త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Satish Chander Novel | పరువు హత్యలపై సరికొత్త వ్యంగ్యాస్త్రం: సతీష్ చందర్ ‘పరువు తండ్రి – ఎరువు భర్త’ నవల ఆవిష్కరణ!

సమాజాన్ని పట్టిపీడిస్తున్న పరువు హత్యలపై ప్రముఖ రచయిత సతీష్ చందర్ సంధించిన తాత్త్విక వ్యంగ్య నవల ‘పరువు తండ్రి - ఎరువు భర్త’ హైదరాబాద్‌లో ఘనంగా ఆవిష్కృతమైంది.

J

Telangana | Published On Oct 29, 2026, 9.22 pm IST

Satish Chander Novel | పరువు హత్యలపై సరికొత్త వ్యంగ్యాస్త్రం: సతీష్ చందర్ ‘పరువు తండ్రి – ఎరువు భర్త’ నవల ఆవిష్కరణ!

సంక్షిప్త సారాంశం

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సతీష్ చందర్ రచించిన ‘పరువు తండ్రి - ఎరువు భర్త’ నవలను ఆవిష్కరించిన ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు. పరువు హత్యలపై లోతైన తాత్త్విక దృష్టితో, వ్యంగ్య శైలిలో వచ్చిన భారతీయ సాహిత్యపు తొలి నవలగా సాహితీవేత్తల ప్రశంస. ఆస్తికి కొడుకుని, పరువుకు కూతుర్ని వారసులుగా చూసే వివక్షాపూరిత ఆలోచనలను నవలలో రచయిత బలంగా ప్రశ్నించారని జూలూరు గౌరీశంకర్ వెల్లడి. కులం ముసుగులో స్త్రీ స్వేచ్ఛను, హక్కులను కాలరాస్తున్న వైనాన్ని రచయిత దృశ్యకావ్యంగా మలిచారని ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ వ్యాఖ్య.

Advertisement

Satish Chander Novel | త్రినేత్ర న్యూస్ : సమాజంలో వేళ్లూనుకుపోయిన కుల జాడ్యం, ప్రతినిత్యం పెరుగుతున్న పరువు హత్యలపై ప్రముఖ పాత్రికేయులు, వ్యంగ్య రచయిత సతీష్ చందర్ కలం నుంచి మరో అద్భుత సృష్టి వెలువడింది. ఆయన రాసిన నూతన నవల ‘పరువు తండ్రి - ఎరువు భర్త’ భారతీయ సాహిత్య చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోతుందని సాహితీ ప్రముఖులు, విద్యావేత్తలు కొనియాడారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు ఈ నవలను లాంఛనంగా ఆవిష్కరించారు.

కుల వైషమ్యాలు.. హింసపై తాత్త్విక విశ్లేషణ

పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు మాట్లాడుతూ.. ఇద్దరు కులపీడితుల మధ్య వైరాన్ని ఆధిపత్య శక్తులు ఏ విధంగా సృష్టిస్తాయో రచయిత ఈ నవలలో కళ్లకు కట్టినట్లు చూపించారని పేర్కొన్నారు. పరువు హత్యల వెనుక దాగి ఉన్న హింస, ట్రాజెడీతో పాటు సమాజపు నైజాన్ని నిలదీసే తాత్త్విక చింతనను రచయిత గొప్పగా ఆవిష్కరించారని ప్రశంసించారు.

ఆస్తికి కొడుకు.. పరువుకు కూతురా?

ఈ ఆవిష్కరణ సభకు తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అధ్యక్షత వహించారు. నేటి ఆధునిక సమాజంలోనూ కులం ఇంకా ఎంత బలంగా పాతుకుపోయిందో నవలలోని పాత్రలు స్పష్టం చేస్తున్నాయన్నారు.

"ఆస్తికి వారసుడిగా కొడుకును చూస్తూ.. కుటుంబ పరువుకు మాత్రం కూతుర్నే బలిపీఠం ఎక్కించే వికృత పోకడలను నవలలోని పాత్రల ద్వారా రచయిత సూటిగా ప్రశ్నించారు. పేజీలు తిరగేస్తున్న కొద్దీ ఒక సినిమా లేదా దృశ్యాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతోంది. ఇది కేవలం పుస్తకం కాదు, అద్భుతమైన దృశ్యకావ్యం" అని గౌరీశంకర్ కొనియాడారు.

పరువు పేరుతో స్త్రీ స్వేచ్ఛను హరించడమే: కుప్పిలి పద్మ

ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ స్త్రీవాద రచయిత్రి కుప్పిలి పద్మ మాట్లాడుతూ.. మహిళలు తమ హక్కులను గుర్తించి స్వేచ్ఛగా జీవించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో, ‘పరువు’ పేరుతో వారి ప్రాణాలను తీయడం అత్యంత అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా హక్కులు, స్త్రీవాద దృక్పథాన్ని సతీష్ చందర్ పాత్రల ద్వారా ఎంతో సున్నితంగా, అంతే తీవ్రంగా ప్రజెంట్ చేశారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ‘ఆంధ్రప్రభ’ సచిత్ర వారపత్రిక పూర్వ సంపాదకులు వల్లూరి రాఘవరావు, ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం కరస్పాండెంట్ గౌరీచందర్, అధ్యాపకులు ఎం. స్రవంత్ తదితరులు పాల్గొని.. పరువు హత్యల తీవ్రతను నవలా రూపంలోకి తీసుకువచ్చిన రచయిత సతీష్ చందర్ శైలిని సోదాహరణంగా విశ్లేషించారు.

Advertisement
Advertisement