త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Konark Sun Temple | శతాబ్దం తర్వాత తెరుచుకోనున్న కోణార్క్‌ సూర్యనారాయణ దేవాలయం ద్వారాలు..!

Konark Sun Temple | బ్రిటీష్‌ కాలంలో మూసివేసిన కోణార్క్‌ సూర్యనారాయణస్వామి గర్భాలయ ద్వారాలు ఎట్టకేలకు తెరుచుకోనున్నాయి. ఈ వార్త దేశవ్యాప్తంగా చరిత్రాభిమానులు, పర్యాకుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.

P

National | Published On Feb 24, 2026, 2.05 pm IST

Konark Sun Temple | శతాబ్దం తర్వాత తెరుచుకోనున్న కోణార్క్‌ సూర్యనారాయణ దేవాలయం ద్వారాలు..!
Advertisement
  • బ్రిటీష్‌ కాలంలో ద్వారాలు మూసివేత
  • 1904 ఆలయాన్ని కాపాడేందుకు ఇసుక నింపిని బ్రిటీష్‌ ఇంజినీర్లు
  • ప్రస్తుతం తొలగింపు పనులు చేపట్టిన ఏఎస్‌ఐ
  • మూడు నెలల్లో గర్భాలయంలో దర్శనాలు..!

బ్రిటీష్‌ కాలంలో మూసివేసిన కోణార్క్‌ సూర్యనారాయణస్వామి గర్భాలయ ద్వారాలు ఎట్టకేలకు తెరుచుకోనున్నాయి. ఈ వార్త దేశవ్యాప్తంగా చరిత్రాభిమానులు, పర్యాకుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. 13వ శతాబ్దానికి చెందిన అద్భుత కట్టడమైన కోణార్క్‌ సూర్యదేవాలయం గర్భగుడిలో బ్రిటిష్ కాలంలో నింపిన ఇసుకను తొలగించే ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ పనులను ఐఐటీ మద్రాస్‌ (IIT Madras) నిపుణుల సాంకేతిక సహకారంతో ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (AIS) చేపట్టింది. ఇది ఆలయ చరిత్రలో ఒక మహత్తర ఘట్టంగా నిలువబోతున్నది.

Konark Sun Temple | 1903–1904 మధ్యకాలంలో దేవాలయ నిర్మాణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో బ్రిటిష్ ఇంజినీర్లు గర్భగుడిని పొడి నదీ ఇసుకతో నింపారు. అప్పటి నుంచి గర్భగుడి పూర్తిగా మూసివేయబడింది. దాదాపు 120 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం ఆ ఇసుకను శాస్త్రీయ పద్ధతుల్లో తొలగిస్తున్నారు. జీరో వైబ్రేషన్ సాంకేతికతతో డ్రిల్లింగ్ చేస్తూ, ప్రతి దశను ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. మొత్తం ప్రక్రియ పూర్తవ్వడానికి సుమారు మూడు నెలలు పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. పురీ జిల్లాలోని కోణార్క్ పట్టణంలో బంగాళాఖాతం తీరానికి సమీపంగా ఉన్న ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందింది. పనులు పూర్తయ్యాక గర్భగుడిలోకి భక్తులు, సందర్శకులు ప్రవేశించే వీలుంటుంది. శతాబ్దానికిపైగా మూసివేసి ఉన్న ఈ పవిత్ర స్థలంలో మళ్లీ గర్భాలయ దర్శనాలు అందుబాటులోకి రానుండడం చారిత్రక ఘట్టంగా భావిస్తున్నారు.

కోణార్క్ సూర్య మందిరం చరిత్ర..

ఈ మహత్తర దేవాలయ నిర్మాణాన్ని తూర్పు గంగా వంశానికి చెందిన రాజు నరసింహదేవ (Narasimhadeva) సుమారు సామాన్యశకం 1250 ప్రాంతంలో ప్రారంభించారు. సూర్య భగవానుడికి అంకితం చేస్తూ కళింగ శైలిలో నిర్మాణం చేపట్టారు. ఈ ఆలయం సూర్యుడి రథాన్ని పోలి ఉంటుంది. చూసేందుకు ఏడు గుర్రాలు లాగే రథం కనిపించడం ఆలయం విశేషం. ఖోండలైట్, లేటరైట్ రాళ్లను వినియోగించి శిల్పకళలో అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అడుగుభాగంలో ఉన్న 24 భారీ రాతి చక్రాలు సూర్యఘడియారాల్లా సమయాన్ని సూచించేలా రూపొందించారు. గతంలో ఈ ఆలయ ప్రధాన గోపురం సుమారు 70 మీటర్ల ఎత్తులో ఆకాశాన్ని తాకేలా ఉండేదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. కాలక్రమేణా తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా గోపురం కూలిపోయింది. అయినప్పటికీ ఆలయ గోడలపై చెక్కిన శిల్పాలు ఇప్పటికీ జీవం పోసుకున్నట్లే కనిపిస్తాయి.

శిల్పకళా వైభవం..

ఈ ఆలయం శిల్పకళా వైభవం అందరినీ ఆకర్షిస్తోంది. ఆలయం గోడలపై నర్తకులు, యోధులు, సైనిక దృశ్యాలు, వివిధ భంగిమలు, మార్కెట్ దృశ్యాలు, రాజదర్బార్ తదితర శిల్పాలను ఆలయ ద్వారాలపై శాశ్వతంగా నిలిచిపోయాయి. గర్భగుడిలో 10 అడుగుల ఎత్తయిన నల్ల క్లోరైట్‌ రాతితో తయారైన సూర్యదేవుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఏడు గుర్రాలు, కిరీటంతో అలంకరించిన ఈ విగ్రహం ఆలయ ఆధ్యాత్మిక వైభవాన్ని చాటిచెబుతుంది. సమీపంలో సంగీత స్తంభాలను తాకితే ఏడు స్వరాలు వినిపించేవని స్థానిక కథనాలు చెబుతున్నాయి. భారతీయ ఆలయ శిల్పకళలో కోణార్క్ సూర్యమందిరానికి విశిష్ట స్థానం ఉన్నది.

1903–1904లో రక్షణ చర్యలు

1903లో పిడుగులు, తుఫాన్లు ఆలయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. జగమోహన మండపం బలహీనపడడంతో కూలిపోతుందనే ఆందోళనలు వ్యక్తమైంది. దీంతో బ్రిటిష్ ఇంజినీర్లు గోడల్లో రంధ్రాలు చేసి పొడి ఇసుకను లోపల నింపారు. ఈ చర్య వల్ల గోడలకు అంతర్గతంగా మద్దతు లభించింది. అయితే, 1904 తర్వాత గర్భగుడిలోకి ఎవరూ ప్రవేశించలేదు. సముద్రపు ఉప్పు, గాలులు, వర్షాకాల తేమ కారణంగా రాళ్లపై తీవ్రమైన ప్రభావం పడింది. తడి ఇసుక వల్ల లోపలి నిర్మాణానికి మరింత నష్టం కలిగే పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆలయాన్ని రక్షించేందుకు ఇటీవల కాలంలో గర్భగుడిని తెరవాలని నిర్ణయించారు.

ప్రత్యేక నిపుణులతో పనులు..

గత డిసెంబరులో ఏఎస్ఐ 30 మంది నిపుణులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. కంపనలు రాకుండా పనిచేసే ప్రత్యేక పరికరాలను వినియోగిస్తున్నారు. పశ్చిమ గోడపై సుమారు 80 అడుగుల ఎత్తులో 4×4 అడుగుల సొరంగాన్ని రూపొందించారు. ఇసుక, రాయి నమూనాలను సేకరించి ఐఐటీ మద్రాస్ ప్రయోగశాలలకు పరీక్షల కోసం పంపించారు. ఉత్తర, దక్షిణ మూలల నుంచి పైపులు, లిఫ్ట్ వ్యవస్థల ద్వారా దశలవారీగా ఇసుకను తొలగిస్తున్నారు. పనులు సురక్షితంగా సాగేందుకు చుట్టూ స్కాఫోల్డింగ్స్‌ ఏర్పాటు చేశారు. లేజర్ స్కానర్లతో ప్రతి అంగుళాన్ని ముందూ, తర్వాత మ్యాప్ చేస్తున్నారు. ఎక్కడైనా చీలికలు కనిపిస్తే సంప్రదాయ చునా–సుర్కి మోర్టార్‌తో పూడుస్తున్నారు. లోపలి తేమను తగ్గించేందుకు గాలి ప్రసరణ వ్యవస్థను అమర్చారు. రాబోయే వారాల్లో పూర్తి తనిఖీల అనంతరం గర్భగుడి పూర్తిగా శుభ్రపడి ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఆలయ సందర్శన వేళలు..

కోణార్క్ దేవాలయం ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులకు తెరిచి ఉంటుంది. భారతీయులకు రూ.40 ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విదేశీయులకు అయితే రూ.600గా ఫీజు నిర్ణయించారు. శిల్పాలను రక్షించేందుకు కెమెరాల్లో ఫొటోలు తీసేందుకు అనుమతి లేదు. ఈ ఇటీవల కాలంలో ఒడిశా పర్యాటక రంగంలో అదనంగా సుమారు 50 వేల మంది సందర్శకులు పెరిగినట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. శతాబ్దానికి పైగా మూసివేసి ఉన్న గర్భగుడి మళ్లీ తెరుచుకోవడం కోణార్క్ సూర్య నారాయణ మందిరం చరిత్రలో ఒక మహత్తర ఘట్టంగా నిలువబోతున్నది.

Read Also :

Hidden Gems Of India | సీక్రెట్‌ బీచ్‌ నుంచి మూన్‌ల్యాండ్‌ వరకు.. భారత్‌లో అద్భుతమైన ఐదు పర్యాటక ప్రాంతాలివే..! ఒక్కసారైనా వీటిని చూడాల్సిందే..!

Sunset in India | ఈ ప్రదేశాల్లో సూర్యాస్తమయం చూస్తే.. మిమ్మల్ని మీరే మరిచిపోయి.. ఎంజాయ్ చేస్తారు!!

Advertisement
Advertisement