త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CRPF | జవాన్ల రక్షణకు స్వదేశీ కవచం!

CRPF | దేశ భద్రతా బలగాల సురక్షిత ప్రయాణానికి మరో కీలక ముందడుగు పడింది. బుల్లెట్‌ కాల్పులు, బాంబు పేలుళ్ల ముప్పును తట్టుకునేలా దేశంలోనే తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 28 సీట్ల ఆర్మర్డ్‌ ట్రూప్‌ ట్రాన్స్‌పోర్టర్‌ (ATT) బస్సును అశోక్‌ లేలాండ్‌ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది.

P

National | Published On Nov 22, 2026, 10.24 am IST

CRPF | జవాన్ల రక్షణకు స్వదేశీ కవచం!
Advertisement
  • దేశంలోనే తొలి 28 సీట్ల బుల్లెట్, బ్లాస్ట్ ప్రూఫ్ బస్‌ సిద్ధం
  • అశోక్ లేలాండ్‌–సీఆర్‌పీఎఫ్‌ సంయుక్త సహకారంతో రూపకల్పన..
  • మల్లవల్లి ప్లాంట్‌లో ప్రారంభం.. 124 బస్సులకు ఆర్డర్‌

CRPF | దేశ భద్రతా బలగాల సురక్షిత ప్రయాణానికి మరో కీలక ముందడుగు పడింది. బుల్లెట్‌ కాల్పులు, బాంబు పేలుళ్ల ముప్పును తట్టుకునేలా దేశంలోనే తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 28 సీట్ల ఆర్మర్డ్‌ ట్రూప్‌ ట్రాన్స్‌పోర్టర్‌ (ATT) బస్సును అశోక్‌ లేలాండ్‌ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (CRPF) సహకారంతో అభివృద్ధి చేసిన ఈ అత్యాధునిక వాహనాన్ని విజయవాడ సమీపంలోని మల్లవల్లి ప్లాంట్‌లో ప్రారంభించారు. 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా సిబ్బంది ప్రయాణానికి మరింత పటిష్టమైన రక్షణ కల్పించాలనే లక్ష్యంతో వీటిని రూపొందించారు.

పుల్వామా దాడితో..

2019 ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు భీకర దాడికి పాల్పడ్డారు. పేలుడు పదార్థాలతో నింపిన కారుతో కాన్వాయ్‌లోని జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును ఢీకొట్టడంతో జరిగిన భారీ పేలుడులో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భద్రతా బలగాల రవాణా సమయంలో ఎదురయ్యే ముప్పును తీవ్రంగా చాటిచెప్పింది. దీంతో ముఖ్యంగా ఉగ్రవాద ప్రభావిత, సున్నితమైన ప్రాంతాల్లో బలగాలను తరలించే వాహనాలకు పటిష్టమైన రక్షణ కల్పించాల్సిన అవసరం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో సాధారణ బస్సులకు బదులుగా బుల్లెట్‌ కాల్పులు, బాంబు పేలుళ్లను తట్టుకునే సామర్థ్యం కలిగిన ఆర్మర్డ్‌ వాహనాల వినియోగంపై దృష్టి సారించారు.

చుట్టూ పటిష్టమైన రక్షణ కవచం

ఈ బస్సులో ప్రయాణించే 28 మంది సిబ్బంది భద్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రత్యేక రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వాహనం చుట్టూ పూర్తిస్థాయి ఆర్మర్‌ కవచాన్ని అమర్చారు. భూమి కింద బాంబు పేలినప్పుడు ఆ ప్రభావం నేరుగా బస్సు లోపలికి చేరకుండా, పేలుడు ఒత్తిడిని పక్కలకు మళ్లించేలా బస్సు అడుగు భాగాన్ని ప్రత్యేక వీ ఆకారంలో రూపొందించారు. దీంతో భూగర్భంలో అమర్చిన పేలుడు పరికరాల వల్ల కలిగే ముప్పును తగ్గించేలా రక్షణ ఏర్పాట్లు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో లోపలి నుంచే ప్రతిస్పందించేందుకు ప్రత్యేక ఫైరింగ్‌ పోర్టులను కూడా ఏర్పాటు చేశారు.

టైర్లు దెబ్బతిన్నా ముందుకే..

దాడుల సమయంలో టైర్లు దెబ్బతిన్నప్పటికీ వాహనం కదిలేలా రన్‌ఫ్లాట్‌ టైర్లను అమర్చారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఆధునిక ఎయిర్‌ కండిషనింగ్‌ వ్యవస్థను అందించారు. బస్సు చుట్టూ పరిసరాలను నిరంతరం పర్యవేక్షించేందుకు నిఘా కెమెరాలతోపాటు, 360 డిగ్రీల కోణంలో పనిచేసే రూఫ్‌ టర్రెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ వాహనం కేవలం బలగాల రవాణాకే పరిమితం కాకుండా.. అవసరాన్ని బట్టి మొబైల్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌గా కూడా వినియోగించుకునేలా రూపొందించారు. డ్రోన్లు, మానవరహిత గ్రౌండ్‌ వెహికల్స్‌ (UGVs)తో అనుసంధానమై కార్యకలాపాల సమన్వయానికి ఉపయోగపడే సాంకేతిక సామర్థ్యాలు ఇందులో ఉన్నాయి.

124 బస్సుల తయారీకి ఆర్డర్‌

అశోక్‌ లేలాండ్‌ సంస్థకు మొత్తం 124 ఆర్మర్డ్‌ ట్రూప్‌ ట్రాన్స్‌పోర్టర్‌ బస్సుల తయారీకి ఆర్డర్‌ లభించింది. వీటిలో 109 వాహనాలను సీఆర్‌పీఎఫ్‌కు, మరో 15 వాహనాలను బీఎస్‌ఎఫ్‌కు కేటాయించనున్నారు. మణిపూర్‌, జమ్మూకశ్మీర్‌ వంటి సున్నితమైన ప్రాంతాల్లో విధులు నిర్వహించే భద్రతా బలగాల రవాణాకు వీటిని వినియోగించనున్నారు. ముఖ్యంగా అధిక ముప్పు ఉన్న జమ్మూకశ్మీర్‌ కాన్వాయ్‌ మార్గాల్లో సాధారణ రక్షణ లేని బస్సుల స్థానంలో ఈ ఆర్మర్డ్‌ వాహనాలను వినియోగించాలనే లక్ష్యంతో ఈ చర్య చేపట్టారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ బస్సులు భద్రతా బలగాల రవాణాలో రక్షణ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, సున్నితమైన ప్రాంతాల్లో విధుల నిర్వహణకు అదనపు భరోసా కల్పించనున్నాయి.

Advertisement
Advertisement