త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy Delhi Speech | మీ పెట్టుబడులను డబుల్ చేయండి.. సంరక్షకుడిగా నేనుంటా

"మీరు పెట్టాలనుకున్న పెట్టుబడిని రెట్టింపు చేయండి.. వాటికి సంరక్షకుడిగా నేనుంటా" అంటూ ఢిల్లీ వేదికగా అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

J

Telangana | Published On Oct 29, 2026, 9.06 pm IST

Revanth Reddy Delhi Speech | మీ పెట్టుబడులను డబుల్ చేయండి.. సంరక్షకుడిగా నేనుంటా

సంక్షిప్త సారాంశం

డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్'కు పారిశ్రామిక దిగ్గజాలకు సీఎం రేవంత్ రెడ్డి సాదర ఆహ్వానం. తెలంగాణలో పెట్టే ప్రతి పైసా పెట్టుబడికి సంరక్షకుడిగా ఉంటానని, లాభాలు, వృద్ధి అంచనాలను రెట్టింపు చేసుకునేలా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే అంతిమ లక్ష్యమని వెల్లడి. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణేలకు మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు, వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందుతోందని స్పష్టీకరణ.

Advertisement
  • పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్
  • ఢిల్లీ సమ్మిట్‌లో సంచలన పిలుపు

Revanth Reddy Delhi Speech | త్రినేత్ర న్యూస్ : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్న దేశ, విదేశీ పారిశ్రామిక దిగ్గజాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఒక అద్భుతమైన భరోసా ఇచ్చారు. "తెలంగాణలో ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో మీ మనసులో ఒక సంఖ్యను అనుకోండి.. దాన్ని వెంటనే రెట్టింపు చేయండి! మీ లాభాలనూ, వృద్ధి అంచనాలనూ రెట్టింపు చేసుకోండి. మీ పెట్టుబడులకు సెక్యూరిటీ కల్పించి, అవి వేగంగా వృద్ధి చెందేలా చూసే బాధ్యత నాది.. మీ పెట్టుబడులకు నేను సంరక్షకుడిగా ఉంటా" అని సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ వేదికగా గురువారం జరిగిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ కర్టెన్ రైజర్ ఈవెంట్‌లో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని సరికొత్త ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ వేదికగా జరగనున్న మెగా ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలను సాదరంగా ఆహ్వానించారు.

హైదరాబాద్ డీఎన్‌ఏలోనే గ్లోబల్ విజన్ ఉంది

హైదరాబాద్‌కు 400 ఏళ్ల ఘనమైన వాణిజ్య చరిత్ర ఉందని సీఎం గుర్తుచేశారు. ఆనాటి చార్మినార్ వీధుల్లో ముత్యాలు, సుగంధ ద్రవ్యాల వ్యాపారం నుంచి నేటి గ్లోబల్ లీడర్ల వరకు భాగ్యనగరం ప్రపంచానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా, అడోబ్ సీఈవో శంతను నారాయణ్ వంటి గ్లోబల్ లీడర్లను అందించిన ఘనత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌దేనని కొనియాడారు.

దేశ ఆర్థిక పురోగతికి బాటలు వేసిన దివంగత ప్రధానులు రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావుల సేవలను స్మరించుకుంటూ.. దేశ సంస్కరణలకు ప్రతిరూపంగా నిలిచిన తెలంగాణ గడ్డ ఎప్పుడూ పెట్టుబడులకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. రాజకీయ సిద్ధాంతాలు వేరైనా గత 30 ఏళ్లుగా హైదరాబాద్ అభివృద్ధికి పాలకులు అందించిన నిరంతర మద్దతును ఆయన శ్లాఘించారు.

పోటీ దేశీయ నగరాలతో కాదు.. న్యూయార్క్, లండన్‌లతోనే!

హైదరాబాద్ లక్ష్యం చిన్నది కాదని సీఎం తేల్చిచెప్పారు. "హైదరాబాద్ దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలతో పోటీ పడటం లేదు. న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి అంతర్జాతీయ నగరాలతోనే మన పోటీ" అని కుండబద్దలు కొట్టారు. వ్యాపారవేత్తల ఎదుగుదలలో ప్రభుత్వం ఒక అడ్డంకిలా ఉండకూడదని, అనవసర జోక్యాలను తగ్గించి రెడ్ కార్పెట్ పరిచి అవకాశాలను విస్తరించడమే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.

లక్ష్యం 3 ట్రిలియన్ డాలర్లు.. కేంద్రం నుంచి ఫుల్ సపోర్ట్

‘వికసిత్ భారత్ 2047’లో తెలంగాణ కీలక పాత్ర పోషించనుందని రేవంత్ రెడ్డి తెలిపారు. "2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారితే, అందులో తెలంగాణ వాటా కనీసం 10 శాతం (3 ట్రిలియన్ డాలర్లు) ఉండేలా 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేశాం. మధ్యంతరంగా 2034 నాటికే 1 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరుకుంటాం" అని వివరించారు.

కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై పెట్టుబడిదారులకున్న అనుమానాలను నివృత్తి చేస్తూ.. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు. దేశంలో తలపెట్టిన 7 హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లలో 3 కారిడార్లు (హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–పుణె) మన నగరానికే దక్కాయని, వీటికితోడు వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు, రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని సీఎం స్పష్టం చేశారు.

Advertisement
Advertisement