త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Shravan Kumar | రాహుల్‌జీ.. ‘హేట్ స్పీచ్’ బిల్లుపై జోక్యం చేసుకోండి: రాహుల్‌కు దాసోజు బ‌హిరంగ‌ లేఖ‌

Hate speech bill | సీఎం రేవంత్ రెడ్డి “హేట్ స్పీచ్” (Hate speech) బిల్లు రాహుల్ గాంధీ ఆలోచ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ఉంద‌ని, రాహుల్ చెప్పిన‌ “మోహబ్బత్ కి దుకాన్” భావజాలాన్ని కూలదోస్తోందని బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత, ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్ (Dasoju Shravan Kumar) మండిప‌డ్డారు. తెలంగాణ‌లో తెచ్చిన ఈ బిల్లు పౌరుల‌ స్వేచ్ఛను హ‌రిస్తుంద‌ని, ఈ విష‌యంలో రాహుల్ గాంధీ జోక్యం చేసుకోవాల‌ని కోరారు.

S

News | Published On Apr 2, 2026, 1.54 pm IST

Dasoju Shravan Kumar | రాహుల్‌జీ..  ‘హేట్ స్పీచ్’ బిల్లుపై జోక్యం చేసుకోండి: రాహుల్‌కు దాసోజు బ‌హిరంగ‌ లేఖ‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: సీఎం రేవంత్ రెడ్డి “హేట్ స్పీచ్” (Hate speech) బిల్లు రాహుల్ గాంధీ ఆలోచ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ఉంద‌ని, రాహుల్ చెప్పిన‌ “మోహబ్బత్ కి దుకాన్” భావజాలాన్ని కూలదోస్తోందని బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత, ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్ (Dasoju Shravan Kumar) మండిప‌డ్డారు. తెలంగాణ‌లో తెచ్చిన ఈ బిల్లు పౌరుల‌ స్వేచ్ఛను హ‌రిస్తుంద‌ని, ఈ విష‌యంలో రాహుల్ గాంధీ జోక్యం చేసుకోవాల‌ని కోరారు. ఈమేర‌కు ఆయ‌న గురువారం రాహుల్ గాంధీకి మూడు పేజీల లేఖ (letter to Rahul) రాశారు.

లేఖ వివ‌రాలు సంక్షిప్తంగా ఇలా..

దేశవ్యాప్తంగా 4,000 కి.మీ నడిచి, రాజ్యాంగాన్ని చేతబూని "నఫ్రత్ కే బజార్" లో "మొహబ్బత్ కీ దుకాన్" తెరుస్తానని మీరు ఇచ్చిన మాటను నమ్మాం. కానీ తెలంగాణలో మీ పార్టీ ప్రభుత్వమే ఆ ఆశయాలను తుంగలో తొక్కుతోంది. రేవంత్ రెడ్డి ‘హేట్ స్పీచ్’ బిల్లుపై మీ జోక్యం చేసుకోవాలి. అధికార పార్టీల‌పై నిర్భ‌యంగా నిజం చెప్పడానికి ప్రతి భారతీయుడికి హక్కు ఉండాలని మీరు చెప్పారు. పార్లమెంట్‌లో, వీధుల్లోనూ వాదించారు. కానీ తెలంగాణ‌లో రేవంత్ ప్ర‌భుత్వం మీ భావ‌జాలానికి తూట్లు పొడుస్తోంది. ద్రోహం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మీ మిత్రపక్షం సీపీఐ కూడా ఈ చట్టాన్ని ‘ప్రజాస్వామ్యానికి మరణశాసన‌మ‌’ని పేర్కొంది. వెంట‌నే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది.

ముమ్మాటికీ డిజిటల్ నిరంకుశత్వమే..

“ద్వేష భావన”ను ఎవరు నిర్ణయిస్తారు? ఒక పోలీస్ అధికారా? లేక స్థానిక రాజకీయ నాయకుడా? ఎటువంటి నోటీసు లేకుండా ఆన్‌లైన్ కంటెంట్‌ను తొలగించే అధికారాన్ని ఒక ప్రభుత్వ అధికారికి (Designated Officer) కట్టబెట్టారు. ఇది శ్రేయా సింఘాల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు పూర్తి వ్యతిరేకం. వాట్సాప్ లో పంపిన సాధార‌ణ సందేశంతో ఒక విద్యార్థిని లేదా జర్నలిస్టును వారెంట్ లేకుండా జైలుకు పంపొచ్చు. అరెస్ట్ అంటే స్వేచ్ఛను కోల్పోవడమే కాదు.. ఒక జీవితాన్ని నాశనం చేయ‌డం. డిజిటల్ కంటెంట్‌ను ముందస్తు నోటీసు లేకుండా, విన‌కుండా, అప్పీల్ అవకాశం లేకుండా బ్లాక్ చేసే అధికారం ఒక అధికారికి ఇస్తోంది. ఇది ముమ్మాటికీ డిజిటల్ నియంతృత్వమే.

క‌ర్ణాట‌క తిరస్క‌రించిన బిల్లునే కాపీ కొట్టారు..

కర్ణాటక గవర్నర్ ఇప్పటికే "రాజ్యాంగ విరుద్ధం" అని తిరస్కరించిన బిల్లును తెలంగాణ ప్రభుత్వం ఉన్నది ఉన్నట్లుగా కాపీ కొట్టింది. అక్కడ విఫలమైన చట్టాన్ని తెలంగాణ ప్రజలపై ఎందుకు రుద్దాలని చూస్తున్నారు? ఇది ప్రజాస్వామ్యానికి మరణశాసనం కాదా? అని లేఖ‌లో నిల‌దీశారు. తెలంగాణ హేట్ స్పీచ్ & హేట్ క్రైమ్స్ (నిరోధక) బిల్లు 2026.. రాజ్యాంగంలోని “గోల్డెన్ ట్రైయాంగిల్” పేర్కొనే ఆర్టికల్స్ 14 (సమానత్వం), 19 (వ్యక్తి స్వేచ్ఛ), 21 (జీవితం,స్వేచ్ఛ) లను ఉల్లంఘిస్తోంది. రాజ్యాంగం ప్రకారం మాటలు తక్షణ హింసకు దారితీసినప్పుడే ప్రభుత్వం వాటిని నియంత్రించాలి. కానీ ఈ చట్టం దాన్ని విస్మరిస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసే వెసులుబాటును కల్పిస్తోంది.

శ్రేయా సింఘల్ (Shreya singhal) vs యూనియ‌న్ ఆఫ్ ఇండియా (Union of India) కేసులో ఐటీ చట్టంలోని సెక్షన్ 66Aను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎందుకంటే ఇలాంటి అస్పష్ట పదాలు భావప్రకటనపై “చిల్లింగ్ ఎఫెక్ట్” (భయ వాతావరణం) సృష్టిస్తాయని, సాధారణ అభిప్రాయ వ్యక్తీకరణ (advocacy), హింసకు ప్రేరేపణ (incitement) మధ్య తేడాను గుర్తించడంలో విఫలమవుతాయని కోర్టు పేర్కొంది. నేరాల‌ను కాగ్నిజబుల్, నాన్-బెయిలబుల్‌గా మార్చడం వ‌ల్ల మేన‌కా గాంధీ (Maneka Gandhi) vs యూనియ‌న్ ఆఫ్ ఇండియా (Union of India) కేసులో ఏర్పాటైన “న్యాయమైన, సముచితమైన, సమర్థమైన” విధాన పరిరక్షణలను పక్కన పెడుతోంది. దీంతో కార్యనిర్వాహక బెదిరింపులకు అరెస్ట్‌ను సాధనంగా మార్చుతోంది.

రాష్ట్రం ప్రైవేట్ ఫ్రాంచైజీలా..

రాహుల్ జీ.. ఢిల్లీలో మీ ప్రసంగాలకు రేవంత్ చర్యల మధ్య పెద్ద అంతరం కనిపిస్తోంది. మీరు “మోహబ్బత్ కి దుకాన్”పై మాట్లాడుతుంటే, సీఎం రేవంత్‌ రాష్ట్రాన్ని ఒక ప్రైవేట్ ఫ్రాంచైజ్‌లా నడుపుతున్నారు. గాంధేయ సిద్ధాంతాలను అవమానపరుస్తున్నారు. ఒకప్పుడు ప్రజాస్వామ్య దేవాలయంగా ఉన్న తెలంగాణ అసెంబ్లీ.. ఇప్పుడు వాగ్దాడుల వేదికగా మారడం బాధాకరం. ముఖ్యమంత్రి ప్రతిపక్షంపై తరచూ అసభ్య, అనుచిత భాష ఉపయోగిస్తూ, విమర్శించే వారిపై “నాలుకలు కోస్తాం, తలలు నరుకుతాం” అని బెదిరిస్తున్నారు. ఇది గాంధేయ సంభాషణ శైలి కాదు. వీధి రౌడీ దౌర్జన్య భాషలా ఉంది. ఎన్నికల హామీలు అమలు చేయకుండా అసభ్య భాషతో అణచివేస్తున్న ప్రభుత్వం ఇది. అని లేఖ‌లో ధ్వ‌జ‌మెత్తారు.

మీ నైతిక దిక్సూచికి గుర్తు..

రాహుల్ జీ, 2013 సెప్టెంబర్ ను దేశం ఇప్పటికీ గుర్తుంచుకుంది. మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను “పూర్తిగా అర్థం లేని విషయం” అని, దాన్ని “చింపేసి పారేయాలి” అని చెప్పిన మాట‌లు ఇప్ప‌టికీ గుర్తున్నాయి. అవినీతి, సంస్థల సమగ్రత విషయంలో రాజీపడలేమని చెప్పారు. చివ‌రికి అప్ప‌టి ప్రధానమంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ తెచ్చిన ఆర్డీనెన్స్‌ విష‌యంలోనూ నిజాయ‌తీగా ఉన్నారు. అదే నిబద్ధత ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు రేవంత్ తెచ్చిన “అర్థం లేని”, “దుష్టమైన” చట్టంపై ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అంత బలహీనమైందా, ఒక రాష్ట్ర యూనిట్ తనంతట తానే చట్టంలా వ్యవహరిస్తూ, మీరు జాతీయ వేదికపై చెప్పే ప్రతి మాటను అవమానపరిచే స్థితికి చేరిందా? ఈ నియంతృత్వ చర్యలు మీరు ప్రచారం చేసే “విలువలకు” ప్రత్యక్ష అవమానం. పార్లమెంట్‌లో ప్రజాస్వామ్యానికి మీరు మద్దతుదారుడిగా ఉండి, అదే సమయంలో స్థానికంగా నియంతలా వ్యవహరించే ఒక ముఖ్యమంత్రిని ప్రోత్సహించడం అసంభవం. తెలంగాణ‌లో ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రేవంత్‌రెడ్డిని అదుపులో పెట్టకపోతే మీ మౌనం ఈ నియంతృత్వానికి మద్దతుగా చరిత్రలో నమోదవుతుంది.

ఎన్నిక‌ల నినాదం కాద‌ని నిరూపించుకోండి....

బిల్లును ఉపసంహరించండి. సభ గౌరవాన్ని పునరుద్ధరించండి. తెలంగాణలో రాజ్యాంగాన్ని కాపాడండి.
ఈ బిల్లు ఆమోదం పొందితే అది కేవలం తెలంగాణ సమస్యగా ఉండదు. “సామరస్యం” అనే పేరుతో దేశవ్యాప్తంగా భవిష్యత్తులో ప్రతి ప్రభుత్వం విభేదాలను అణిచివేయడానికి దీన్ని ఒక ఉదాహరణగా ఉపయోగించే ప్రమాదం ఉంది. మీరు ఇందులో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వానికి ఈ బిల్లును పూర్తిగా ఉపసంహరించమని చెప్పండి. భారత ప్రజలకు, మీ రాజ్యాంగ నిబద్ధత కేవలం ఎన్నికల నినాదం కాదు, మీ అసలైన నమ్మకం అని నిరూపించండి అని ఆ లేఖ‌లో దాసోజు స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement