త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Invest Telangana Global Summit 2026 | ఢిల్లీలో ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సమ్మిట్: 3 ట్రిలియన్ డాలర్ల టార్గెట్

ఢిల్లీ వేదికగా ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ - 2026’ కర్టెన్ రైజర్ అట్టహాసంగా ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో కీలక ప్రకటనలు వెలువడ్డాయి.

J

Telangana | Published On Oct 29, 2026, 8.37 pm IST

Invest Telangana Global Summit 2026 | ఢిల్లీలో ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సమ్మిట్: 3 ట్రిలియన్ డాలర్ల టార్గెట్

సంక్షిప్త సారాంశం

దేశ రాజధాని న్యూఢిల్లీలో 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ - 2026' కర్టెన్ రైజర్ ఈవెంట్ ఘనంగా ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో పారిశ్రామికవేత్తలతో కీలక భేటీ జరిగింది. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న సమ్మిట్‌కు రావాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపు. 700 ఏళ్ల నాటి కాకతీయ గణపతి దేవుడి మోటుపల్లి శాసనాన్ని గుర్తు చేస్తూ.. రేవంత్ సర్కార్ 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని స్వాగతించిన పీయూష్ గోయల్.

Advertisement
  • ఢిల్లీలో 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026'
  • పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ టీమ్ ఆహ్వానం

Invest Telangana Global Summit 2026 | త్రినేత్ర న్యూస్ : తెలంగాణను అంతర్జాతీయ పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ - 2026' కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ దేశ రాజధాని న్యూఢిల్లీలో గురువారం వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య సారథ్యం వహించగా.. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వాణిజ్య మండళ్ల ప్రతినిధుల భారీ భాగస్వామ్యంతో ఈ వేదిక సందడిగా మారింది.

సదస్సు ప్రారంభంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ.. ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఏరోస్పేస్ తదితర కీలక రంగాల్లో హైదరాబాద్ సాధించిన అద్భుత ప్రగతిని, ఇన్వెస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు.

3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం.. ఫ్యూచర్ సిటీకి ఆహ్వానం: మంత్రి శ్రీధర్ బాబు

ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

"ఇప్పటికే హైదరాబాద్ ఐటీ, ఫార్మా రంగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. డిఫెన్స్, ఏరోస్పేస్ విభాగాల్లోనూ దేశానికే దిక్సూచిగా మారింది. రాబోయే తరాలను గ్లోబల్ లెవల్‌లో పోటీపడే నైపుణ్య శక్తిగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ'ని నెలకొల్పారు. త్వరలోనే అత్యాధునిక 'భారత్ ఫ్యూచర్ సిటీ'లో జరగబోయే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు తరలివచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలకు మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం" అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

కాకతీయుల నాటి చరిత్రను గుర్తు చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

కార్యక్రమంలో ప్రసంగించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. తెలంగాణ పారిశ్రామిక సంకల్పాన్ని ప్రశంసించారు. 'వికసిత్ భారత్ 2047' లక్ష్య సాధనలో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

"ఇప్పుడు దసరా, కర్వాచౌత్, దీపావళి పండుగల సీజన్ నడుస్తోంది.. ఈ తరుణంలో ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్ మరో సరికొత్త పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. 700 ఏళ్ల క్రితమే కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు నౌకా వాణిజ్యానికి రక్షణ కల్పిస్తూ చరిత్రాత్మక 'మోటుపల్లి అభయ శాసనం' వేయించారు. ఆనాటి వ్యాపారులైనా, ఇప్పటి ఇండస్ట్రియలిస్టులైనా తమ పెట్టుబడులకు రక్షణ, ప్రభుత్వ పాలసీలలో స్థిరత్వాన్నే కోరుకుంటారు" అని గోయల్ వ్యాఖ్యానించారు.

ప్రపంచంలోని టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచిందని, మధ్య ఆసియా సంక్షోభం వంటి గ్లోబల్ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ దేశ ఎగుమతులు అంచనాలను మించి దూసుకుపోతున్నాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇదే క్రమంలో 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుకున్న స్పష్టమైన లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని పీయూష్ గోయల్ ప్రకటించారు.

Advertisement
Advertisement