త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramanujan Prize | భారతీయ యువ గణిత శాస్త్రవేత్తకు రామానుజన్ ప్రైజ్

Ramanujan Prize | భారతీయ యువ గణిత శాస్త్రవేత్త (Indian mathematician) మహేశ్ కాక్డే (Mahesh Kakde)ను రామానుజన్ ప్రైజ్ (Ramanujan Prize) వరించింది. నంబర్ థియరీలో విశేష కృషి చేసినందుకు గానూ ఆయ‌న‌కు ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.

D

National | Published On Oct 7, 2026, 3.39 pm IST

Ramanujan Prize | భారతీయ యువ గణిత శాస్త్రవేత్తకు రామానుజన్ ప్రైజ్
Advertisement

Ramanujan Prize | త్రినేత్ర న్యూస్ : భారతీయ యువ గణిత శాస్త్రవేత్త (Indian mathematician) మహేశ్ కాక్డే (Mahesh Kakde)ను రామానుజన్ ప్రైజ్ (Ramanujan Prize) వరించింది. నంబర్ థియరీలో విశేష కృషి చేసినందుకు గానూ ఆయ‌న‌కు ఈ ప్రతిష్టాత్మక 2026 రామానుజన్ ప్రైజ్ ఫర్ యంగ్ మేథమెటిషియన్స్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీస్ అవార్డు దక్కింది. ఏటా అభివృద్ధి చెందుతున్న‌ దేశాల్లో ప‌నిచేస్తూ అత్యుత్త‌మ ప‌రిశోధ‌న‌లు చేస్తున్న 45 ఏళ్లలోపు గ‌ణిత శాస్త్ర‌వేత్త‌ల‌కు ఈ పుర‌స్కారాన్ని అంద‌జేస్తారు. ఈ అవార్డును ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియోరిటికల్ ఫిజిక్స్ (ICTP), ఇంటర్నేషనల్ మేథమెటికల్ యూనియన్ (IMU) సంయుక్తంగా ప్రదానం చేస్తాయి.

ప్రస్తుతం మహేశ్ కాక్డే బెంగళూరు ఐఐఎస్‌సీలో గ‌ణిత‌శాస్త్ర‌ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆల్జీబ్రిక్ నంబర్ థియరీ (number theory)పై పరిశోధనలు సాగిస్తున్నారు. సంఖ్యల గుణాలను అధ్యయనం చేయడాన్ని నంబర్ థియరీ అంటారు. సంఖ్యల‌ మ‌ధ్య ఉండే సంబంధాలు, వాటి వెనుక దాగి ఉన్న నిర్మాణాలను అర్థం చేసుకోవడానికి ఆల్జీబ్రిక్ నెంబర్ థియరీ ఎంత‌గానో సహాయపడుతుంది. కాక్డే ప్ర‌ధానంగా ఇవసావా థియరీపై చేసిన ప‌రిశోధ‌న‌ల‌కు గారూ ఈ అంత‌ర్జాతీయ గుర్తింపు ల‌భించింది. అంతేకాదు ఆయ‌న గ్రాస్-స్టార్క్ (Gross-Stark), బ్రూమర్-స్టార్క్ (Brumer-Stark) వంటి సుదీర్ఘ‌కాలంగా ప‌రిష్కారం కాని గ‌ణిత ప్ర‌తిపాద‌న‌ల‌కు సైతం ప‌రిష్కారాల‌ను క‌నుగొన్నారు. కాక్డే ప‌రిశోధ‌న‌లు జ‌ర్మ‌న్ గ‌ణిత శాస్త్ర‌వేత్త డేవిడ్ హిల్బ‌ర్ట్ 1900లో ప్రతిపాదించిన ప్రసిద్ధ 23 సమస్యల్లో ఒక‌టైన హిల్బర్ట్ 12వ సమస్య పరిష్కారానికి ఎంతో దోహదపడుతున్నాయి.

మ‌హేష్ కాక్డే 1983లో మహారాష్ట్రలోని అకోలాలో జన్మించారు. బెంగళూరులోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ISI) నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ ప‌ట్టా పొందారు. ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం, యూనివ‌ర్సిటీ కాలేజ్ లండ‌న్ వంటి ప్ర‌ముఖ సంస్థ‌ల్లో ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. 2019లో IIScలో ప్రొఫెసర్‌గా చేరారు. గ‌ణిత రంగంలో ఆయ‌న చేసిన విశేష కృషికి గానూ 2022లో ఇన్ఫోసిస్ ప్రైజ్ (Infosys Prize) అందుకున్నారు. అలాగే 2023లో 'ఆసియన్ సైంటిస్ట్ 100' జాబితాలో కూడా చోటు సంపాదించుకున్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గణిత రంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచే యువ శాస్త్రవేత్తలను అభినందించేందుకు ప్రముఖ భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జ్ఞాపకార్థం ఈ రామానుజన్ బహుమతి (Ramanujan Prize) అందిస్తారు. 2005 నుంచి ఏటా యువ శాస్త్ర‌వేత్త‌ల‌ను గుర్తించి ఈ బ‌హుమ‌తిని ప్ర‌దానం చేస్తున్నారు. విజేత‌కు పురస్కారంతో పాటు 10,000 అమెరికన్ డాలర్లు నగదు కూడా అందుతుంది.

Also Read..

ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సంద‌ర్శించ‌డానికి కోహ్లీ రూ.5 కోట్లు తీసుకున్నారా..? క్లారిటీ ఇచ్చిన విరాట్ టీమ్‌

ధ‌నుష్ పొలిటిక‌ల్ ఎంట్రీకి రంగం సిద్ధం.. ఈసీ వ‌ద్ద పార్టీ పేరు రిజిస్ట‌ర్‌..?

రెండోసారి త‌ల్లికాబోతున్న స్టార్ న‌టి

Advertisement
Advertisement