RAC | ప్రయాణికులకు షాక్ ఇవ్వబోతున్న రైల్వే.. త్వరలో ఆర్‌ఏసీ టికెట్లకు మంగళం..?
RAC | రైల్వే ప్రయాణికులకు కీలకమైన ఆర్‌ఏసీ (RAC–Reservation Against Cancellation) టికెటింగ్ విధానానికి త్వరలోనే స్వస్తి పలకనున్నారా? రైల్వే శాఖలో ప్రస్తుతం ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. టికెట్ తనిఖీ ప్రక్రియలో డిజిటల్ సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఆర్‌ఏసీ విధానం అవసరం తగ్గిపోయిందని కొందరు సీనియర్ రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఏసీ విధానాన్ని రద్దు చేసే అంశాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
- డిజిటల్ టికెట్ చెకింగ్ వ్యవస్థతో మారనున్న రైల్వే రిజర్వేషన్ విధానం..
- ఆర్‌ఏసీ అవసరం లేదంటున్న సీనియర్ అధికారులు..
- పూర్తి బెర్త్ రాకున్నా పూర్తి ఛార్జీ వసూలుపై అభ్యంతరాలు
RAC | రైల్వే ప్రయాణికులకు కీలకమైన ఆర్‌ఏసీ (RAC–Reservation Against Cancellation) టికెటింగ్ విధానానికి త్వరలోనే స్వస్తి పలకనున్నారా? రైల్వే శాఖలో ప్రస్తుతం ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. టికెట్ తనిఖీ ప్రక్రియలో డిజిటల్ సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఆర్‌ఏసీ విధానం అవసరం తగ్గిపోయిందని కొందరు సీనియర్ రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఏసీ విధానాన్ని రద్దు చేసే అంశాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
1984లో ఆర్‌ఏసీ విధానం అమలులోకి..
రైల్వే ప్రయాణాల్లో వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో 1983-84లో అప్పటి రైల్వే మంత్రి ఏబీఏ ఘనీ ఖాన్ చౌదరి ఆర్‌ఏసీ విధానాన్ని ప్రవేశపెట్టారు. 1984 రైల్వే బడ్జెట్ సందర్భంగా ఈ ప్రతిపాదనను ప్రకటించారు. కన్ఫర్మ్ టికెట్ తీసుకున్న ప్రయాణికులు ప్రయాణానికి హాజరుకాకపోతే ఖాళీ అయ్యే బెర్తులను వెయిటింగ్ లిస్ట్‌లో ముందున్న వారికి కేటాయించడం దీని ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం ప్రతి కోచ్‌లో కొన్ని బెర్తులను ప్రత్యేకంగా కేటాయించారు. అప్పట్లో రిజర్వేషన్, టికెట్ తనిఖీ వ్యవస్థలు పూర్తిస్థాయిలో డిజిటల్ వ్యవస్థతో అనుసంధానం కాకపోవడంతో ఈ విధానం ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడింది. బెర్తుల కేటాయింపులో రైల్వే సిబ్బంది ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయడంలోనూ ఆర్‌ఏసీ కీలక పాత్ర పోషించింది.
2016లో బెర్తుల సంఖ్య పెంపు
ఆర్‌ఏసీ ప్రయాణికులకు మరింత అవకాశం కల్పించేందుకు 2016లో రైల్వే శాఖ బెర్తుల కేటాయింపును పెంచింది. గతంలో స్లీపర్ కోచ్‌లో ఐదు సైడ్ లోయర్ బెర్తులను ఆర్‌ఏసీకి కేటాయించేవారు. దీంతో 10 మంది ప్రయాణికులకు అవకాశం ఉండేది. ఈ సంఖ్యను ఏడు బెర్తులకు పెంచడంతో 14 మందికి ప్రయోజనం చేకూరింది. అలాగే థర్డ్ ఏసీలో గతంలో రెండు సైడ్ లోయర్ బెర్తులు ఉండగా.. నాలుగుకు పెంచారు. దీంతో నలుగురికి బదులుగా ఎనిమిది మందికి అవకాశం లభించింది. ఇక సెకండ్ ఏసీలో రెండు బెర్తుల నుంచి మూడుకు పెంచారు. దీంతో నలుగురికి బదులుగా ఆరుగురు ప్రయాణించేందుకు వీలు కలిగింది.
ఇక ఆర్‌ఏసీకి అవసరం లేదా?
ప్రస్తుతం రైల్వే టికెట్ తనిఖీ వ్యవస్థలో కీలక మార్పులు వచ్చాయి. టికెట్ చెకింగ్ సిబ్బంది (టీటీఈ) చేతిలో ఉండే హ్యాండ్‌హెల్డ్ టెర్మినల్ (HHT) రైల్వే రిజర్వేషన్ వ్యవస్థతో అనుసంధానమై ఉంటుంది. కన్ఫర్మ్ టికెట్ ఉన్న ప్రయాణికుడు రాకపోతే టీటీఈ వెంటనే ఆ వివరాలను సిస్టమ్‌లో 'నో టర్న్-అప్'గా నమోదు చేస్తారు. దీంతో ఆ బెర్తు తర్వాతి స్టేషన్ నుంచి ప్రయాణించే వారికి కరెంట్ బుకింగ్ ద్వారా కేటాయించే అవకాశం ఉంటుంది. గతంలో మాదిరిగా ఖాళీ బెర్తుల కోసం ఆర్‌ఏసీ విధానంపై ఆధారపడాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాదు.. ఆర్‌ఏసీ విధానాన్ని తొలగిస్తే బెర్తుల కేటాయింపులో టీటీఈల విచక్షణాధికారం తగ్గుతుందని, అక్రమాలకు అవకాశం కూడా పరిమితమవుతుందని అభిప్రాయం. ప్రతి ప్రయాణికుడి టికెట్‌ను సకాలంలో తనిఖీ చేసి, ప్రయాణానికి రాని వారి వివరాలను వెంటనే అప్‌డేట్ చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.
రైల్వేకు ఆర్థిక నష్టం ఉండదా?
2015లో టికెట్ రద్దు నిబంధనల్లో చేసిన మార్పులు కూడా ఆర్‌ఏసీ అవసరం తగ్గడానికి మరో కారణమని అధికారులు వివరిస్తున్నారు. కన్ఫర్మ్ టికెట్ ఉన్న ప్రయాణికుడు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రయాణానికి హాజరుకాకపోతే ప్రస్తుతం చెల్లించిన మొత్తం ఛార్జీని కోల్పోతారు. ఎలాంటి రీఫండ్ లభించదు. అంటే ప్రయాణికుడు రాకపోయినా రైల్వే శాఖకు టికెట్ రూపంలో ఇప్పటికే ఆదాయం సమకూరినట్లే. అదే బెర్తును తద్వాతి స్టేషన్ నుంచే వచ్చే మరో ప్రయాణికుడికి పూర్తి ఛార్జీతో కేటాయించొచ్చు. దీంతో బెర్తు ఖాళీగా ఉన్నా రైల్వేకు ఆర్థిక నష్టం ఉండదని అధికారులు వాదిస్తున్నారు. మరో ప్రయాణికుడికి కూడా ఆ బెర్తు అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.
ఆర్‌ఏసీ ప్రయాణికులకు రీఫండ్ ఇవ్వాలని..
మరోవైపు, ఆర్‌ఏసీ టికెట్‌పై ప్రయాణించే వారికి ఎదురవుతున్న ఇబ్బందులపైనా చర్చ జరుగుతోంది. ఇద్దరు ప్రయాణికులకు ఒకే బెర్తును కేటాయిస్తున్నప్పటికీ.. ఇద్దరి నుంచి పూర్తి టికెట్ ఛార్జీ వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైన తర్వాత కూడా ఆర్‌ఏసీ స్థితిలోనే ఉండి, పూర్తి బెర్తు పొందని ప్రయాణికులకు పూర్తి ఛార్జీ వసూలు చేయడం సమంజసం కాదని పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అభిప్రాయపడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 4న లోక్‌సభలో ప్రవేశపెట్టిన నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించింది. పూర్తి బెర్తు పొందని ఆర్‌ఏసీ ప్రయాణికులకు కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించే విధానాన్ని రూపొందించాలని రైల్వే మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. అయితే, ఆన్‌లైన్‌లో ఈ-టికెట్లు బుక్ చేసుకునే వారితో పాటు రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్లు తీసుకునే వారికి కూడా వర్తించేలా పాక్షిక రీఫండ్ విధానాన్ని రూపొందించడం క్లిష్టమైన ప్రక్రియ అని అధికారులు చెబుతున్నారు.
వందే భారత్ స్లీపర్‌లో ఆర్ఏసీ లేదు..
ఇదిలా ఉండగా, వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఇప్పటికే ఆర్‌ఏసీ విధానం అందుబాటులో లేదు. ఈ రైళ్ల టికెట్ ధరలు అదే మార్గాల్లో నడిచే ఇతర రైళ్లతో పోలిస్తే 30 శాతం నుంచి 95 శాతం వరకు అధికంగా ఉన్నాయి. డిజిటల్ టికెట్ తనిఖీ వ్యవస్థ, ఖాళీ బెర్తుల తక్షణ కేటాయింపు, ఆర్‌ఏసీ ప్రయాణికులకు పూర్తి ఛార్జీ వసూలుపై వస్తున్న అభ్యంతరాలు ఈ విధానంపై పునరాలోచనకు కారణం. అయితే, ఆర్‌ఏసీని రద్దు చేస్తూ రైల్వే శాఖ అధికారికంగా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. గత నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ విధానం కొనసాగుతుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Santosh Kumar | కీసర రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎంపీ సంతోష్ కుమార్
- ●Hyderabad | హైదరాబాద్‌లో హైఅలర్ట్.. ఎక్కడికక్కడ తనిఖీలు
- ●MLA Rajasingh | హైదరాబాద్‌లో ఉగ్రదాడి బెదిరింపు.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
- ●Chicken | ఆ కోడికి మూడు కాళ్లు.. ఆసక్తిగా తిలకించిన జనాలు
- ●Bisleri | బిస్లరీ వాటర్ సురక్షితం కాదు.. తేల్చిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
- ●Road Accident | తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం.. 8 మంది మృత్యువాత

Santosh Kumar | కీసర రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎంపీ సంతోష్ కుమార్

Hyderabad | హైదరాబాద్‌లో హైఅలర్ట్.. ఎక్కడికక్కడ తనిఖీలు

MLA Rajasingh | హైదరాబాద్‌లో ఉగ్రదాడి బెదిరింపు.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

Chicken | ఆ కోడికి మూడు కాళ్లు.. ఆసక్తిగా తిలకించిన జనాలు






