త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Biotechnology | అంతరిక్షంలో ఔషధాల తయారీకి భారత్‌ సన్నాహాలు!

Biotechnology | అంతరిక్ష రంగంలో సాధిస్తున్న పురోగతిని వైద్య, ఔషధ పరిశోధనలకు అనుసంధానించాలని భారత్‌ భావిస్తోంది. అంతరిక్షంలోని ప్రత్యేక పరిస్థితులను వినియోగించుకుని సరికొత్త ఔషధాల అభివృద్ధికి మార్గాలు అన్వేషిస్తోంది. ముఖ్యంగా గురుత్వాకర్షణ ప్రభావం తక్కువగా ఉండే మైక్రోగ్రావిటీ వాతావరణంలో ప్రొటీన్లపై పరిశోధనలు నిర్వహించడం ద్వారా మెరుగైన ఔషధాల తయారీకి అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

P

Science | Published On Nov 22, 2026, 6.38 pm IST

Biotechnology | అంతరిక్షంలో ఔషధాల తయారీకి భారత్‌ సన్నాహాలు!
Advertisement
  • మైక్రోగ్రావిటీతో సరికొత్త ఔషధాల ఆవిష్కరణకు అవకాశాలు
  • బయోటెక్‌ పరిశోధనలకు అంతరిక్ష ప్రయోగశాలలు
  • 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు లక్ష్యం

Biotechnology | అంతరిక్ష రంగంలో సాధిస్తున్న పురోగతిని వైద్య, ఔషధ పరిశోధనలకు అనుసంధానించాలని భారత్‌ భావిస్తోంది. అంతరిక్షంలోని ప్రత్యేక పరిస్థితులను వినియోగించుకుని సరికొత్త ఔషధాల అభివృద్ధికి మార్గాలు అన్వేషిస్తోంది. ముఖ్యంగా గురుత్వాకర్షణ ప్రభావం తక్కువగా ఉండే మైక్రోగ్రావిటీ వాతావరణంలో ప్రొటీన్లపై పరిశోధనలు నిర్వహించడం ద్వారా మెరుగైన ఔషధాల తయారీకి అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అంశంపై ఇటీవల బెంగళూరులో ముగిసిన టెక్‌ సమ్మిట్‌లో విస్తృతంగా చర్చ జరిగింది. బయోటెక్నాలజీ సంస్థలు, పరిశోధకులు, స్టార్టప్‌లు, విధాన నిర్ణేతలు అంతరిక్ష ఆధారిత ఔషధ పరిశోధనల భవిష్యత్తుపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఛానల్‌ న్యూస్‌ ఏషియా నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.

మైక్రోగ్రావిటీతో కొత్త అవకాశాలు

భూమిపై గురుత్వాకర్షణ ప్రభావం కారణంగా ప్రొటీన్ల స్ఫటికాల (ప్రొటీన్‌ క్రిస్టల్స్‌) నిర్మాణం, పెరుగుదలపై కొన్ని పరిమితులు ఉంటాయి. అయితే అంతరిక్షంలోని మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో వస్తువులు దాదాపు బరువులేనట్లుగా ప్రవర్తిస్తాయి. ఈ వాతావరణంలో కొన్ని రకాల ప్రొటీన్‌ స్ఫటికాలు మరింత క్రమబద్ధంగా, ఏకరీతిలో పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో వాటి అంతర్గత నిర్మాణాన్ని శాస్త్రవేత్తలు మరింత స్పష్టంగా అధ్యయనం చేయగలుగుతారు. ప్రొటీన్ల నిర్మాణంపై లభించే మెరుగైన సమాచారం ఔషధాల రూపకల్పనలో కీలకంగా మారనుంది. వాటి పనితీరును అర్థం చేసుకోవడంతోపాటు మందుల ఫార్ములేషన్లను మెరుగుపరిచేందుకు, కొత్త చికిత్సా విధానాలను అభివృద్ధి చేసేందుకు ఈ పరిశోధనలు దోహదపడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో అంతరిక్షంలోనే కొన్ని ఔషధాలను తయారు చేయడం, పరీక్షించడం వంటి అవకాశాలపైనా పరిశోధనలు సాగుతున్నాయి.

ఫార్మా రంగానికి అంతరిక్ష సాంకేతికత తోడు

ప్రపంచానికి తక్కువ ధరల్లో నాణ్యమైన మందులు, టీకాలను అందిస్తున్న భారత్‌ ఇప్పటికే ‘ఫార్మసీ ఆఫ్‌ ది వరల్డ్‌’గా గుర్తింపు పొందింది. బయోఫార్మాస్యూటికల్‌ తయారీలో ఉన్న ఈ బలాన్ని అంతరిక్ష పరిశోధనలతో అనుసంధానించడం ద్వారా ఔషధ రంగంలో మరో ముందడుగు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ కలయికతో కొత్త అణువులు, మెరుగైన ఔషధ సమ్మేళనాలు, వినూత్న చికిత్సా విధానాలకు మార్గం సుగమం కావచ్చని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రముఖ బయోఫార్మా సంస్థ బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా కూడా ఈ రంగంలో విస్తృత అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అంతరిక్ష సాంకేతికత సాయంతో అణు నిర్మాణాల్లో మార్పులు చేయడం ద్వారా కొత్త మాలిక్యూల్స్‌ను అభివృద్ధి చేయవచ్చని, తద్వారా కొత్త మేధో సంపత్తి హక్కులు (ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ), వినూత్న ఔషధ పదార్థాలు, మెరుగైన పనితీరు కలిగిన సమ్మేళనాలను రూపొందించే వీలుంటుందని వివరించారు.

భారతీయ అంతరిక్ష కేంద్రంపై ఆశలు

ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనల్లో వాణిజ్య సంస్థల భాగస్వామ్యం పెరుగుతోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)ను 2030 ప్రాంతంలో ఉపసంహరించే అవకాశాలు ఉండటంతో పలు దేశాలు, ప్రైవేటు సంస్థలు వాణిజ్య అంతరిక్ష ప్రయోగశాలల ఏర్పాటుపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో భారత్‌ కూడా ఈ రంగంలో తనదైన స్థానం సంపాదించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. భారత్‌ ప్రతిపాదించిన ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’ (బీఏఎస్‌) 2035 నాటికి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాలన్నది లక్ష్యం. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ స్థాయి బయోటెక్నాలజీ, ఔషధ పరిశోధనలకు కీలక వేదికగా మారుతుందని నిపుణులు ఆశిస్తున్నారు. వివిధ దేశాల శాస్త్రవేత్తలు, ఔషధ పరిశ్రమలు కలిసి ప్రయోగాలు నిర్వహించేందుకు ఇది ఉపయోగపడనుంది.

కేంద్రం అందుబాటులోకి రాకముందే ప్రయోగాలు

బెంగళూరు టెక్‌ సమ్మిట్‌లో నిర్వహించిన స్పేస్‌ బయో సింపోజియంలో నిపుణులు కీలక అంశాలను చర్చించారు. భారతీయ అంతరిక్ష కేంద్రం భవిష్యత్తులో ఔషధ, బయోటెక్నాలజీ పరిశోధనలకు ఎలా ఉపయోగపడుతుందన్న దానిపై అభిప్రాయాలు వెల్లడించారు. అయితే 2035 వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. శాశ్వత అంతరిక్ష కేంద్రం అందుబాటులోకి రాకముందే ప్రస్తుత అంతరిక్ష మిషన్లు, అందుబాటులో ఉన్న పరిశోధనా వేదికల ద్వారా మైక్రోగ్రావిటీ ప్రయోగాలను ప్రారంభించవచ్చని సూచిస్తున్నారు. అంతరిక్ష రంగంలో భారత్‌ సాధిస్తున్న పురోగతి రాకెట్లు, ఉపగ్రహాలకే పరిమితం కాకుండా వైద్య, ఔషధ రంగాల్లోనూ కొత్త అవకాశాలను సృష్టించే దిశగా సాగుతోంది. అంతరిక్షంలో జరిగే పరిశోధనలు భవిష్యత్తులో మెరుగైన మందులు, వినూత్న చికిత్సల అభివృద్ధికి ఎంతవరకు దోహదపడతాయన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement