వచ్చేవారంలో జోరు వర్షాలు..
Monsoon | నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకోనున్నాయి. దాంతో జోరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ఈశాన్య భారతంలో వర్షాలు మొదలై.. ఆ తర్వాత తూర్పు, మధ్య, ఉత్తర భారతదేశాలకు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేసింది.
- పుంజుకోనున్న నైరుతి రుతుపవనాలు
- అంచనా వేసిన ఐఎండీ
Monsoon | నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకోనున్నాయి. దాంతో జోరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ఈశాన్య భారతంలో వర్షాలు మొదలై.. ఆ తర్వాత తూర్పు, మధ్య, ఉత్తర భారతదేశాలకు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. గంగానది పరివాహక ప్రాంతాలు, మధ్య భారతంలోని ప్రజలు గత కొన్ని వారాలుగా ఉక్కపోత, వేడి వాతావరణంతో ఇబ్బందులు పడుతున్నారు.
అల్పపీడనమే కీలకం
బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడుతున్న అల్పపీడన ప్రాంతమే ఈసారి వర్షాలకు కీలకం కానుంది. అల్పపీడనం ఏర్పడినప్పుడు గాలి పైకి లేచి, సముద్రం నుంచి తేమతో కూడిన గాలులను తనవైపు ఆకర్షిస్తుంది. దీంతో వర్ష మేఘాలు ఏర్పడి భారీ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ అల్పపీడనం తూర్పు తీరాన్ని దాటి మధ్య భారతదేశం వైపు కదులుతుండగా.. నైరుతి రుతుపవన ద్రోణి (మాన్సూన్ ట్రఫ్) సైతం సాధారణ స్థానానికి చేరుకునే అవకాశం ఉన్నది. ఉత్తర భారతం మీదుగా విస్తరించే ఈ అల్పపీడన రేఖనే రుతుపవనాల వెన్నెముకగా వాతావరణ నిపుణులు పేర్కొంటారు. ఈ ద్రోణి ఎక్కడ ఉంటే అక్కడే వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. గత కొన్ని వారాలుగా ఈ ద్రోణి హిమాలయాల పాద ప్రాంతాల వైపు జరగడంతో కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా.. మైదాన ప్రాంతాలు మాత్రం దాదాపు పొడిగా మారాయి. ప్రస్తుతం అది తిరిగి దక్షిణ దిశగా వస్తుండడంతో బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి వచ్చే తేమగాలులు మళ్లీ వర్షాలను తీసుకురానున్నాయి.
జూలైలో ఎందుకు తగ్గాయి వర్షాలు?
ప్రస్తుతం దేశం 'బ్రేక్ మాన్సూన్' దశలో ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో రుతుపవన ద్రోణి ఉత్తర దిశగా చేరడంతో మధ్య భారతదేశంలో వర్షాలు తగ్గిపోతాయి. ఈ నెలలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు పరిస్థితులు తక్కువగా ఉండడం, అరేబియా సముద్రం నుంచి వచ్చే తేమగాలులు బలహీనపడడం, దేశవ్యాప్తంగా మేఘాల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు లేకపోవడం వంటి కారణాలతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు సాధారణ వర్షపాతంతో పోలిస్తే 24 శాతం లోటు నమోదైంది. ఇప్పటి వరకు 323.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, కేవలం 244.6 మిల్లీమీటర్ల వర్షమే కురిసింది.
ఎందుకింత ఉక్కపోత?
వర్షాలు తగ్గినా గాలిలో తేమ మాత్రం తగ్గలేదు. ఎండ తీవ్రత పెరగడంతో భూమి బాగా వేడెక్కింది. అదే సమయంలో గాలిలో తేమ అధికంగా ఉండటంతో శరీరం నుంచి వచ్చే చెమట సరిగా ఆవిరి కాలేదు. దీంతో ఉష్ణోగ్రత (హీట్ ఇండెక్స్) అనేక నగరాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదైంది. దీర్ఘకాలం వర్షాలు లేకపోవడంతో నేలలో తేమ తగ్గిపోతుంది. అప్పుడు సూర్యుడి వేడి భూమిలోని నీటిని ఆవిరి చేయడం కాకుండా.. నేరుగా గాలిని వేడెక్కిస్తోంది. దీంతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి ఎండ తీవ్రత అధికమవుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఒక్క వారం వర్షాలు సరిపోతాయా?
వచ్చే వారం కురిసే వర్షాలు ఉష్ణోగ్రతలను తగ్గించడమే కాకుండా వరి, సోయాబీన్, పత్తి, పప్పుధాన్యాల సాగును వేగవంతం చేయడానికి రైతులకు ఉపయోగపడతాయి. అయితే ఇప్పటికే ఏర్పడిన వర్షాభావ లోటును పూడ్చుకోవాలంటే ఒక వారం వర్షాలు మాత్రమే సరిపోవని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరికొన్ని వారాల పాటు దేశవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురవాల్సి ఉంటుంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం ఎలా ఉంటుందన్నది ఆగస్టు నెలలో కురిసే వర్షాలపైనే ఆధారపడి ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Mann Ki Baat | అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి
- ●Servant Theft Cases | పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం వద్దు.. మనం ఇచ్చే అవకాశమే నేరానికి కారణం: వీసీ సజ్జనార్
- ●Sreeleela | శ్రీలీల, సాయిపల్లవి తమిళ మూవీ థియేటర్లలోకి వచ్చేది అప్పుడే - రజనీకాంత్‌కు పోటీగా!
- ●Talasani Srinivas Yadav | ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్
- ●Rainfall | హైదరాబాద్‌లో లోటు వర్షపాతం.. దంచికొడుతున్న ఎండలు
- ●TGPSC | టీజీపీఎస్సీ నిర్లక్ష్యం.. రోడ్లపై ఓఎంఆర్ షీట్లు ప్రత్యక్షం

Mann Ki Baat | అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి

Servant Theft Cases | పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం వద్దు.. మనం ఇచ్చే అవకాశమే నేరానికి కారణం: వీసీ సజ్జనార్

Sreeleela | శ్రీలీల, సాయిపల్లవి తమిళ మూవీ థియేటర్లలోకి వచ్చేది అప్పుడే - రజనీకాంత్‌కు పోటీగా!

Talasani Srinivas Yadav | ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్






