త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NDA | ఎన్డీయేలోకి టీఎంసీ ఎంపీలు.. ఇక బీజేపీకి చంద్ర‌బాబు అవ‌స‌రం లేన‌ట్లేనా?

G

National | Published On Jun 10, 2026, 1.30 pm IST

NDA | ఎన్డీయేలోకి టీఎంసీ ఎంపీలు.. ఇక బీజేపీకి చంద్ర‌బాబు అవ‌స‌రం లేన‌ట్లేనా?
Advertisement

NDA | త్రినేత్ర‌.న్యూస్‌: కేంద్ర ప్ర‌భుత్వంపై బీజేపీ (BJP) ప‌ట్టు పెంచుకుంటున్న‌దా?. ఇక‌పై ద‌క్షిణాది పార్టీల మ‌ద్ద‌తు అవ‌స‌రం లేన‌ట్లేనా?. 16 మంది ఎంపీల బ‌లంతో ఎన్డీయే (NDA) స‌ర్కార్‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబు (Chandrababu Naidu) ఆధిప‌త్యం ఇక చెల్ల‌న‌ట్లేనా? కేంద్రంలో టీడీపీ (TDP) అధ్య‌క్షుడి ప్రాధాన్యం మార‌నుందా?. ప‌శ్చిమ‌బెంగాల్‌లో మాజీ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీపై తిరుగుబాటు చేసిన 20 మంది టీఎంసీ (TMC) ఎంపీలు ప్ర‌ధాని మోదీ ప్ర‌భుత్వాని సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో.. కేంద్రంలో ఇక‌పై చంద్రబాబు చెప్పిన మాట చెల్ల‌ద‌నే చ‌ర్చ సాగుతున్న‌ది.

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో తిరుగులేని ఆధిక్యంతో బెంగాల్‌లో 15 ఏండ్ల దీదీ పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడిన బీజేపీ.. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లో త‌న బ‌లం పెంచుకునేందుకు వేగంగా పావులు క‌దిపింది. రాష్ట్రంలో టీఎంసీని నిలువునా చీల్చి కేంద్రంలో తాను ప్ర‌యోజ‌నం పొందాల‌ని చూస్తున్న‌ది. లోక్‌స‌భ‌, రాజ్య‌భ‌లో బొటాబొటీ ఆధిక్యంతో నెట్టుకొస్తున్న బీజేపీ తిరుగులేని మెజార్టీ సంపాదించుకోవాల‌ని చూస్తున్న‌ది. ఇందులో భాగంగా 20 మంది టీఎంసీకి చెందిన ఎంపీలు ఎన్డీయే ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు లోక్‌స‌భ స్పీక‌ర్‌కు లేఖ అందేశారు. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న కూట‌మిలో బీజేపీ త‌ర్వాత అతిపెద్ద పార్టీగా ఉన్న టీడీపీకి చెక్ పెట్టిన‌ట్ల‌యింది. ఆ పార్టీకి 16 మంది ఎంపీల బ‌లం మాత్ర‌మే ఉన్న‌ది. అదే టీఎంసీ చీలిక వ‌ర్గానికి 20 మంది ఎంపీలు ఉండ‌టంలో ఎన్డీయే కూట‌మిలో పార్టీల బ‌లాబ‌లాలు తారుమ‌ర‌య్యాయి.

టీఎంసీ రాక‌తో మారిన లెక్క‌లు..

మ‌రోవైపు త‌మిళ‌నాడు ఎన్నిక‌లు ఇండియా కూట‌మిలోనూ చీలిక తెచ్చిన విష‌యం తెలిసిందే. డీఎంకే కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న కాంగ్రెస్‌.. టీవీకే ప్ర‌భుత్వ ఏర్పాటులో ఏక‌ప‌క్షంగా విజ‌య్‌కి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. దీంతో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే క్ర‌మంగా ఇండియా కూట‌మికి దూర‌మ‌వుతున్న‌ది. ఇటీవ‌ల ఢిల్లీలో జ‌రిగిన కూట‌మి స‌మావేశానికి కూడా డీఎంకే హాజ‌రుకాలేదు. పార్ల‌మెంటులోనూ తాము కాంగ్రెస్ ఎంపీలతో కూర్చునేది లేద‌ని, త‌మ‌కు ప్ర‌త్యేక సీట్లు కేటాయించాల‌ని స్పీక‌ర్‌కు లేఖ రాసింది. అదేవిధంగా రాజ్య‌స‌భ‌లోనూ బీజేపీ బ‌లం పెంచుకుంటున్న‌ది.

అమిత్ షా వ్యాఖ్య‌లతో బ‌లం..

ఈక్ర‌మంలో కేవ‌లం 16 మంది స‌భ్యులున్న టీడీపీపై ఆధార‌ప‌డ‌టం ఇక‌పై త‌గ్గించాల‌ని కేంద్రంలో అధికార బీజేపీ అధిష్ఠానం నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఇక‌పై ఒంట‌రిగానే ఎన్నిక‌ల్లో పోటీచేస్తామ‌ని, సొంతంగానే ప్ర‌భుత్వాలు ఏర్పాటు చేయ‌డమే ల‌క్ష్యంగా ప‌నిచేస్తామ‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిషా వ్యాఖ్య‌లే దీనికి నిద‌ర్శ‌నమ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ద‌క్షిణాది రాష్ట్రాల‌పై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ చేస్తున్నామ‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు. బీజేపీ మ‌ద్ద‌తు లేకుండా ఏపీలో టీడీపీ మ‌రోసారి అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మేన‌ని పేర్కొంటున్నారు. ఇక‌పై కేంద్రంలో చంద్ర‌బాబు మాట‌లకు బీజేపీ ఏక‌ప‌క్షంగా వంత పాడే అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు.

లోక్‌స‌భ‌లో పార్టీల బ‌లాబ‌లాలు

ఎన్డీయే కూట‌మి..
లోక్‌స‌భ‌లో మొత్తం 543 స్థానాలకుగానూ ఎన్‌డీఏ కూటమికి 292 మంది ఎంపీల‌తో స్పష్టమైన మెజార్టీ ఉంది. వీరికి తాజాగా మ‌రో 20 మంది ఎంపీలు తోడ‌వ‌డంతో కూట‌మి బ‌లం 312కు పెరిగింది. ఎన్డీయే కూట‌మిలో పార్టీల బ‌లాలు చూస్తే..

  • బీజేపీ (BJP)- 240
  • టీఎంసీ రెబెల్స్ (TMC Rebel)- 20 (వెలుపలి నుంచి మద్దతు)
  • టీడీపీ (TDP)- 16
  • జేడీయూ (JD(U))- 12
  • శివసేన (SHS)- 7
  • ఎల్జేపీ రామ్ విలాస్ (LJP-RV)- 5
  • ఇతర మిత్రపక్షాలు (జేడీఎస్‌, జేఎస్పీ, ఆర్ఎల్డీ, ఏడీఎస్ తదితర పార్టీలు): 12

తాజాగా టీఎంసీ మద్దతుతో మోదీ ప్రభుత్వం పార్లమెంటులో రాజ్యాంగ సవరణలకు అవసరమైన మూడింట రెండొంతుల (2/3) మెజారిటీ దిశగా బ‌లాన్ని కూడ‌గట్టుకుంటున్న‌ది. వైఎస్సార్ కాంగ్రెస్, బీజూ జనతా దళ్, శిరోమణి అకాలీదళ్ వంటి తటస్థ పార్టీలు, అవసరమైన వేళల్లో ఇండీ కూటమిలోని కొన్ని కీలక ప్రాంతీయ శక్తులు కూడా మద్దతు పలికే వాతావరణం కనిపిస్తున్న‌ది. దీంతో లోక్‌సభలో 362 మార్కును దాటడం కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం కష్టసాధ్యం కాదనేది స్పష్టమవుతున్న‌ది.

ఇండియా కూట‌మి..

లోక్‌సభలో కాంగ్రెస నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షమైన ఇండియా (INDIA) కూటమి బలం 214 స్థానాలుగా ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఈ కూటమి 234 స్థానాలను గెలుచుకుంది. అయితే పశ్చిమ బెంగాల్‌కు చెందిన టీఎంసీ (TMC) ఎంపీలు 20 మంది మమతా బెనర్జీపై తిరుగుబాటు చేసి, ఎన్‌డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. దీంతో కూటమి బలం 214కు పడిపోయింది. మ‌రోవైపు డీఎంకే కూడా ఇండీ కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో కూట‌మి బ‌లం మ‌రింత త‌గ్గ‌నుంది.

  • కాంగ్రెస్- 99
  • సమాజ్‌వాదీ పార్టీ (SP)- 37
  • డీఎంకే (DMK)- 22
  • శివసేన ఉద్ధవ్ థాకరే (SS-UBT)- 9
  • ఎన్సీపీ శరద్ పవార్ (NCPSP)- 8
  • రాష్ట్రీయ జ‌న‌తా దళ్ (RJD): 4
  • ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)- 3
  • సీపీఐ, సీపీఎం, జేఎంఎం, ఐయూఎంఎల్‌- 32
Advertisement
Advertisement