Rakesh Reddy | 2028లో నేనే, 2033లో కూడా నేనే.. ఎంతసేపు ఇదే ధ్యాసనా రేవంత్?
Rakesh Reddy | 2028లో నేనే, 2033లో కూడా నేనేనని సీఎం రేవంత్ ఎంతసేపు తన రాజకీయ భవిష్యత్ గురించే మాట్లాడుతున్నాడని.. మరి విద్యార్థుల భవిష్యత్ గురించి ఎందుకు మాట్లాడరని బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయన విజన్ అంతా కూడా ఫ్యూచర్ సిటీ గురించే, ఆయన ఫ్యూచర్ గురించేనని మండిపడ్డారు. విద్యార్థుల ఫ్యూచర్ గురించో, రాష్ట్ర ఫ్యూచర్ గురించో కాదన్నారు.
- రాబోయే ఎన్నికల గురించే 3,000 సార్లు మాట్లాడినవ్.. రాబోయే తరం గురించి ఎందుకు మాట్లాడవ్?
- ఎప్పుడూ నీ రాజకీయ భవిష్యత్ గురించే మాట్లాడితే మరి విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలే?
- విద్య కోసం బీహార్ మనకంటే ఎక్కువ ఖర్చు చేస్తుంది
- ఆర్బీఐ గణాంకాల ప్రకారం తెలంగాణ అత్యల్పంగా 5.98% మాత్రమే ఖర్చు చేస్తుంది
- 27,000 పాఠశాలలుంటే 4,000కే కుదిస్తా అని సిగ్గు, శరం లేకుండా మాట్లాడుతున్నవ్
- పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ప్లకార్డులు పట్టుకునే దుస్థితి తెచ్చినవ్
- మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌పై విరుచుకుపడిన ఏనుగుల రాకేశ్‌రెడ్డి
Rakesh Reddy | త్రినేత్ర.న్యూస్: 2028లో నేనే, 2033లో కూడా నేనేనని సీఎం రేవంత్ ఎంతసేపు తన రాజకీయ భవిష్యత్ గురించే మాట్లాడుతున్నాడని.. మరి విద్యార్థుల భవిష్యత్ గురించి ఎందుకు మాట్లాడరని బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయన విజన్ అంతా కూడా ఫ్యూచర్ సిటీ గురించే, ఆయన ఫ్యూచర్ గురించేనని మండిపడ్డారు. విద్యార్థుల ఫ్యూచర్ గురించో, రాష్ట్ర ఫ్యూచర్ గురించో కాదన్నారు. 27,000 పాఠశాలలుంటే కేవలం 4,000లకే కుదిస్తా అని సిగ్గు, శరం లేకుండా మాట్లాడుతున్నాడని ఫైరయ్యారు. ఈమేరకు గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ తీరుపై రాకేశ్‌రెడ్డి మాట్లాడారు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం విద్యపై అత్యల్పంగా 5.98% మాత్రమే ఖర్చు చేస్తుందని వాపోయారు.
విద్యపై ఖర్చు చేస్తున్న రాష్ట్రాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్రం మనకంటే అత్యుత్తమ స్థానంలో ఉంది. 2024–25 సంవత్సరంలో బీహార్ 20.27 శాతం, ఢిల్లీ 24.26 శాతం, హిమాచల్ ప్రదేశ్ 12.65 శాతం, ఉత్తరాఖండ్ 12.52 శాతం, రాజస్థాన్ 12.11 శాతం విద్యపై ఖర్చు చేసినట్టు ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడించాయి. దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటకతో పోల్చినా తెలంగాణ వ్యయం తక్కువగానే ఉంది.
రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి నువ్వు మాట్లాడినావా? ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది గూడాలు, తండాల నుంచి, గ్రామాల నుంచి స్కాలర్‌షిప్‌ల పేరు మీద చదువుకునేటువంటి విద్యార్థుల గురించి, వాళ్ల బాగోగుల గురించి, గురుకులాల్లో ఉన్న చిన్నారుల బాగోగుల గురించి నువ్వు ఎప్పుడైనా మాట్లాడినావా? అని ప్రశ్నించారు.
రాబోయే ఎన్నికల గురించి మాట్లాడేవాడు కేవలం నాయకుడు మాత్రమే. కానీ రాబోయే తరం గురించి మాట్లాడే వాళ్లు నిజమైన నాయకులు. కేసీఆర్ నిజమైన నాయకుడు. ఎందుకంటే రాబోయే తరం గురించి మాట్లాడడమే కాదు, పని చేసి చూపెట్టిండు. పేదింటి బిడ్డ కూడా రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకోవాలని, ఆయన గిరిజన, ఆదివాసీ, దళిత బిడ్డల కోసం, బీసీ, బడుగు, బలహీన వర్గాల కోసము బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలను ప్రారంభించి, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 1,000 గురుకుల పాఠశాలల్లో 6 లక్షల మందిని విద్యార్థులను చదివించిండు. ఇది కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనం. పిల్లలు ఈరోజు ఐఐటీలకు పోటీ పడుతున్నారు, బిట్స్ పిలానీకి వెళ్తున్నారు, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతున్నారు, నేషనల్ ఛాంపియన్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్స్ సాధిస్తున్నారు. దట్ ఇస్ ద విజన్, దట్ ఎ లీడర్ షుడ్ హావ్! (That is the vision that a leader should have!) అని రాకేశ్‌రెడ్డి కొనియాడారు.
కానీ, రేవంత్ విజన్ అంతా ఫ్యూచర్ సిటీ గురించే, ఆయన ఫ్యూచర్ గురించే. విద్యార్థుల ఫ్యూచర్ గురించో, రాష్ట్ర ఫ్యూచర్ గురించో కాదు. పాఠశాలలను పెంచాల్సిన ముఖ్యమంత్రి 27,000 పాఠశాలలు ఉంటే కేవలం 4,000లకే కుదిస్తా అని చెప్పి సిగ్గు, శరం లేకుండా మాట్లాడతా ఉన్నాడు. ఇంతకంటే దుర్మార్గం ఉంటదా? నాకు అర్థం కాదు.
పేదింటి బిడ్డ కూడా విదేశాల్లో చదువుకోగలగాలని, వారు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ తీసుకొస్తే.. వేల మంది అమెరికాలో, ఇంగ్లాండ్‌లో, ఆస్ట్రేలియాలో, జర్మనీలో ఈరోజు చదువుకుంటున్నారు. కానీ, నువ్వు తీసుకొచ్చిన మార్పు ఏంది?
నువ్వు ఎంతసేపు రాబోయే ఎన్నికల్లో ఇట్లా జరుగుతది, అట్లా జరుగుతది అని అంటున్నావు తప్ప... రాబోయే రోజుల్లో ఈ విద్యాశాఖలో ఈ సమూలమైన మార్పులు తీసుకొస్తా, ఈ సంస్కరణలు తీసుకొస్తా అని ఎప్పుడైనా మాట్లాడినావా అని అడుగుతున్నా అని నిలదీశారు.
విద్య మట్టి మనిషిని కూడా మహోన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతది, సత్ప్రవర్తన కలిగిన ఒక వ్యక్తిగా తీర్చిదిద్దుతది.
అందుకే విద్యాలయాలను దేవాలయాలుగా మనం భావిస్తాం. ఆ దేవాలయాల్లో ఉన్న గురువులను దేవుళ్లుగా కొలుస్తాం. ఒక శిల్పి శిలను ఏ రకంగా ఏకాగ్రతతోని, కళాత్మకంగా శిల్పంగా చెక్కుతాడో... ఆ రకంగానే ఉపాధ్యాయుడు కూడా ఒక విద్యార్థిని అద్భుతమైనటువంటి మానవ వనరుగా, భావి భారత పౌరుడిగా తీర్చిదిద్దుతాడు. అందుకే ఈ దేశంలో మన సంస్కృతిలో గురువుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి గురువు ఈరోజు అవస్థల పాలవుతున్నాడు? శిల్పి ఒళ్లంతా గాయాలు చేసి నువ్వు దాన్ని శిల్పంగా చెక్కమంటే చెక్కగలుగుతాడా? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్లందరినీ అవస్థల పాలు చేసి... నువ్వు మంచి విద్యార్థులను, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దమంటే అది ఎట్లా సాధ్యమైతది అని అడుగుతున్నా?
కనీసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (infrastructure) ఉండవు, చాక్‌పీస్‌లు ఉండవు, టాయిలెట్స్ ఉండవు.. ఏమీ ఉండవు. అలాంటప్పుడు పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలతోని ఎట్లా పోటీ పడతాయి? ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి.
ప్రభుత్వం బీసీ, బడుగు, బలహీన వర్గాలు, దళిత బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు కూడా ప్రైవేట్ పాఠశాలల్లో అందుకునేటువంటి విద్యను అందుకునే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి.
నిన్న కాక మొన్న మీరు చూసిండ్రు కదా, ఇంజనీర్లు అందరూ కూడా క్రిమినల్ వేస్ట్ అంటాడు! ఈ దేశంలో ఎవరైనా అతిపెద్ద క్రిమినల్ ఉన్నారంటే నువ్వే. 89 కేసులు ఉన్నాయి నీ మీద. నువ్వే అతిపెద్ద క్రిమినల్‌వు. ఇంజనీరింగ్ విద్యలో స్కిల్ గ్యాప్ ఉన్నటువంటి విషయం వాస్తవం, నేను కూడా ఒప్పుకుంటున్నా. ఒకవేళ స్కిల్ గ్యాప్ ఉంటే ఆ గ్యాప్‌ని ఎట్లా ఫిల్ చేయాలి అనేది ముఖ్యమంత్రి ఆలోచించాలి. విద్యాశాఖ మంత్రి ఆలోచించాలి. సంస్కరణలు తీసుకురావాలి, కార్యాచరణ ప్రకటించాలి. అది చేయకుండా, 'నేను పాఠశాలలను మూసేస్తా', 'ఇంజనీర్లు అందరూ క్రిమినల్స్', ' నిరుద్యోగులందరూ కూడా అడవికి కూలీలు', 'ఎండ్రిన్ తాగి చావండి'... గిదా మాట్లాడాల్సింది? చాలా బాధాకరం.
మొన్న ఒక ఈవెంట్‌లో మాట్లాడుతూ... టీచర్లని ఏమంటాడంటే "మీరు కొట్లాడాల్సింది విద్యార్థుల కోసం, మీ కోసం కాదు" అంటాడు. నాకు అర్థం కాదు, ఒక ఉపాధ్యాయుడు పాఠశాలలో పుస్తకం పట్టుకొని చదువు చెప్పాలి. చదువు చెప్పకుండా ఈ కొట్లాడుడేంది. ఒకవేళ నిజంగా ఉపాధ్యాయులు కొట్లాడుతున్నారు అంటే... అంటే నువ్వు ఫెయిల్ అయినట్టే కదా? నువ్వు మంచి విద్యను అందించడంలో, విద్యార్థులకు కావలసినటువంటి సదుపాయాలను క్రియేట్ చేయడంలో నువ్వు ఫెయిల్ అయినట్టే కదా? ఉపాధ్యాయుడు ఎందుకు కొట్లాడుతాడు? నాకు అర్థం కాదు. అయినా ఈరోజు ఉపాధ్యాయులు కొట్లాడేది కేవలము వాళ్ల సదుపాయాల గురించో, వాళ్ల బెనిఫిట్స్ గురించో కాదు... నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి కావలసినటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలని చెప్పేసి ఈరోజు ఉపాధ్యాయులు కొట్లాడుతున్నారు! ఈ విషయం చాలామంది గమనించట్లే.
నిన్న నేను మిర్యాలగూడ టౌన్‌లో ఉన్న ఒక గురుకుల పాఠశాలను విజిట్ చేసినా. ఒక ఎస్సీ గురుకులాన్ని కూడా నేను విజిట్ చేసినా. అక్కడ ఉన్న ఉపాధ్యాయులు చెప్పేదేందంటే... రెసిడెన్షియల్ పాఠశాలలో వార్డెన్ లేరు. అంటే ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడే వార్డెన్ వృత్తి కూడా చేయాలి. మరి ఒకవైపు రోజంతా పాఠశాలలో పుస్తకాలు పట్టుకొని ఆయన పాఠాలు చెప్పాలి, మళ్లా రాత్రంతా వార్డెన్ డ్యూటీ చేయాలి.. ఇది సాధ్యమేనా? వాటి గురించి మాట్లాడుతున్నారు ఈరోజు! 'మా పాఠశాలల్లో కంప్యూటర్లు కావాలి' అంటున్నారు. 'మా పాఠశాలలకు డిజిటల్ ఎడ్యుకేషన్ కావాలి' అంటున్నారు, 'డిజిటల్ బోర్డ్స్ కావాలి' అంటున్నారు.
సహజంగా ఏ వ్యక్తి అయినా కూడా, ఏ వృత్తిలో ఉన్నా కూడా... సహజంగా మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు కావాలని కోరుకుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే కదా కాంగ్రెస్ పార్టీ ఆరోజు శాసనసభ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా... చాలా స్పష్టంగా 'పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలను మేం క్లియర్ చేస్తాం' అని చెప్పింది. చెప్పిండ్లా లేదా? మరి ఈరోజు ఎందుకు తొండి ముచ్చట్లు చెప్తున్నారు? ఉపాధ్యాయులేదో తప్పు చేస్తున్నట్టుగా వాళ్లపైనే ఎందుకు నిందలు వేస్తున్నారు? కేసీఆర్ దిగిపోయే సమయానికి 3 డీఏలు పెండింగ్‌లో ఉండేవి. ఆరోజు కరోనా కష్టకాలంలో ప్రజల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ప్రభుత్వము 3 డీఏలను పెండింగ్ పెట్టింది, వాస్తవమే. కానీ రేవంత్ రెడ్డి గారొచ్చి రెండున్నరేళ్లు గడిచింది. ఈ రెండున్నరేళ్లలో ఈయన 6 డీఏలను పెండింగ్‌లో పెట్టిండు! ఇది ఈయన నిర్వాకం.
ఇంకా పైగా మళ్లా కాంగ్రెసోళ్లు మాకు నీతులు చెప్తారు, మేం ఒకటో తారీఖు జీతం ఇస్తాం' అని. నువ్వు ఒకటో తారీఖు జీతం ఇచ్చుడు తప్పిస్తే... అది ఇచ్చుడు తప్పిస్తే ఇంకేం చేయట్లే నువ్వు! డీఏలన్నీ పెండింగ్‌లో పెట్టినవు.
పీఆర్‌సీ గురించి రెండున్నరేళ్ల నుంచి మాట్లాడుతూనే ఉన్నారు గానీ, దాని గురించి ఇప్పటివరకు ఒక్క చర్య లేదు
ఈరోజు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిత్యావసర వస్తువులను కొనే పరిస్థితి లేదు. 500 రూపాయలతో మార్కెట్‌కు పోతే కూరగాయలు వస్తలేవు. విద్య, వైద్యం, రవాణా ఖర్చులు పెరిగిపోతున్నాయి.
ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు పీఆర్‌సీని అడిగితే ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అని నేను అడుగుతున్నా. ఆరోజు కేసీఆర్ రెండుసార్లు.. ఒకసారి 30%, ఇంకోసారి 32%... ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులకైతే 42% ఫిట్‌మెంట్ కూడా ఇచ్చిండు మరి. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల తర్వాత మళ్లీ పీఆర్‌సీ ఇద్దామనుకొని, 5% ఐఆర్ (IR) ఇచ్చి ఆయన దిగిపోయిండు.
మరి మీరు పీఆర్‌సీ ఇస్తామని చెప్పి... ఈరోజు ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా పీఆర్‌సీ గురించి కొట్లాడితే ప్రభుత్వం నోరు తెరవదు! కనీసం వాళ్లతో చర్చలు జరపదు. ఏంది ఈ దుర్మార్గం అని అడుగుతున్నా? ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) పోయి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) రావాలని కోరుకుంటున్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లో ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత జీవితకాలం పాటు తనకు లేదా తన భార్యకు నెనెలా పెన్షన్ వచ్చేది.. 5,000 లో, 10,000 లో, 15,000 లో. దాంతోని వాళ్ల శేష జీవితం గడిపేటువంటి వాళ్లు.
కానీ, ఈరోజు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వచ్చిన తర్వాత... రిటైర్ అయిన తర్వాత రూపాయి పెన్షన్ కూడా రాదు! ఆ శేష జీవితం అంతా కూడా మళ్లీ కొడుకు మీదనో, బిడ్డ మీదనో ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడతది.
మనవడో, మనవరాలో వస్తే ఒక 10 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఒక చాక్లెటో, బిస్కట్ పొట్లాన్నో కొనుక్కోవడానికి 10 రూపాయలు ఇచ్చేటువంటి ఆస్కారం కూడా ఉండదు. "మాకు ఈ CPS వద్దు, మాకు OPS విధానం కావాలి" అని చెప్పేసి ఉపాధ్యాయులందరూ, ఉద్యోగస్తులందరూ కొట్లాడుతా ఉన్నారు.
ఆరోజు కేసీఆర్ ప్రభుత్వం మీద మీరు ఎన్ని అపవాదులు వేసిండ్లు, ఎన్ని విమర్శలు చేసిండ్లు! మరి OPS తీసుకొస్తామన్నటువంటి మీ హామీ ఏమైంది, మీ వైఖరి ఏమైంది అని చెప్పాలి. దీనిమీద కూడా ప్రభుత్వం స్పందించాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అదే కాక, ఈరోజు రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయుల బెనిఫిట్స్ కోసం కళ్లు కాయలు కాచేలాగా వాళ్లు ఎదురుచూస్తున్నారు. 20,000 కోట్ల రూపాయలు ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో.. 23 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చనిపోయిర్రు ఈ రాష్ట్రంలో, రిటైర్డ్ ఉపాధ్యాయులు చనిపోయిర్రు రిటైర్స్‌మెంట్ బెనిఫిట్స్ రాక. కాబట్టి విద్యాశాఖను ఈరోజు సమూలంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. విద్యాశాఖకు అత్యధిక నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది.
15% ఖర్చు చేస్తాం అన్నటువంటి ప్రభుత్వం.. కనీసం ఈ ఏడాదైనా ఎంత ఖర్చు చేస్తదో చెప్పాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. మీరు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలంటే, పాఠశాలల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని అప్‌గ్రేడ్ చేయాలంటే తప్పకుండా అత్యధిక నిధులు కేటాయించాల్సిందే. విద్యాశాఖ బాగుపడాలంటే ఉపాధ్యాయుల డిమాండ్లను కూడా నెరవేర్చాలి. పీఆర్‌సీని అమలు చేయాలి, పెండింగ్‌లో ఉన్నటువంటి 3 డీఏలను కూడా వెంటనే క్లియర్ చేయాలి, 317 ను రద్దు చేసి ఆ ప్లేస్‌లో అమెండ్‌మెంట్స్‌తో ఇంకో జీవో తీసుకొస్తామన్నారు, దాన్ని కూడా అమలు చేయాలి.
ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని తీసుకొస్తామన్నారు, దాన్ని కూడా వెంటనే తీసుకురావాలి, దానికి కావలసినటువంటి కార్యాచరణను కూడా వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని రాకేశ్‌రెడ్డి పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

ABVP Protest | హైడ్రా కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు.. వెంటనే ఆ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి
ఆగస్టు 6, 2026

Kavitha | చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే.. వారి కోసం మాట్లాడితే పళ్లు ఇకిలిస్తున్నరు
ఆగస్టు 6, 2026

Bangaram Song | సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘బంగారం’ సాంగ్.. డెమాన్ పవన్, రీతూ కెమిస్ట్రీపై ప్రశంసలు
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ● స్క్రీన్ వెనుక మాయాజాలం: డీప్‌ఫేక్ మూలాల్ని నరుకుతున్న ‘డిజిటల్ డిటెక్టివ్లు’
- ●CJP Abhijeet Dipke | ఒకటో తరగతికి లక్షన్నర ఫీజు అయితే.. డబ్బులు ఎక్కడ్నుంచి వస్తయ్..?
- ●ABVP Protest | హైడ్రా కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు.. వెంటనే ఆ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి
- ●Punjab Assembly Elections 2027 | పంజాబ్ ఎన్నికల సర్వే: 'ఆప్'కే మళ్లీ చాన్స్.. కానీ ఆ ఒక్క తప్పే కొంపముంచొచ్చు!
- ●Liquor Shops | అబ్బా.. హైదరాబాద్‌లో మళ్లీ వైన్స్ బంద్
- ●Kavitha | చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే.. వారి కోసం మాట్లాడితే పళ్లు ఇకిలిస్తున్నరు

స్క్రీన్ వెనుక మాయాజాలం: డీప్‌ఫేక్ మూలాల్ని నరుకుతున్న ‘డిజిటల్ డిటెక్టివ్లు’

CJP Abhijeet Dipke | ఒకటో తరగతికి లక్షన్నర ఫీజు అయితే.. డబ్బులు ఎక్కడ్నుంచి వస్తయ్..?

ABVP Protest | హైడ్రా కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు.. వెంటనే ఆ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి

Punjab Assembly Elections 2027 | పంజాబ్ ఎన్నికల సర్వే: 'ఆప్'కే మళ్లీ చాన్స్.. కానీ ఆ ఒక్క తప్పే కొంపముంచొచ్చు!



