Servant Theft Cases | పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం వద్దు.. మనం ఇచ్చే అవకాశమే నేరానికి కారణం: వీసీ సజ్జనార్
Servant Theft Cases | పనిమనుషులను చేర్చుకునేటప్పుడు యజమానులు చూపే నిర్లక్ష్యమే దొంగతనాలకు (Servant Theft Cases) ప్రధాన కారణమని హైదరాబాద్ సిటీ పోలీసులు (Hyderabad City Police) వెల్లడించారు. నగరంలో పనిమనుషుల దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Servant Theft Cases | త్రినేత్ర.న్యూస్: పనిమనుషులను చేర్చుకునేటప్పుడు యజమానులు చూపే నిర్లక్ష్యమే దొంగతనాలకు (Servant Theft Cases) ప్రధాన కారణమని హైదరాబాద్ సిటీ పోలీసులు (Hyderabad City Police) వెల్లడించారు. నగరంలో పనిమనుషుల దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తగిన విచారణ లేకుండా పనిలో కుదుర్చుకుంటే విలువైన సొత్తును పోగొట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హైదరాబాద్ కమిషనరేట్ (Hyderabad) పరిధిలో పనుల ఒత్తిడిలో ఉండే ఐటీ ఉద్యోగులు, ఒంటరిగా నివాసముండే విద్యార్థులు, వృద్ధులే ఈ చోరీలకు ప్రధాన బాధితులుగా మారుతున్నారని వెల్లడించారు. ఇండ్లు, ఆఫీసులు, దుకాణాల్లో బంగారం, నగదు, అత్యంత విలువైన వస్తువులను నిర్లక్ష్యంగా బయట పడేసి వెళ్లడాన్ని గమనిస్తున్న కొందరు పనిమనుషులు సమయం చూసి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. యజమానులు చూపే ఈ చిన్నపాటి అలసత్వమే నేరగాళ్లకు వరంగా మారుతున్నదని పేర్కొన్నారు. అయితే దొంగతనం జరిగిన తర్వాత దర్యాప్తు చేసి పట్టుకోవడం కంటే, అసలు నేరమే జరగకుండా ఆపడమే అత్యంత ముఖ్యమని వెల్లడించారు. ఇందులో భాగంగా కాలనీలు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఆఫీస్లు, దుకాణాలకు వెళ్లి యజమానులను నేరుగా కలిసి అవగాహన కల్పిస్తున్నారు. గత రెండేండ్లలో నగరంలో నమోదైన 565 పనిమనుషుల దొంగతనం కేసులను (65 గ్రేవ్ కేసులు, 500 నాన్ గ్రేవ్ కేసులు) విశ్లేషించిన పోలీసులు.. ప్రతి యజమాని తక్షణమే భద్రతా నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
టాప్‌లో జూబ్లీహిల్స్..
ఐటీ సంస్థలు, వ్యాపార వర్గాలు, ఉన్నత నివాస ప్రాంగణాలు, ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ఆఫీసుల్లో, దుకాణాల్లో, ఇళ్లలో యజమానులు బిజీ జీవనశైలి కారణంగా తగిన ముందస్తు తనిఖీలు లేకుండా పనిమనుషులను చేర్చుకుంటున్నట్లు తేలింది. మొత్తం 565 కేసుల్లో.. జూబ్లీహిల్స్ జోన్‌లో అత్యధికంగా 173 కేసులు నమోదవగా, సికింద్రాబాద్ జోన్‌లో 88, ఖైరతాబాద్ జోన్‌లో 77, గొల్కొండ జోన్‌లో 70, రాజేంద్రనగర్ జోన్‌లో 63, శంషాబాద్ జోన్‌లో 49, చార్మినార్ జోన్‌లో 45 కేసులు రికార్డయ్యాయి. ముఖ్యంగా ఇటీవల ఇతర దేశాలు, రాష్ట్రాల మూలాలున్న ముఠాలు పనిమనుషుల అవతారంలో ఇళ్లలోకి ప్రవేశించి పథకం ప్రకారం దొంగతనాలకు, నేరాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో తగిన గుర్తింపు, పోలీస్ వెరిఫికేషన్ పత్రాలు లేని అపరిచిత వ్యక్తులను పనిలో చేర్చుకోవద్దని సూచిస్తున్నారు. నమ్మకంగా పనిలో చేరిన కొత్తలో యజమానుల అలవాట్లు, తాళాలు ఉంచే ప్రదేశాలు, సీసీ కెమెరాల కదలికలు, నగదు-నగల వివరాలను గమనించి నేరాలకు పాల్పడుతుండటంతో, పూర్వాపరాలు తెలియని వారిని ఇండ్లు, ఆఫీసులు, దుకాణాలకు రానివ్వకపోవడమే శ్రేయస్కరమని స్పష్టంచేశారు.
ఏం చేయాలంటే?
ఎవరినైనా ఇళ్లు, ఆఫీసులు, దుకాణాల్లో పనికి కుదుర్చుకునే ముందే వారి ఆధార్ కార్డు లేదా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు జీరాక్స్, తాజా ఫొటో, శాశ్వత చిరునామా, స్వగ్రామం వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించాలని సూచించారు. ప్రైవేట్ ఏజెన్సీలు లేదా మధ్యవర్తుల ద్వారా నియామకాలు చేసుకునేటప్పుడు ఆ ఏజెన్సీకి ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నారు. గతంలో వారు ఎక్కడ పనిచేశారో ఆ యజమానులను సంప్రదించి వివరాలు ధ్రువీకరించుకోవాలని చెప్పారు. నియామకానికి ముందే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఉచితంగా లభించే 'పోలీస్ వెరిఫికేషన్' చేయించుకోవడం భద్రతా పరంగా శ్రేయస్కరమని, పనిచేసే వ్యక్తులు తమ వెంట గుర్తింపు కార్డు లేదా వెరిఫికేషన్ పత్రాన్ని ఉంచుకునేలా యజమానులే చొరవ తీసుకోవాలని కోరారు. పనిలో చేరిన మొదటి 30 రోజుల పాటు వారి అలవాట్లు, కదలికలను నిశితంగా గమనించడం ద్వారా ఎలాంటి అనుమానాస్పద చర్యలనైనా ముందే గుర్తించవచ్చని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఒంటరిగా ఉండే వృద్ధులు, తరచుగా ప్రయాణాలు చేసే కుటుంబాలు మరింత అప్రమత్తంగా ఉంటూ, ఇంట్లోని నగలు, డబ్బు, ప్రయాణ ప్రణాళికల గురించి పనిమనుషుల ముందు చర్చించకుండా జాగ్రత్త పడాలని కోరారు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్ రెసిడెంట్ వెల్పేర్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా తమ ప్రాంగణాల్లో ఇళ్లలో పనిచేసే పనిమనుషులకు ఎంట్రీ రిజిస్టర్లు నిర్వహిస్తూ ప్రవేశ పాస్‌లు ఇవ్వాలని, సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని సూచించారు.
మనం ఇచ్చే అవకాశమే..: హైదరాబాద్ సీపీ
నేర రహిత, సురక్షిత హైదరాబాద్ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యమే అత్యంత కీలకమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ (VC Sajjanar) అన్నారు. నేరస్థుడికి బలవంతంగా లోపలికి వచ్చే ప్రవేశం ఉండదని, మనం ఇచ్చే అవకాశమే నేరానికి దారితీస్తుందని చెప్పారు. పనిమనుషుల నియామకం విషయంలో ప్రతీ ఒక్కరూ సమగ్ర వివరాలు సేకరించి పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. పని మనుషుల దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు పోలీస్ తనిఖీలు లేని వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పనిలో చేర్చుకోవద్దన్నారు. వారి పూర్వాపరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని స్పష్టం చేశారు. నివాసాలు, ఆఫీస్లు, దుఖాణాల్లో ఏమాత్రం అనుమానాస్పదంగా అనిపించినా, తాళం చెవులు పోయినా లేదా పనిమనిషి చెప్పకుండా మాయమైనా ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దని చెప్పారు. అనుమానం వస్తే వెంటనే డయల్ 100కి గానీ, లేదా హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్ 94906 16555కు గానీ సమాచారం అందించాలన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Sreeleela | శ్రీలీల, సాయిపల్లవి తమిళ మూవీ థియేటర్లలోకి వచ్చేది అప్పుడే - రజనీకాంత్‌కు పోటీగా!
- ●Talasani Srinivas Yadav | ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్
- ●Rainfall | హైదరాబాద్‌లో లోటు వర్షపాతం.. దంచికొడుతున్న ఎండలు
- ●TGPSC | టీజీపీఎస్సీ నిర్లక్ష్యం.. రోడ్లపై ఓఎంఆర్ షీట్లు ప్రత్యక్షం
- ●Ramchander Rao | సీఎం రేవంత్ రాజీనామా చేయాల్సిందే : రామచందర్ రావు
- ●Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం

Sreeleela | శ్రీలీల, సాయిపల్లవి తమిళ మూవీ థియేటర్లలోకి వచ్చేది అప్పుడే - రజనీకాంత్‌కు పోటీగా!

Talasani Srinivas Yadav | ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్

Rainfall | హైదరాబాద్‌లో లోటు వర్షపాతం.. దంచికొడుతున్న ఎండలు

TGPSC | టీజీపీఎస్సీ నిర్లక్ష్యం.. రోడ్లపై ఓఎంఆర్ షీట్లు ప్రత్యక్షం





