త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

JEE Main | జేఈఈ మెయిన్ 2027 సెషన్-1 రిజిస్ట్రేష‌న్లు షురూ.. జ‌న‌వ‌రి 20 నుంచి ఎగ్జామ్స్‌

JEE Main | దేశంలోని అత్యున్నత సాంకేతిక విద్యా సంస్థలైన ఎన్‌ఐటీలు, ఐఐఐటీల‌లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2027 (JEE Main) సెషన్ 1 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. న‌వంబ‌ర్ 22 వ‌ర‌కు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో ద‌రఖాస్తు (Session 1 applications) చేసుకోవ‌చ్చు.

G

National | Published On Oct 25, 2026, 2.45 pm IST

JEE Main | జేఈఈ మెయిన్ 2027 సెషన్-1 రిజిస్ట్రేష‌న్లు షురూ.. జ‌న‌వ‌రి 20 నుంచి ఎగ్జామ్స్‌
Advertisement

JEE Main | త్రినేత్ర న్యూస్‌: దేశంలోని అత్యున్నత సాంకేతిక విద్యా సంస్థలైన ఎన్‌ఐటీలు, ఐఐఐటీల‌లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2027 (JEE Main) సెషన్ 1 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. న‌వంబ‌ర్ 22 వ‌ర‌కు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో ద‌రఖాస్తు (Session 1 applications) చేసుకోవ‌చ్చు. సెష‌న్ 1 పరీక్షలను 2027 జనవరి 20, 21, 22, 23, 24, 28 తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షను ఇంగ్లీష్‌తో పాటు తెలుగు భాషలోనూ కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) నిర్వహించనుంది.

అర్హులు ఎవంటే..

2025 లేదా 2026లో ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైన వారు, లేదా 2027లో సెకండియ‌ర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు జేఈఈ మెయిన్ సెష‌న్‌-1కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పరీక్ష రాయడానికి ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష పూర్తి చేసిన తర్వాత వరుసగా మూడేండ్ల‌ పాటు జేఈఈ మెయిన్స్ రాసే వెసులుబాటు ఉంటుంది.

కాగా, గ‌డువులోగా ద‌ర‌ఖాస్తు చేసుకోలేక‌పోయిన వారికి రూ.500 ఆలస్య రుసుముతో నవంబర్ 23 నుంచి 26వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించింది. అదేవిధంగా దరఖాస్తులో ఏవైనా తప్పులు దొర్లితే వాటిని సరిదిద్దుకోవడానికి నవంబర్ 27 నుంచి 29 వరకు కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది. పరీక్ష రాసే నగరం వివరాలతో కూడిన `సిటీ ఇంటిమేషన్ స్లిప్`ను 2026 డిసెంబర్ 30న విడుదల చేయ‌నుంది. అడ్మిట్ కార్డుల‌ను 2027 జనవరి 13న అందుబాటులో ఉంచ‌నుంది.

అప్లికేష‌న్‌ ఫీజు..

జనరల్ కేటగిరీ: బాలురు రూ.1,000, బాలికలు రూ.800
జనరల్ -ఈడబ్ల్యూఎస్, ఓబీసీ- ఎన్​సీఎల్: బాలురు రూ.900, బాలికలు రూ.800
ఎస్సీ, ఎస్టీ, దివ్వాంగులు: రూ.500

సెష‌న్‌-2 షెడ్యూల్ ఇలా..

జేఈఈ మెయిన్ మొదటి సెషన్‌తో పాటే సెషన్ 2 (ఏప్రిల్) షెడ్యూల్‌ను (JEE Main Session 2) కూడా ఎన్టీఏ వెల్లడించింది. సెషన్-2 దరఖాస్తు ప్రక్రియ 2027 జనవరి 5న ప్రారంభ‌మ‌వుతుంది. ఫిబ్రవరి 3 వరకు ద‌ర‌ఖాస్తుల‌కు అవ‌కాశం ఇచ్చింది. ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు ఆలస్య రుసుముతో అప్ల‌య్‌ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు క‌రెక్ష‌న్‌ విండో అందుబాటులో ఉంటుంది. సెషన్-2 ఎగ్జామ్ సిటీ స్లిప్ మార్చి 12న, అడ్మిట్ కార్డులు అదే నెల‌ 25న విడుదల చేయ‌నుంది. 2027 ఏప్రిల్ 2 నుంచి 7వ తేదీ వ‌ర‌కు సెషన్-2 పరీక్షలు జరగనున్నాయి.

 

Advertisement
Advertisement