త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

iPhones to Moon | ఐఫోన్ల‌తో చంద్రుడి వ‌ద్ద‌కు వెళ్లిన వ్యోమ‌గాములు.. చ‌రిత్ర‌లో తొలిసారి

iPhones to Moon | 50 ఏండ్ల త‌ర్వాత చంద్రుడి వద్దకు మానవులను పంపేందుకు ఉద్దేశించిన ‘ఆర్టెమిస్‌-2’లో భాగంగా నాసా చారిత్రాత్మ‌క నిర్ణ‌యం తీసుకుంది. లోతైన అంత‌రిక్షంలోకి వెళ్తున్న త‌మ వ్యోమ‌గాముల‌కు (astronauts) తొలిసారి వ్య‌క్తిగ‌త ఐఫోన్ల‌ను తీసుకెళ్లేందుకు (iPhones to Moon) అనుమ‌తించింది.

D

National | Published On Apr 2, 2026, 3.05 pm IST

iPhones to Moon | ఐఫోన్ల‌తో చంద్రుడి వ‌ద్ద‌కు వెళ్లిన వ్యోమ‌గాములు.. చ‌రిత్ర‌లో తొలిసారి
Advertisement

iPhones to Moon | అంతరిక్ష ప్రయోగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. 50 ఏండ్ల త‌ర్వాత చంద్రుడి వద్దకు మానవులను పంపేందుకు ఉద్దేశించిన ‘ఆర్టెమిస్‌-2’ను అమెరికా అంతరిక్ష సంస్థ (NASA) ప్రయోగించింది. ఈ మిష‌న్‌లో భాగంగా నాసా చారిత్రాత్మ‌క నిర్ణ‌యం తీసుకుంది. లోతైన అంత‌రిక్షంలోకి వెళ్తున్న త‌మ వ్యోమ‌గాముల‌కు (astronauts) తొలిసారి వ్య‌క్తిగ‌త ఐఫోన్ల‌ను తీసుకెళ్లేందుకు (iPhones to Moon) అనుమ‌తించింది. త‌మ వ్య‌క్తిగ‌త క్ష‌ణాల‌ను, అద్భుత‌మైన దృశ్యాల‌ను బంధించేందుకు వ్యోమ‌గాముల‌ను ఐఫోన్ల‌ను ఉప‌యోగించుకునే వెసులుబాటు క‌ల్పించింది నాసా. ఇలా త‌న సిబ్బందికి భూ క‌క్ష‌ను దాటి వ్య‌క్తిగ‌త స్మార్ట్‌ఫోన్‌ల‌ను తీసుకెళ్లేందుకు నాసా అనుమ‌తించ‌డం చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి కావ‌డం విశేషం.

అయితే, డీప్ స్పేస్ ప్రయాణంలో ఫోన్ల వాడ‌కంపై క‌ఠిన నిబంధ‌న‌లు ఉంటాయి. ఈ ఫోన్లను పూర్తిగా 'ఏరోప్లేన్ మోడ్'లోనే ఉంచుతారు. అంటే ఇవి కేవలం హై-ఎండ్ కెమెరాలుగా మాత్రమే పనిచేస్తాయి. ప్రయాణ సమయంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) మీదుగా వెళ్తున్నప్పుడు, అక్కడి వై-ఫైకి కనెక్ట్ అయి ఫొటోలు, ఈ-మెయిల్స్ పంపే అవకాశం ఉంటుంది. కానీ, వాయిస్ కాల్స్ చేసుకోవడం మాత్రం సాధ్యం కాదు.

వ్యోమగాములు వినియోగించే పరికరాలను ఆధునికీకరించే ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌మన్ తెలిపారు. ఈ విష‌యాన్ని ఫిబ్ర‌వ‌రిలోనే ఆయ‌న ప్రకటించారు. "మా వ్యోమగాములు తమ కుటుంబం కోసం ప్రత్యేక క్షణాలను బంధించుకోవడానికి, ప్రపంచంతో స్ఫూర్తిదాయకమైన చిత్రాలు, వీడియోలను పంచుకోవడానికి అవసరమైన సాధనాలను అందిస్తున్నాం" అని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు.

నింగిలోకి దూసుకెళ్లిన ఆర్టెమిస్ -2 రాకెట్..

‘ఆర్టెమిస్‌-2’ మిష‌న్‌లో భాగంగా బుధ‌వారం సాయంత్రం 6.35 గంట‌ల‌కు (అమెరికా కాల‌మానం ప్ర‌కారం) నలుగురు వ్యోమగాములతో కూడిన ‘ఓరియన్‌’ రాకెట్ ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి జాబిల్లి దిశగా నింగిలోకి దూసుకెళ్లింది. ఆర్టెమిస్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా వ్యోమగాముల సహితంగా అమెరికా జరుపుతున్న మొదటి ప్రయోగం ఆర్టెమిస్‌ – IIనే కావ‌డం విశేషం. చంద్రుడి వద్దకు తొలిసారిగా ఓ మహిళ, ఓ నల్లజాతీయుడు, ఓ కెనడియన్ ఇందులో వెళ్తున్నారు. మిష‌న‌ల్ భాగంగా ఓరియ‌న్ రాకెట్‌ చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంగా వెళ్లి, దాన్ని చుట్టి రానుంది. నలుగురు వ్యోమగాములు పది రోజులపాటు రాకెట్‌లోనే ప్రయాణిస్తారు. చంద్రుడి క‌క్ష్య‌పై ప‌రిశోధ‌న‌లు జ‌రిపి తిరిగి భూమిపైకి వ‌స్తారు. వ్యోమగాములు పసిఫిక్‌ మహాసముద్రంలో ల్యాండ్‌ అయ్యేలా నాసా ఏర్పాట్లు చేస్తున్న‌ది. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో జాబిల్లిపైకి మానవులను పంపించే మార్గం సుగమం అవుతుంది.

Also Read..

రాహుల్‌జీ.. హేట్ స్పీచ్ బిల్లుపై జోక్యం చేసుకోండి: రాహుల్‌కు దాసోజు బ‌హిరంగ‌ లేఖ‌

పెట్ట‌రా పేరు 'అమ‌రావ‌తి'.. లేక‌పోతే పిల‌వ‌రా పేరు 'క‌మ్మ‌రావ‌తి' : ఎంపీ రేణుకా చౌద‌రి

చిక్కుల్లో న‌టి సోనాలి బింద్రే.. త‌న భూమిని క‌బ్జా చేశారంటూ రైతు ఫిర్యాదు

Advertisement
Advertisement