లోడ్ అవుతోంది...


Sunset in India | సూర్యాస్తమయం చూస్తున్నప్పుడు ఏదో తెలియని అనుభూతి కలిగిస్తుంది. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సూర్యుడు నెమ్మదిగా మబ్బుల చాటుకు వెళ్లిపోతుంటే.. మనసులో తెలియని ఏదో భావం ఉరకలెత్తిస్తుంది. బిజీగా ఉండే ప్రాంతాల్లో నుంచి చూసినప్పుడే ఇలాంటి అనుభూతి కలిగితే.. నిర్మలమైన ప్రదేశాలు, ఎత్తయిన కొండల మధ్యలో నుంచి సూర్యుడు మాయమవుతున్నప్పుడు.. అరుణ వర్ణంలో మెరిసిపోయే ఆకాశాన్ని చూస్తుంటే.. ఇంకెంత మధురంగా ఉంటుంది. అలా భారత్‌లోని ఈ ఐదు ప్రాంతాల్లోని సూర్యాస్తమయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా చలికాలపు వాతావరణం సంధ్యవేళను మరింత రమణీయంగా మారుస్తాయి.

గుజరాత్‌లోని గ్రేట్ రణ్ ఆఫ్ కచ్ చలికాలంలో అద్భుతంగా కనిపిస్తుంది. వర్షాకాలంలో నీటితో నిండిపోయిన ఈ ప్రాంతం.. శీతాకాలం వచ్చేసరికి ఉప్ప మైదానాలతో రమణీయంగా కనిపిస్తుంది. సూర్యుడు ఆస్తమించే వేళ ఆకాశం నారింజ, గులాబీ, పసుపు రంగుల కలయికతో మెరిసిపోతుంది. ఆ రంగులన్నీ ఉప్పు నేలపై అద్దంలా ప్రతిబింబిస్తాయి. చలికాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు మామూలుగానే ఉండటంతో ఎక్కువసేపు బయటే గడుపుతూ సూర్యాస్తమయాన్ని ఆస్వాదించవచ్చు. ఇక చలికాలంలో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు జరిగే రణ్ ఉత్సవం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఉత్సవాల్లో జానపద నృత్యాలు, హస్తకళలు, స్థానిక వంటకాలు ఈ ట్రిప్‌ను మరింత ప్రత్యేకంగా మలుస్తాయి.

కేరళలోని తిరువనంతపురం జిల్లాలో ఉన్న అందమైన తీర ప్రాంత పట్టణం వర్కాల. సాధారణ బీచ్‌ల మాదిరి కాకుండా, పక్కనే ఉన్న ఎత్తయిన కొండపై నుంచి ఆరేబియా సముద్రాన్ని వీక్షించవచ్చు. చలికాలంలో ఆకాశంలో మేఘాలు లేకుండా నిర్మలంగా ఉండటంతో సూర్యాస్తమయం చాలా అందంగా కనిపిస్తుంది. సంధ్య వేళలో సూర్యుడు నెమ్మదిగా ఆరేబియా సముద్రంలో కలిసిపోతున్న దృశ్యాన్ని స్పష్టంగా వీక్షించవచ్చు. ఇక ఈ కొండ పక్కనే ఉండే కెఫేలు, రెస్టారెంట్లు కూడా సందర్శకులతో కిటకిటలాడుతుంటాయి. చల్లటి సముద్ర గాలి శరీరాన్ని తాకుతుంటే.. చేతిలో కాఫీ కప్పుతో.. ఎదురుగా ఉన్న సముద్రంలో సూర్యుడు ఆస్తమిస్తున్న అద్భుత దృశ్యాన్ని ఎంజాయి చేస్తూ మైమరిచిపోవచ్చు.

థార్ ఎడారిలో ఎండాకాలం ఎంత కష్టంగా ఉంటుందో.. చలికాలంలో అంత హాయిగా కూడా ఉంటుంది. శీతాకాలంలో ఇసుక దిబ్బలపై సూర్యుడు అస్తమించే అద్భుత దృశ్యాన్ని చూడటం మరిచిపోలి అనుభూతిని ఇస్తుంది. సూర్యుడు అస్తమించే కొద్దీ ఇసుకపై పొడవైన నీడలు పడుతుంటే.. బంగారు, ఎర్రటి కాంతులతో ఇసుక మెరుస్తూ కనిపిస్తుంది. అందుకే ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా సాయంత్ర వేళలో ఒంటెలపై సఫారీ చేస్తూ సూర్యాస్తమయాన్ని ఆస్వాదించేందుకు ఇష్టపడుతుంటారు. అందుకే ఇక్కడి టూరిస్ట్ ప్యాకేజీలో సాయంత్రం పూట ఒంటె సఫారీకి మంచి గిరాకీ ఉంటుంది.

డార్జిలింగ్‌లోని టైగర్ హిల్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది సూర్యోదయం. కానీ చలికాలంలో ఇక్కడి సూర్యస్తమయాలు కూడా అంతే మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఆకాశం నిర్మలంగా ఉండే ఈ కాలంలో సూర్యాస్తమయం సమయంలో పడే కిరణాలతో కన్చెంజుంగా పర్వతాలు పాస్టెల్ రంగులతో మెరిసిపోతాయి. సాయంత్రం అవుతున్నా కొద్దీ లోయలోకి మెల్లిగా పొగమంచు ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ సమయంలో చల్లటి గాలి మనల్ని తాకుతూ.. నిశ్శబ్ద వాతావరణంతో సాయంత్రాన్ని మరింత ప్రశాంతంగా మారుస్తుంది. ప్రకృతి ప్రేమికులు ఈ దృశ్యం ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది.

రాజస్థాన్‌లోని ఏకైక హిల్ స్టేషన్ మౌంట్ అబూ. ఈ పర్వత శ్రేణుల నుంచి ఆరావళి పర్వతాల విశాల దృశ్యం కనిపిస్తుంది. చలికాలం సాయంత్రం వేళలో సూర్యుడు నెమ్మదిగా కొండల వెనక్కి వెళ్తుంటే.. ఆకాశం నారింజ, ఊదా వర్ణాలతో నిండిపోతుంది. ట్రెక్కింగ్ ఇక్కడ క్లిష్టంగా లేకపోవడంతో వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ హిల్ స్టేషన్‌పైకి ఎక్కి ఆ సుందర దృశ్యాన్ని వీక్షించవచ్చు. అందుకే ఈ వ్యూ పాయింట్ పర్యాటకుల్లో మంచి ప్రాచుర్యం పొందింది.





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam