త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | రోడ్డు ప్రమాదాల నివారణే ప్ర‌భుత్వ‌ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar | రాష్ట్రంలో రహదారి భద్రతను పటిష్టం చేయడం, ప్రమాదాలను అరికట్టడం, ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు.

G

Telangana | Published On Oct 17, 2026, 11.53 am IST

Ponnam Prabhakar | రోడ్డు ప్రమాదాల నివారణే ప్ర‌భుత్వ‌ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్‌: రాష్ట్రంలో రహదారి భద్రతను పటిష్టం చేయడం, ప్రమాదాలను అరికట్టడం, ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో రహదారి భద్రతా నిధుల సమర్థ నిర్వహణ, పర్యవేక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింద‌న్నారు. ఈమేర‌కు ఉత్తర్వులు (జీఓ నం. 48) జారీ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. మోటారు వాహనాల పన్నుల (సవరణ) చట్టం ప్రకారం వసూలైన రహదారి భద్రతా సెస్ మొత్తాన్ని రహదారి భద్రతా (నాన్-లాప్సబుల్) నిధికి కేటాయించామ‌న్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం సీఎం చైర్మ‌న్‌గా, ర‌వాణా మంత్రి వైస్ చైర్మ‌న్‌గా ఏర్పాటైన చట్టబద్ధమైన ‘రాష్ట్ర రహదారి భద్రతా మండలి’ ఈ నిధి నిర్వహణ, పరిపాలనను చేపడుతుంద‌ని చెప్పారు.

నిధుల వినియోగంలో పారదర్శకత కోసం తెలంగాణ (Telangana) ఆన్‌లైన్ అకౌంటింగ్ విధానాన్ని అన్ని జిల్లాలకు విస్తరించాలని నిర్ణయించామ‌ని తెలిపారు. దీని ద్వారా రాబడులు, ఖర్చులను ఎప్పటికప్పుడు సమీక్షించే వీలు కలుగుతుంద‌న్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలలోని ఈ నిధుల ఖాతాలన్నింటినీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) ద్వారా తప్పనిసరిగా ఆడిట్ చేయిస్తార‌ని వెల్ల‌డించారు. సుప్రీంకోర్టు రహదారి భద్రతా కమిటీకి అందుబాటులో ఉండేలా వివరాలను కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారని తెలిపారు.

జిల్లా స్థాయి కమిటీలు

రాష్ట్ర‌వ్యాప్తంగా జిల్లా రహదారి భద్రతా కమిటీలను వెంటనే క్రియాశీలకంగా చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించామ‌న్నారు. ప్రతి నెల జిల్లా కమిటీలు త‌ప్ప‌నిస‌రిగా సమావేశాలు నిర్వహించాల‌ని వెల్ల‌డించారు. ప్రత్యేకంగా జిల్లా రహదారి భద్రతా సమన్వయకర్తలను (Coordinators) నియమించడంతో పాటు జిల్లా భద్రతా ప్రణాళికలను సమర్పించాల‌న్నారు. పోలీస్, ఆరోగ్యం, ఆర్ అండ్ బీ, విద్యా శాఖ, జీహెచ్‌ఎంసీ (GHMC)లు తమ శాఖల తరఫున నోడల్ అధికారులను నియమించాల‌న్నారు.

రోడ్డు భద్రతపై తీసుకున్న చర్యలకు సంబంధించి టీజీ-టీఎంఏఆర్ఎస్ (TG-TMARS), ఆర్ అండ్ బీ, ప్రజారోగ్య శాఖ, పంచాయతీరాజ్, ఎన్‌హెచ్ఏఐ, 108 (EMRI), పాఠశాల/కళాశాల విద్యా శాఖలు, ఎక్సైజ్, మున్సిపల్ శాఖలు ‘లీడ్ ఏజెన్సీ ఫర్ రోడ్ సేఫ్టీ’కి ప్రతి త్రైమాసికంలో యాక్షన్ టేకెన్ రిపోర్టులను సమర్పించాల్సి ఉంటుంద‌ని చెప్పారు. పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ (రహదారి భద్రత) కార్యాలయాన్ని రాష్ట్ర రహదారి భద్రతా మండలి పరిధిలోకి తీసుకువచ్చి శాఖల మధ్య పూర్తి సమన్వయం సాధిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సమగ్ర విధానం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించి, రహదారులను ప్రయాణికులకు సురక్షితంగా మార్చడమే ప్రజా ప్రభుత్వ సంకల్పమని పునరుద్ఘాటించారు.

Advertisement
Advertisement