త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mann Ki Baat | అమ‌ర‌వీరుల త్యాగాల‌ను స్మ‌రించుకోవాలి

Mann Ki Baat | కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా దేశం గర్వపడేలా చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 'మన్‌ కీ బాత్‌' 136వ ఎపిసోడ్‌లో ఆదివారం మాట్లాడిన ఆయన.. కార్గిల్‌ యుద్ధంలో ప్రతికూల పరిస్థితులను లెక్కచేయకుండా దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన సైనికులకు ఘన నివాళులర్పించారు. జూలై 26 ప్రతి భారతీయుడి జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయే తేదని పేర్కొన్నారు.

P

National | Published On Jul 26, 2026, 3.26 pm IST

Mann Ki Baat | అమ‌ర‌వీరుల త్యాగాల‌ను స్మ‌రించుకోవాలి
Advertisement
  • దేశ ప్ర‌జ‌ల‌కు న‌రేంద్ర మోదీ పిలుపు
  • భార‌త‌దేశ ర‌క్ష‌ణ సామ‌ర్థ్యం బ‌లోపేతం
  • పీవీ సింధు, క్రీడాకారుల‌కు అభినంద‌న‌
  • మ‌న్‌కీ బాత్‌లో ప్ర‌సంగించిన ప్ర‌ధాని

Mann Ki Baat | కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా దేశం గర్వపడేలా చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 'మన్‌ కీ బాత్‌' 136వ ఎపిసోడ్‌లో ఆదివారం మాట్లాడిన ఆయన.. కార్గిల్‌ యుద్ధంలో ప్రతికూల పరిస్థితులను లెక్కచేయకుండా దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన సైనికులకు ఘన నివాళులర్పించారు. జూలై 26 ప్రతి భారతీయుడి జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయే తేదని పేర్కొన్నారు. ఈ ఏడాది 'వన్‌ రైడ్‌.. వన్‌ నేషన్‌.. వన్‌ సెల్యూట్‌' సందేశంతో ప్రత్యేక శౌర్య విజయ్‌ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 14న ఢిల్లీలోని నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ నుంచి ప్రారంభమైన ఈ బైక్‌ ర్యాలీ ద్రాస్‌లోని కార్గిల్‌ వార్‌ మెమోరియల్‌కు చేరుకుంటుందని చెప్పారు. దేశం కోసం చేసిన త్యాగాలు ఎన్నటికీ మరువరానివని ఈ యాత్ర చాటి చెబుతోందన్నారు.

ర‌క్ష‌ణ సామ‌ర్థ్యం బ‌లోపేతం

భారత్‌ రక్షణ సామర్థ్యం రోజురోజుకూ బలోపేతమవుతోందని ప్రధాని చెప్పారు. ఇటీవల భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్‌ మహేంద్రగిరి పూర్తిగా దేశీయ సాంకేతికతతో రూపొందించిన ఆధునిక యుద్ధనౌక అని చెప్పారు. ఇందులో 75 శాతానికి పైగా స్వదేశీ పరికరాలే వినియోగించారని వెల్లడించారు. ఇదే నెలలో డీఆర్‌డీవో దీర్ఘశ్రేణి పినాకా గైడెడ్‌ రాకెట్, కుశా క్షిపణిలను విజయవంతంగా పరీక్షించింద‌న్న ప్ర‌ధాని.. భారత శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల కృషి ఫలితంగానే విజ‌యాల‌ను సాధించామ‌న్నారు. రక్షణ ఉత్పత్తి, రక్షణ ఎగుమతులు, మిత్రదేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో భారత్‌ కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని మోదీ తెలిపారు. ఇటీవల ఇండోనేషియా పర్యటనలో బ్రహ్మోస్‌, అస్త్ర క్షిపణుల ఒప్పందాలు కుదిరాయని, భారత రక్షణ సాంకేతికతపై ప్రపంచ దేశాల విశ్వాసం మరింత పెరుగుతోందన్నారు. సురక్షితమైన, సామర్థ్యవంతమైన, ఆత్మనిర్భర్‌ భారత్‌ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

క్యాచ్ ది రైన్‌..

జులై 4 నుంచి దేశవ్యాప్తంగా చేపడుతున్న 'క్యాచ్‌ ది రైన్‌' కార్యక్రమాన్ని ప్రస్తావించిన ప్రధాని.. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, చెరువులు, బావుల పునరుజ్జీవనానికి ప్రజలు విస్తృతంగా సహకరిస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లోని ఒక చెరువు, బావి లేదా కుంటను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని, నేడు ఆదా చేసే ప్రతి నీటి బొట్టు భవిష్యత్‌ తరాలకు అమూల్యమైన సంపద‌గా అభివ‌ర్ణించారు. ఇటీవ‌ల ప‌లు క్రీడ‌ల్లో భార‌త ఆట‌గాళ్లు సాధించిన విజ‌యాలు దేశానికి గ‌ర్వ‌కార‌ణంగా తెలిపారు. పీవీ సింధు జపాన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్‌ సాధించడం, భారత మహిళల క్రికెట్‌ జట్టు లార్డ్స్‌లో తొలి టెస్టు విజయం నమోదు చేయడం చారిత్రక ఘట్టాలుగా పేర్కొన్నారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లా దక్షిణ చిట్టూరులో సంస్కృత బోధనకు ఫుట్‌బాల్‌ పదాలను అనుసంధానిస్తూ నిర్వహిస్తున్న 'అక్షరకందుక్‌' కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

విక్ర‌మ్ స‌క్సెస్ చారిత్రాత్మ‌కం..

ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన తొలి భారతీయ రాకెట్‌ విక్రమ్‌-1 విజయవంతమైన ప్రయోగం దేశ అంతరిక్ష రంగానికి చారిత్రక ఘట్టమని మోదీ తెలిపారు. అంతర్జాతీయ ఒలింపియాడ్‌లలో భారత విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని తెలిపారు. ఫిజిక్స్‌ ఒలింపియాడ్‌లో ఐదుగురు విద్యార్థులు స్వర్ణ పతకాలు సాధించి భారత్‌కు తొలి స్థానం తీసుకురాగా, కెమిస్ట్రీలోనూ అందరూ స్వర్ణ పతకాలు గెలుచుకున్నారని చెప్పారు. బయాలజీలో అన్ని పతకాలు, మ్యాథమెటిక్స్‌లో రెండు స్వర్ణాలు, నాలుగు రజత పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. సంప్రదాయ కళలకు కొత్త ఊపిరి పోస్తున్న వారిని ప్రధాని అభినందించారు. శ్రీనగర్‌కు చెందిన గులాం హుస్సేన్‌, ఆయన కుమార్తె తంజిలా కశ్మీరీ సంప్రదాయ 'వాగు' చాపల తయారీ కళను పునరుద్ధరిస్తున్నారన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌ జిల్లా మహిళా స్వయం సహాయక సంఘం తయారు చేస్తున్న 'విదుర్‌ ప్రేరణ స్వదేశీ హెర్బల్‌ టీ' దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతోందని చెప్పారు. స్థానిక పరిజ్ఞానం, ప్రకృతి సంపద, మహిళల ఆత్మవిశ్వాసం కలిస్తే చిన్న ప్రయత్నమే పెద్ద విజయానికి నాంది అవుతుందని వ్యాఖ్యానించారు.

ప్లాస్టిక్ కాలుష్యం ప్ర‌పంచానికి స‌వాల్‌

ప్లాస్టిక్‌ కాలుష్యం ప్రపంచ పర్యావరణానికి పెద్ద సవాలుగా మారిందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. బిహార్‌లోని సీతామఢిలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను రీసైకిల్‌ చేసి బెంచీలు తయారు చేస్తున్నారని చెప్పారు. ఒక్కో బెంచీ తయారీకి సుమారు 40 కిలోల ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారని, వాటిని పాఠశాలలు, పార్కులు, ప్రజా ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారని వివరించారు. జపాన్‌లో పనిచేస్తున్న భారతీయ ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్‌ రొనాల్డో లైశ్రామ్‌ బృందం కనుగొన్న యువ గెలాక్సీల సమూహానికి 'లోక్తక్‌ ప్రోటో క్లస్టర్‌' అని పేరు పెట్టడం భారతీయులకు గర్వకారణమని మోదీ అన్నారు. అలాగే, త్రిపురకు చెందిన గిరిజనుల సంప్రదాయ సంగీత వాయిద్యం 'చోంగ్‌ప్రాంగ్‌'కు మళ్లీ ఆదరణ తీసుకురావడంలో సూరజ్‌ కుమార్‌ దేవ్‌బర్మా చేస్తున్న కృషిని ప్రశంసించారు. చేనేత వస్త్రాలు, హస్తకళలు భారత సంస్కృతికి ప్రతీకలని పేర్కొన్న ప్రధాని.. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ 'వోకల్‌ ఫర్‌ లోకల్‌' స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement