానంలో రోడ్డుపై ఏర్పాటు చేసే ఓవర్‌హెడ్ గ్యాంట్రీలు, ANPR కెమెరాలు, RFID రీడర్ల ద్వారా కదులుతున్న వాహనాల నుంచే ఫాస్టాగ్ టోల్ వసూలు చేస్తారు. టోల్ ప్లాజాల కోసం భారీగా భూసేకరణ చేయాల్సిన అవసరం లేకుండా గరిష్ఠంగా 8 లేన్లకే పరిమితి విధించారు. ఇంకా టోల్ ప్లాజా నిర్మాణం ప్రారంభం కాని, ప్రస్తుతం పనులు జరుగుతున్న అర్హత గల ప్రాజెక్టులకు కూడా ఈ నయా నిబంధన వర్తిస్తుంది.

Advertisement
  • NHAI సంచలన గైడ్‌లైన్స్

NHAI Free Flow Tolling | త్రినేత్ర న్యూస్ : భారత జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు అతిపెద్ద ఊరట కలగనుంది. ఇకపై టోల్ ప్లాజాల వద్ద బారులు తీరాల్సిన అవసరం లేకుండా, రన్నింగ్‌లోనే టోల్ రుసుమును ఆటోమేటిక్‌గా కట్ చేసే ‘మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో’ (MLFF) వ్యవస్థను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తప్పనిసరి చేసింది. భవిష్యత్తులో నిర్మించే అన్ని జాతీయ రహదారులతో పాటు, ఇంకా టోల్ బూత్‌ల నిర్మాణం మొదలుకాని ప్రస్తుత ప్రాజెక్టులకు కూడా ఈ నిబంధనలను వర్తింపజేయనున్నట్లు స్పష్టం చేసింది.

బూత్‌ల స్థానంలో గ్యాంట్రీలు.. భారీ భూసేకరణకు చెక్

ప్రస్తుతం ఆరు, ఎనిమిది లేన్ల జాతీయ రహదారులపై—ముఖ్యంగా ప్రధాన నగరాల సమీపంలో ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఏకంగా 20 నుంచి 32 లేన్లతో భారీ టోల్ ప్లాజాలను నిర్మిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా వేల కోట్ల విలువైన అదనపు భూమిని సేకరించాల్సి వస్తోంది.

తాజా ఉత్తర్వులతో ఈ సంప్రదాయ టోల్ బూత్‌లకు స్వస్తి పలకనున్నారు. రోడ్డుపై ప్రత్యేకంగా నిర్మించే ఎత్తైన ‘ఓవర్‌హెడ్ గ్యాంట్రీలు’ (Overhead Gantries) పైనే ఎలక్ట్రానిక్ టోల్ పరికరాలను అమర్చుతారు. ఫలితంగా టోల్ ప్లాజాల కోసం అదనపు భూమిని సేకరించాల్సిన అవసరం పూర్తిగా తప్పుతుంది. కొత్త డిజైన్ ప్రకారం ప్లాజా పరిధి గరిష్ఠంగా కేవలం 8 లేన్లకే పరిమితం కానుంది.

రన్నింగ్‌లోనే ఫాస్టాగ్ డిడక్షన్.. ఎలా పనిచేస్తుందంటే?

వాహనాలు ఆగకుండా వేగంగా వెళ్తున్నప్పుడే టోల్ వసూలు చేయడానికి రెండు ప్రధాన సాంకేతికతలను అనుసంధానించనున్నారు.

హై-పెర్ఫార్మెన్స్ RFID రీడర్లు: గ్యాంట్రీపై ఉండే ఈ శక్తిమంతమైన రీడర్లు వేగంగా వెళ్లే వాహనాలపై ఉన్న ఫాస్టాగ్‌ను క్షణాల్లో రీడ్ చేస్తాయి.

ANPR కెమెరాలు: 'ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్' కెమెరాలు వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను హై-రిజల్యూషన్‌లో స్కాన్ చేస్తాయి.

ఈ రెండు టెక్నాలజీల ద్వారా కదులుతున్న వాహనం నుంచే నిర్దేశిత రుసుము ఫాస్టాగ్ ఖాతా నుండి ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. ఈ సరికొత్త డిజైన్ వల్ల ఒక్కో లేన్ ద్వారా గంటకు దాదాపు 600 వాహనాలు ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా సాఫీగా వెళ్లిపోవచ్చని NHAI లెక్కగట్టింది. అత్యవసర వాహనాలు, భారీ పరిమాణపు రవాణా వాహనాల కోసం అదనంగా ఒక స్పేర్ లేన్‌ను కేటాయిస్తారు.

కొత్త టోల్ డిజైన్ భద్రతా ప్రమాణాలు

ఫ్రీ-ఫ్లో టోల్ కేంద్రాల కోసం NHAI ప్రత్యేక నిబంధనలను ఖరారు చేసింది. గ్యాంట్రీలకు కింద కనీసం 6 మీటర్ల క్లియరెన్స్ (ఎత్తు) ఉండాలి. వాహనదారులను ముందుగానే అప్రమత్తం చేయడానికి టోల్ పాయింట్‌కు కిలోమీటరు ముందే 'వేరియబుల్ మెసేజ్ సైన్‌బోర్డులు', మార్గమధ్యంలో తగినంత హై-మాస్ట్ లైటింగ్ ఉండాలి. అంతేకాకుండా, మలుపుల్లో కాకుండా వాహనాలు నేరుగా వెళ్లే స్ట్రెయిట్ రోడ్డు మార్గాల్లోనే ఈ పాయింట్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.

నిర్మాణంలో ఉన్న రోడ్ల సంగతేంటి?

ఇప్పటికే డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) దశలో ఉన్న రాబోయే ప్రాజెక్టులకు సంబంధించిన బిడ్డింగ్ పత్రాల్లోనే ఈ మార్పులను చేర్చనున్నారు. మరోవైపు, కాంట్రాక్టులు పూర్తయి పనులు నడుస్తున్న రోడ్లలో.. ఒకవేళ ఇంకా టోల్ ప్లాజా నిర్మాణం మొదలుపెట్టకపోతే, వెంటనే వర్క్ పరిధిని సవరించి ఈ MLFF విధానాన్నే అమలు చేయాలని ప్రాజెక్ట్ డైరెక్టర్లను NHAI ఆదేశించింది.

అయితే రెండు లేన్ల పేవ్‌డ్ షోల్డర్ రహదారులకు పాత పద్ధతే కొనసాగుతుందని, ప్రస్తుతం ఇప్పటికే వాడుకలో ఉన్న అన్ని టోల్ ప్లాజాలను తక్షణమే దీని కిందకు మార్చడం లేదని అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్:

Automatic Toll Deduction Moving VehiclesFASTag ANPR Cameras Toll CollectionMulti Lane Free Flow Toll PlazasNational Highway Toll Rules IndiaNHAINHAI Free Flow TollingNHAI New Toll Plaza RulesNo Land Acquisition Toll PlazasToll Plaza
Advertisement
Advertisement