త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fake High Court Orders India | షాకింగ్ రిపోర్ట్: నకిలీ హైకోర్టు ఆర్డర్లతో 129 బెట్టింగ్ వెబ్‌సైట్లు బ్లాక్

హైకోర్టుల పేరిట వచ్చిన నకిలీ తీర్పులతో కేంద్ర ప్రభుత్వం 129 బెట్టింగ్ వెబ్‌సైట్లను బ్లాక్ చేసినట్లు రాయిటర్స్ సంచలన కథనంలో వెల్లడైంది.

J

National | Published On Nov 11, 2026, 5.30 pm IST

Fake High Court Orders India | షాకింగ్ రిపోర్ట్: నకిలీ హైకోర్టు ఆర్డర్లతో 129 బెట్టింగ్ వెబ్‌సైట్లు బ్లాక్

సంక్షిప్త సారాంశం

రాజస్థాన్, అలహాబాద్ హైకోర్టుల పేరిట వచ్చిన తప్పుడు ఆదేశాల ఆధారంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) 129 బెట్టింగ్ సైట్లను దేశంలో బ్యాన్ చేసింది. ఆ రెండు హైకోర్టుల అధికారిక వెబ్‌సైట్లలోగానీ, రికార్డుల్లోగానీ అలాంటి ఆర్డర్లే లేవని రాయిటర్స్ ఇన్వెస్టిగేషన్‌లో తేలడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. కోర్టు అధికారిక బ్లూ సీల్, జడ్జి నకిలీ సంతకం, స్కాన్ చేస్తే ఓ రాండమ్ పేజీ తెరిచే ఫేక్ క్యూఆర్ (QR) కోడ్‌లతో ఈ మోసానికి పాల్పడ్డారు. అలహాబాద్ హైకోర్టు ఫిర్యాదు మేరకు ఫోర్జరీ, మోసం కింద యూపీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
  • నకిలీ హైకోర్టు ఆర్డర్లు
  • రాయిటర్స్ పరిశోధనతో గుట్టురట్టు
  • సీల్స్, జడ్జి సంతకాలు, క్యూఆర్ కోడ్లు
  • సైబర్ క్రైమ్ పోలీసుల ఎఫ్ఐఆర్

Fake High Court Orders India | త్రినేత్ర న్యూస్ : దేశంలో చట్టవిరుద్ధంగా నడుస్తున్న బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్లపై నిఘా పెట్టిన కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం ఒక ఊహించని సైబర్ మోసానికి గురైంది. రెండు రాష్ట్రాల హైకోర్టుల పేరిట వచ్చిన 'నకిలీ కోర్టు తీర్పుల’ (Fake Court Orders) ఆధారంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) ఏకంగా 129 బెట్టింగ్ వెబ్‌సైట్లను దేశవ్యాప్తంగా బ్లాక్ చేసినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ 'రాయిటర్స్' (Reuters) తాజా పరిశోధనాత్మక కథనంలో వెల్లడించింది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో అలహాబాద్ హైకోర్టు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అసలేం జరిగింది?

ఈ ఏడాది జూలై 21, సెప్టెంబర్ 2 తేదీల్లో కేంద్ర టెలికాం శాఖ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు (ISPs) రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. జూలైలో 34 వెబ్‌సైట్లను, సెప్టెంబర్‌లో మరో 95 బెట్టింగ్ సైట్లను వెంటనే బ్లాక్ చేయాలని ఆదేశించింది. వీటికి రాజస్థాన్, అలహాబాద్ హైకోర్టుల నుంచి ఈ-మెయిల్ ద్వారా వచ్చినట్లుగా ఉన్న తీర్పుల పత్రాలను కూడా జతచేసింది. నిబంధనల ప్రకారం దేశ భద్రత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వీటిని తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు.

కోర్టుల రికార్డుల్లో అసలు ఆ కేసులే లేవు

రాయిటర్స్ ఈ ఆర్డర్ల వివరాలను పరిశీలించగా, రెండు హైకోర్టుల అధికారిక రికార్డుల్లోనూ ఆ కేసు నంబర్లు నమోదు కాలేదని గుర్తించింది. రాజస్థాన్ హైకోర్టు రిజిస్ట్రార్‌ను వివరణ కోరగా, తమ కోర్టు పేరుతో చలామణి అయిన ఆ ఆర్డర్ పూర్తిగా నకిలీదని, సర్వర్‌లో అలాంటి రికార్డే లేదని ధ్రువీకరించారు.

మరోవైపు, అలహాబాద్ హైకోర్టు పేరుతో వచ్చిన ఆర్డర్‌లో మరింత పకడ్బందీగా మోసం చేశారు. జస్టిస్ గరిమా ప్రసాద్ పేరుతో సంతకం చేసి, కోర్టు ఎంబ్లమ్‌తో పాటు ఒక క్యూఆర్ కోడ్‌ను కూడా ముద్రించారు. అయితే, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఒక సాధారణ వెబ్‌పేజీ తెరుచుకుంటోంది. దీనిపై జస్టిస్ గరిమా ప్రసాద్ కార్యాలయం స్పందిస్తూ.. తాము అలాంటి ఉత్తర్వులేవీ ఇవ్వలేదని స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు నవంబర్ 6న గుర్తుతెలియని వ్యక్తులపై యూపీ సైబర్ క్రైమ్ పోలీసులు ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదు చేశారు.

వ్యవస్థల లోపమా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగమా?

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన కంటెంట్ రిమూవల్ నిబంధనలు కలిగిన భారత ప్రభుత్వ వ్యవస్థలోకి ఇలాంటి నకిలీ తీర్పులు ఎలా చొరబడ్డాయనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. బెట్టింగ్ సైట్ల వ్యాపారంలో ఉన్న అంతర్గత పోటీ వల్ల ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ఇలా చేశారా? లేక ఏఐ (AI) టెక్నాలజీని ఉపయోగించి పత్రాలను ఫోర్జరీ చేశారా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. న్యాయవ్యవస్థ పేరుతో వ్యవస్థలను తప్పుదోవ పట్టించే ఇలాంటి చర్యలు ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement