ChatGPT | డేంజరస్ ఏఐ.. వైద్య సలహాతో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
ChatGPT | అమెరికాలోని సియాటెల్‌లో 31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బోవెన్ వాన్ మూర్ఛ వ్యాధికి వాడుతున్న మందులను వైద్యులకు చెప్పకుండా తగ్గించుకునేలా చాట్‌జీపీటీ సూచించిందని న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. ఆమె మరణం నేపథ్యంలో తల్లిదండ్రులు ఓపెన్‌ఏఐపై దావా వేశారు. వైద్య లైసెన్స్ లేకుండానే చాట్‌బాట్ వైద్య సలహాలు ఇచ్చిందని వారు ఆరోపించారు.
Technology | Published On Oct 29, 2026, 12.16 pm IST
ChatGPT | అమెరికాలోని సియాటెల్‌లో 31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బోవెన్ వాన్ మూర్ఛ వ్యాధికి వాడుతున్న మందులను వైద్యులకు చెప్పకుండా తగ్గించుకునేలా చాట్‌జీపీటీ సూచించిందని న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. ఆమె మరణం నేపథ్యంలో తల్లిదండ్రులు ఓపెన్‌ఏఐపై దావా వేశారు. వైద్య లైసెన్స్ లేకుండానే చాట్‌బాట్ వైద్య సలహాలు ఇచ్చిందని వారు ఆరోపించారు.
అసలేం జరిగింది..?
పదేళ్లకు పైగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న బోవెన్ వాన్ ఫిబ్రవరి 14న తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించింది. వైద్య నివేదిక ప్రకారం.. మూర్ఛ వ్యాధి ఉన్నవారిలో సంభవించే ఆకస్మిక అనూహ్య మరణం (సడన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ డెత్ ఇన్ ఎపిలెప్సీ) ఆమె మృతికి కారణం. ఆమె తండ్రి కున్ వాన్ తర్వాత కుమార్తె చాట్‌జీపీటీ అప్లికేషన్‌ను పరిశీలించగా, ఆమె వాడుతున్న లామోట్రిజిన్ మందుల మోతాదును కొన్ని వారాల్లో 400 మిల్లీగ్రాముల నుంచి పూర్తిగా సున్నాకు తగ్గించే ప్రణాళికలు కనిపించాయని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ మెడిసిన్ రీజినల్ ఎపిలెప్సీ సెంటర్‌కు చెందిన న్యూరాలజిస్ట్ నికోలస్ పూలస్, ఆమె వైద్య చరిత్రను పరిగణనలోకి తీసుకుంటే మందుల మోతాదును తగ్గించే ఆలోచనే చేసేవాడిని కాదని, అలా చేయడం వైద్య నిర్లక్ష్యమని పేర్కొన్నారు.
ఏఐ ఏమని సమాధానాలు చెప్పింది..?
2021లో అమెజాన్‌లో పనిచేస్తున్న సమయంలో బోవెన్‌కు మూర్ఛలు తిరిగి రావడంతో వైద్య సెలవు తీసుకుంది. ఒంటరితనానికి గురైన ఆమె 2023 నుంచి చాట్‌జీపీటీని ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభించింది. 2025 నాటికి వారానికి సగటున 1,500కు పైగా సందేశాలు పంపుతూ, తల్లిదండ్రులతో మాట్లాడడం కూడా తగ్గించింది. మందుల దుష్ప్రభావాల గురించి అడిగినప్పుడు, మొదట వైద్యుడికి సందేశం రాసేందుకు చాట్‌బాట్ సహాయం చేసింది. అనంతరం వైద్యుడికి చెప్పకుండా స్వయంగా ట్యాబ్లెట్ల మోతాదును తగ్గించుకోవాలని సూచించడంతోపాటు, ట్యాబ్లెట్లను కట్ చేసే పరికరాన్ని కొనుగోలు చేయాలని చెప్పినట్లు చాట్‌రికార్డులు వెల్లడించాయి. ఆమె ట్యాబ్లెట్లను నాలుగు భాగాలుగా కట్ చేసి వాడడం ప్రారంభించింది. వైద్యుడికి ఈ విషయం చెప్పకుండా ఉండడాన్ని చాట్‌బాట్ సమర్థించినట్లు, మోతాదు తగ్గింపు సమయంలో గందరగోళం, స్పృహ కోల్పోయే పరిస్థితులు ఎదురైనప్పటికీ మెదడు మార్పులకు అలవాటు పడుతోందని చెప్పినట్లు కథనం పేర్కొంది. ఈ పరిణామాలపై ఆమె కనీసం 158 సార్లు ఆందోళన వ్యక్తం చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ చాట్‌రికార్డులను విశ్లేషించి తెలిపింది.
అత్యవసర స్థితిలో ఏఐ ఎలా స్పందించింది..?
2025 నవంబర్‌లో ఉద్యోగం నుంచి తొలగించనున్నట్లు అమెజాన్ బోవెన్‌కు సమాచారం ఇచ్చింది. అమెరికాలో శాశ్వత నివాస అనుమతి దరఖాస్తును కొనసాగించాలంటే ఫిబ్రవరి మధ్య నాటికి ఉద్యోగం అవసరమైంది. మందుల వల్ల తన ఆంగ్ల భాషా నైపుణ్యం మందగిస్తోందని భావించిన ఆమె, 2026 జనవరిలో మోతాదును 300 మిల్లీగ్రాములకు, ఆపై 200 మిల్లీగ్రాములకు తగ్గించుకోవచ్చా అని చాట్‌బాట్‌ను అడిగింది. ఈ ప్రణాళిక సమంజసమేనని చాట్‌బాట్ చెప్పినట్లు దావాలో పేర్కొన్నారు. ఫిబ్రవరి ప్రారంభంలో తండ్రితో ఫోన్‌లో మాట్లాడుతుండగా ఆమె కొన్ని నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయింది. మందుల మోతాదు తగ్గించిన తర్వాత కూడా గందరగోళం, స్పృహలో అంతరాయాలు, నిద్ర సమస్యలు ఎదురయ్యాయి. చివరి సంభాషణల్లో లక్షణాలు తగ్గేందుకు మళ్లీ మందులు తీసుకోవాలా అని అడిగినా, మోతాదును సున్నా వద్దే కొనసాగించాలని చాట్‌బాట్ సూచించినట్లు కథనం తెలిపింది.
ఓపెన్ఏఐ స్పందన ఏమిటి..?
ఫిబ్రవరి 11 రాత్రి 11 గంటల తర్వాత ఆమె చివరి సందేశం పంపింది. కుమార్తెను సంప్రదించలేకపోయిన చైనాలోని తల్లిదండ్రులు అమెరికాలోని ఓ పరిచయస్తుడి ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం స్నేహితులు ఆమె అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి స్పందనలేని స్థితిలో గుర్తించారు. ఈ ఘటనపై ఓపెన్‌ఏఐ ప్రతినిధి డ్రూ పుసటెరి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఈ ఘటనలో అప్పటి పాత జీపీటీ-4ఓ మోడల్‌ను ఉపయోగించిందని, అది ప్రస్తుతం అందుబాటులో లేదని తెలిపారు. అత్యవసర వైద్య సహాయం అవసరమైన సందర్భాలను గుర్తించడంలో కొత్త మోడళ్లు మెరుగుపడ్డాయని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది.
తాజావార్తలు
- ●Eatala Rajender | నిధులు తెచ్చే బాధ్యత నాది.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపండి: ఎంపీ ఈటల రాజేందర్
- ●Naseeruddin Shah | నసీరుద్దీన్ షా ప్రమాదకరమైన, విధ్వంసకర అర్బన్ నక్సల్ : కిరణ్ రిజుజు
- ●Konda Surekha | కేటీఆర్‌ను నొప్పించి ఉంటే చింతిస్తున్నా.. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా: మాజీ మంత్రి కొండా సురేఖ
- ●YouTube | యూట్యూబ్, గూగుల్ సెర్చ్ సేవల్లో అంతరాయం.. వినియోగదారులకు ఇబ్బందులు..
- ●Gold And Silver Prices Today | ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటన ఎఫెక్ట్.. పతనమైన బంగారం, వెండి ధరలు..
- ●Crocodile | పంట పొలంలో మొసలి.. పరుగులు పెట్టిన రైతన్నలు

Eatala Rajender | నిధులు తెచ్చే బాధ్యత నాది.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపండి: ఎంపీ ఈటల రాజేందర్

Naseeruddin Shah | నసీరుద్దీన్ షా ప్రమాదకరమైన, విధ్వంసకర అర్బన్ నక్సల్ : కిరణ్ రిజుజు

Konda Surekha | కేటీఆర్‌ను నొప్పించి ఉంటే చింతిస్తున్నా.. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా: మాజీ మంత్రి కొండా సురేఖ

YouTube | యూట్యూబ్, గూగుల్ సెర్చ్ సేవల్లో అంతరాయం.. వినియోగదారులకు ఇబ్బందులు..






