Nitish Kumar | రాజ్యసభకు వెళ్తున్నా : నితీశ్ కుమార్
Nitish Kumar | బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జేడీయూ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) రాజ్యసభ (Rajya Sabha)కు వెళ్తున్నారు.
Nitish Kumar | బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జేడీయూ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) రాజ్యసభ (Rajya Sabha)కు వెళ్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే గురువారం స్వయంగా ప్రకటించారు. ఈ సందర్భంగా బీహార్ ఓటర్లను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఎమోషనల్ ట్వీట్ పెట్టారు. దాదాపు రెండు దశాబ్దాలుగా తనకు మద్దతు ఇచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
"రెండు దశాబ్దాలకుపైగా నాపై నమ్మకం ఉంచి మద్దతుగా నిలిచారు. ఆ నమ్మకంతోనే అంకితభావంతో పనిచేయగలిగాము. నా పార్లమెంటరీ జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచే మనసులో ఒక కోరిక ఉండేది. రాష్ట్ర స్థాయిలో రెండు చట్టసభలకు (అసెంబ్లీ, కౌన్సిల్), పార్లమెంట్‌లో రెండు సభలకు (లోక్‌సభ, రాజ్యసభ) ప్రాతినిధ్యం వహించాలని అనుకున్నాను. ఆ ఆకాంక్షకు అనుగుణంగానే త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాజ్యసభ ఎంపీగా నా ప్రయాణాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాను. బీహార్‌తో నాకున్న అనుబంధం భవిష్యత్తులో కూడా ఇలానే కొనసాగుతుందని నేను హామీ ఇస్తున్నాను. బీహార్ అభివృద్ధికై పనిచేయాలన్న నా సంకల్పం ఎప్పటికీ చెక్కుచెదరదు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి నా పూర్తి సహకారం ఉంటుంది" అని నితీశ్ కుమార్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
ఈ ప్రకనటతో రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రిగా కొనసాగిన సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) తన పదవికి రాజీనామా చేయనున్నారు. నీతీశ్ వారసుడిగా ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్నారని సమాచారం. ఇక బీజేపీకి చెందిన నేత బిహార్‌కు సీఎం అవుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీహార్‌లో 5 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో ఎన్డీఏ మిత్రపక్షమైన జేడీయూ రెండు స్థానాల్లో పోటీచేస్తున్నది. మిగిలిన మూడు చోట్ల బీజేపీ, ఇతర మిత్రపక్షాలకు కేటాయించారు.
రికార్డు స్థాయిలో 10 సార్లు సీఎంగా..
గతేడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాలకు గాను బీజేపీ కూటమి 202 స్థానాల్లో ఘన విజయం సాధించింది. అందులో బీజేపీకి 89 సీట్లు రాగా, జేడీయూ 85 చోట్ల, లోక్ జనశక్తి పార్టీ (రాంవిలాస్) 19 స్థానాలచొప్పున గెలుపొందాయి. ముఖ్యమంత్రిగా నాలుగు నెలలు మాత్రమే కొనసాగిన నితీశ్ కుమార్ తాజాగా తన పదవి నుంచి తప్పుకుని రాజ్యసభకు వెళ్తుండటం గమనార్హం. దీంతో సీఎంగా తన 22ఏళ్ల రికార్డుకు బ్రేక్ పడుతుంది. ఇప్పటి వరకు బీహార్ సీఎంగా నితీశ్ 10 సార్లు పనిచేశారు.
కుర్మి వర్గానికి చెందిన నితీశ్ కుమార్ 1951, మార్చి 1న జన్మించారు. 1972లో బీహార్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి నితీశ్ మెకానికల్ ఇంజినీరింగ్ పట్టా పొందారు. తొలుత బీహార్ రాష్ట్ర విద్యుత్ బోర్డులో పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రముఖ సోషలిస్టు నాయకులైన జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, ఎస్‌ఎన్ సిన్హా, వీపీ సింగ్‌లతో కలిసి పనిచేశారు.
1974 నుంచి 1977 మధ్య జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో నితీశ్ పాల్గొన్నారు. ఎస్‌ఎన్ సిన్హా నేతృత్వంలోని జనతా పార్టీలో చేరారు. 1977లోనే తొలిసారి హర్‌నౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనతా పార్టీ టికెట్‌పై పోటీచేసి ఓడిపోయారు. 1985లో అదే స్థానం నుంచి గెలుపొంది మొదటిసారిగా శాసన సభలో అడుగుపెట్టారు. 1989లో జనతాదళ్ జనరల్ సెక్రటరీ పదవిని చేపట్టారు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బాడ్ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత మొత్తంగా ఆరుసార్లు ఆయన పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
ఏడు రోజుల సీఎంగా..
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నితీశ్ తొలిసారి ముఖ్యమంత్రిగా మార్చి 2000లో బాధ్యతలు చేపట్టారు. 324 మంది సభ్యులున్న అసెంబ్లీలో అప్పుడు ఎన్‌డీఏకు 151 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మరోవైపు లాలూ చేతిలో 159 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిద్దరికీ సరిపడా ఆధిక్యం (163) దక్కలేదు. అయితే, బల పరీక్షకు ముందే నితీశ్ రాజీనామా చేశారు. అలా ఆయన ఏడు రోజులపాటే సీఎంగా కొనసాగారు.
ఇక నితీశ్ పూర్తిస్థాయిలో ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగింది మాత్రం 2005లోనే. ఆ తర్వాతి ఎన్నిక (2010)ల్లోనూ ఆయనే విజయం సాధించారు. అయితే, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చిన జేడీయూ విడిగా పోటీచేసింది. నితీశ్ రాజీనామా అనంతరం జీతన్ రామ్ మాంఝీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీతో పొత్తుపెట్టుకున్న నితీశ్.. ఘన విజయం సాధించారు. దీంతో మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే తేజస్వి యాదవ్‌పై అవినీతి ఆరోపణలు వెలుగుచూడటంతో మహా కూటమి బీటలు వారింది. దీంతో సీఎం పదవికి నితీశ్ రాజీనామా చేశారు. అయితే, వెంటనే ఎన్‌డీఏతో చేతులు కలిపి మళ్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 2020 ఎన్నికల్లోనూ ఎన్‌డీఏతో కలిసే నితీశ్ బరిలోకి దిగారు. నితీశ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ జేడీయూకి తక్కువ సీట్లు రావడంతో ఆయనపై బీజేపీ నుంచి ఒత్తిడి పెరిగింది. రెండేండ్లపాటు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడిపిన నితీశ్ మళ్లీ యూ టర్న్ తీసుకొని ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2022 ఆగస్టులో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్‌ను నియమించారు. అనంతరం జరిగిన పరిణామాలతో నితీశ్ మరోసారి ఎన్డీఏతో చేతులు కలిపారు.
Also Read..
Gold Silver Prices | పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధర
US Senate | ట్రంప్‌కు ఊరట.. ఇరాన్‌పై సైనిక చర్యకు అమెరికా సెనేట్ మద్దతు
Sonu Sood | వార్ వేళ వారికి ఉచిత బస.. మరోసారి మంచి మనసు చాటుకున్న రియల్ హీరో సోనూసూద్
తాజావార్తలు
- ●Man Sleeping on Bull | నడి రోడ్డుపై ఎద్దు ఒడిలో హాయిగా నిద్ర.. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ బ్రో.. వీడియో వైరల్
- ●Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కండి
- ●CM Revanth Reddy | కిచెన్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. మనువడి కోసం గుండ్రంగా లేని డజన్ పూరీలు
- ●Monsoon Travel India | ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? భారీ వర్షాలు, వరదల వల్ల ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిన టూరిస్ట్ ప్లేసులివే..!
- ●Janhvi Kapoor | జాన్వీ చేతిపై బాయ్‌ఫ్రెండ్ పేరు - లవ్ స్టోరీని కన్ఫర్మ్ చేసినట్లేనా?
- ●Musi Riverfront | మూసీ రివర్‌ఫ్రంట్ పనులను పరిశీలించిన సీఎస్ సంజయ్ జాజు

Man Sleeping on Bull | నడి రోడ్డుపై ఎద్దు ఒడిలో హాయిగా నిద్ర.. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ బ్రో.. వీడియో వైరల్

Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కండి

CM Revanth Reddy | కిచెన్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. మనువడి కోసం గుండ్రంగా లేని డజన్ పూరీలు

Monsoon Travel India | ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? భారీ వర్షాలు, వరదల వల్ల ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిన టూరిస్ట్ ప్లేసులివే..!






