త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PVNRTVU | వెటర్నరీ వర్సిటీలో 117 అధ్యాపక పోస్టులు.. సర్కార్ గ్రీన్‌సిగ్నల్‌!

PVNRTVU | రాష్ట్రంలోని పశువైద్య విద్యా రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో (PVNRTVU) దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది.

P

Telangana | Published On Nov 22, 2026, 7.35 pm IST

PVNRTVU | వెటర్నరీ వర్సిటీలో 117 అధ్యాపక పోస్టులు.. సర్కార్ గ్రీన్‌సిగ్నల్‌!
Advertisement
  • అసిస్టెంట్ ప్రొఫెసర్లు 67.. అసోసియేట్ ప్రొఫెసర్లు 50
  • ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్‌ జారీకి కసరత్తు
  • మరో 108 రెగ్యులర్ పోస్టుల భర్తీకి త్వరలో ప్రత్యేక ప్రకటన

PVNRTVU | రాష్ట్రంలోని పశువైద్య విద్యా రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో (PVNRTVU) దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. తొలి విడతలో 117 బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో 67 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, 50 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఉన్నాయి. ఈ నియామకాలకు సంబంధించి నవంబర్‌ నెలాఖరులోగా సమగ్ర నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు విశ్వవిద్యాలయ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతితో వెటర్నరీ విద్యలో బోధనా రంగాన్ని ఎంచుకోవాలనుకునే అర్హులైన అభ్యర్థులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

రెండు కేటగిరీల్లో నియామకాలు

ప్రభుత్వం ఆమోదించిన 117 పోస్టుల్లో అత్యధికంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 67 ఉండగా, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఖాళీలు 50 ఉన్నాయి. ఈ నియామక ప్రక్రియను యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ), భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టనున్నారు. అభ్యర్థుల ఎంపికలో రాత పరీక్షతోపాటు మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) నిర్వహించనున్నారు. అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, రోస్టర్‌ విధానం, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు.

225 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు

విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల కొరతను అధిగమించేందుకు యాజమాన్యం గతంలోనే చర్యలు చేపట్టింది. దీర్ఘకాలంగా భర్తీ కాకుండా ఉన్న 117 బ్యాక్‌లాగ్‌ పోస్టులతోపాటు గత రెండేళ్లలో వివిధ కారణాలతో ఖాళీ అయిన మరో 108 రెగ్యులర్‌ పోస్టులను కూడా భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 225 పోస్టుల భర్తీకి వర్సిటీ పాలక మండలి (బోర్డ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిలో తొలి విడతగా 117 బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి తాజాగా అనుమతి లభించింది. మిగిలిన 108 రెగ్యులర్‌ పోస్టులకు సంబంధించి త్వరలోనే మరో ప్రత్యేక నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు

117 పోస్టుల నియామక ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెలాఖరులోగా విడుదల చేయాలని విశ్వవిద్యాలయం భావిస్తోంది. ప్రకటన వెలువడిన తర్వాత పోస్టుల వారీగా విద్యార్హతలు, అనుభవం, వయోపరిమితి, రిజర్వేషన్లు, ఎంపిక విధానం, ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు వంటి వివరాలు స్పష్టంగా తెలియనున్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచిస్తున్నారు. ఈ నియామకాలు పూర్తయితే వెటర్నరీ కళాశాలల్లో అధ్యాపకుల కొరత కొంతమేర తీరడంతోపాటు బోధన, పరిశోధన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉందని వర్సిటీ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement
Advertisement