త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Isro | మ‌రో ప్ర‌యోగానికి సిద్ధ‌మైన ఇస్రో.. NVS-03 ఉపగ్రహం ప్రత్యేకత ఏమిటి..?

Isro | అంతరిక్ష రంగంలో స్వదేశీ సాంకేతికను మరింత బలోపేతం చేసే దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మ‌రో కీల‌క ప్ర‌యోగానికి సిద్ధ‌మైంది. దేశీయ నావిగేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు GSLV-F18 రాకెట్ ద్వారా NVS-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంప‌నుంది.

D

National | Published On Oct 29, 2026, 10.40 pm IST

Isro | మ‌రో ప్ర‌యోగానికి సిద్ధ‌మైన ఇస్రో.. NVS-03 ఉపగ్రహం ప్రత్యేకత ఏమిటి..?
Advertisement

Isro | త్రినేత్ర న్యూస్ : అంతరిక్ష రంగంలో స్వదేశీ సాంకేతికను మరింత బలోపేతం చేసే దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మ‌రో కీల‌క ప్ర‌యోగానికి సిద్ధ‌మైంది. దేశీయ నావిగేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు GSLV-F18 రాకెట్ ద్వారా NVS-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంప‌నుంది. ఈ రాకెట్‌ను శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి రేపు రాత్రి స‌రిగ్గా 11 గంట‌ల 51 నిమిషాల‌కు ప్ర‌యోగించ‌నుంది.

ఇది జీఎస్‌ఎల్‌వీ (GSLV) సిరీస్‌లో 20వ ప్రయోగం. భారతదేశపు సొంత జీపీఎస్ లాంటి 'నావిక్' (NavIC) సేవలను నిరంతరాయంగా అందించడం కోసం ఉద్దేశించిన రెండో తరం (Next-Generation) నావిగేషన్ ఉపగ్రహాల సిరీస్‌లో మూడవది (NVS-03) కావ‌డం విశేషం. సుమారు 50 మీట‌ర్ల పొడ‌వు, 420 ట‌న్నుల బ‌రువు ఉంటుంది. సాధారణ మొబైల్ ఫోన్లు, వాణిజ్య వాహనాల్లో జీపీఎస్ తరహాలోనే నావిక్ సేవలను సులభంగా పొందేందుకు వీలుగా ఇందులో కొత్తగా ఎల్-1 బ్యాండ్ సిగ్నల్‌ను చేర్చారు.

రుబీడియం అటామిక్ క్లాక్

ఈ ఉపగ్రహంలో అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (SAC) అభివృద్ధి చేసిన అత్యంత ఖచ్చితమైన స్వదేశీ రుబీడియం అటామిక్ క్లాక్ (Indigenous Rubidium Atomic Clock)ను కూడా అమర్చారు. ఈ ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరితే భారత ప్రధాన భూభాగంతో పాటు సరిహద్దుల వెలుపల దాదాపు 1500 కిలోమీటర్ల మేర నిరంతరాయంగా అత్యంత ఖచ్చితమైన పొజిషనింగ్, నావిగేషన్, టైమింగ్ (PNT) సేవలను మరింత సమర్థవంతంగా అందిస్తుంది. దీనివల్ల విదేశీ నావిగేషన్ సిస్టమ్‌లపై ఆధారపడటం తగ్గుతుంది. భారత్ సొంతంగా అభివృద్ధి చేసిన ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ NavIC సేవలను తిరిగి మెరుగుపరచడంలో ఈ ప్రయోగం కీలకంగా మారనుంది.

నావిగేష‌న్ సేవ‌ల‌కు 4 క్రియాశీలక ఉపగ్రహాలు అవ‌స‌రం

నావిక్ వ్యవస్థ ప్రాథమిక నావిగేషన్ సేవలను (standalone positioning) అందించడానికి కక్ష్యలో కనీసం 4 క్రియాశీలక (operational) ఉపగ్రహాలు అవ‌స‌రం. అయితే, పాత ఉపగ్రహాలు కాలం చెల్ల‌డం, అటామిక్ క్లాక్స్ (atomic clocks) వైఫల్యాల వల్ల ఈ వ్యవస్థలో సమస్యలు ఏర్పడిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం కక్ష్యలో కేవలం 3 ఉపగ్రహాలు మాత్రమే (IRNSS-1B, IRNSS-1I, NVS-01) పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. దీనివల్ల నావిక్ ప్రస్తుతం సమయ సేవలను (timing services) మాత్రమే అందిస్తోంది. కానీ స్వతంత్ర నావిగేషన్ పొజిషనింగ్ సేవలను అందించలేకపోతోంది. ఈ వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ధ‌రించేందుకే ఇస్రో NVS-03 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ (GSLV-F18) రాకెట్ ద్వారా ప్రయోగించేందుకు సిద్ధ‌మైంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, కక్ష్యలో ఉపగ్రహాల సంఖ్య 4కు చేరి నావిక్ ప్రాథమిక పొజిషనింగ్ సేవలు మళ్లీ ప్రారంభమవుతాయి.

NVS-04, NVS-05 కూడా..

అయితే, భారత దేశపు స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ అయిన NavIC (నావిక్) తిరిగి పూర్తి స్థాయిలో పటిష్టంగా పనిచేయడానికి మరిన్ని ఉపగ్రహ ప్రయోగాలు అవసరమవుతాయి. అందుకే ఇస్రో ఇప్ప‌టికే NVS-04, NVS-05 పై కూడా దృష్టిపెట్టింది. ఈ రెండు ఉపగ్రహాలు ప్రస్తుతం అధునాతన రూపకల్పన (advanced stages of realization) దశలో ఉన్నాయి. NVS-03 విజయవంతమైన తర్వాత రాబోయే 6 నుంచి 12 నెలల వ్యవధిలో వీటిని కూడా ప్రయోగించడానికి ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Also Read..

ఆ నిర‌స‌న‌ల్లో పాల్గొనే వారు ప్ర‌భుత్వ ఉద్యోగానికి అన‌ర్హులు.. యూపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

డేంజ‌ర‌స్ ఏఐ.. వైద్య స‌ల‌హాతో ప్రాణాలు కోల్పోయిన మ‌హిళ‌..

లాఠీల‌కు భ‌య‌ప‌డ‌కండి.. ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాల‌నుకుంటే చ‌లో ఢిల్లీలో పాల్గొనండి : రాహుల్ గాంధీ

Advertisement
Advertisement