త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

పెళ్లి వయసు లేకున్నా సహజీవనం చేయొచ్చు.. హైకోర్టు సంచలన తీర్పు

J

National | Published On Dec 5, 2025, 11.03 am IST

పెళ్లి వయసు లేకున్నా సహజీవనం చేయొచ్చు.. హైకోర్టు సంచలన తీర్పు
Advertisement

సాధారణంగా మన దేశంలో పెళ్లి చేసుకోవాలంటే ఒక ఏజ్ రావాలి. పురుషులకు అయితే 21 ఏళ్లు, మహిళలకు 18 సంవత్సరాలు వస్తే చాలు. చట్టబద్ధంగా వాళ్లు పెళ్లి చేసుకోవచ్చు. కానీ.. మన దేశంలో ఓటు వేయడానికి, మేజర్ కావడానికి నిర్దేశించిన వయసు 18 మాత్రమే. మహిళలు, పురుషులు ఎవరైనా మేజర్ అని చెప్పడానికి 18 ఏళ్లు నిండాలి. పెళ్లికి మాత్రం మగవాళ్లకు మరో 3 ఏళ్ల పొడిగింపు ఇచ్చారు.

పెళ్లి చేసుకోవడానికి పురుషుడికి 21 ఏళ్లు రావాలి కానీ.. మేజర్ అయ్యాక వాళ్లు ఎవరినైనా ఇష్టపడటం అనేది తప్పు కాదు. ఒక్కసారి మేజర్ అయ్యాక వాళ్లకంటూ ఉన్న ప్రాథమిక హక్కులను పాటించకుండా ఎవ్వరూ ఆపలేరు.. అంటూ తాజాగా రాజస్థాన్ కోర్టు ఓ సంచలన తీర్పు చెప్పింది.

18 ఏళ్లు నిండిన స్త్రీ, పురుషులు సహజీవనం చేయడానికి పెళ్లి వయసు ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇద్దరు మేజర్లు అయితే చాలు.. వాళ్లు తమ ఇష్టపూర్వకంగా కలిసి జీవించాలని అనుకుంటే అది వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు అవుతుంది. ఆ హక్కును ఎవరు కాదనగలరు.. అంటూ న్యాయస్థానం వెల్లడించింది.

రాష్ట్రంలోని కోటాకు చెందిన 19 ఏళ్ల యువకుడు, 18 ఏళ్ల యువతి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోలేదు కానీ సహజీవనం చేస్తున్నారు. యువతి తల్లిదండ్రులు వాళ్ల సహజీవనానికి అడ్డు చెప్పడంతో వాళ్ల నుంచి తమకు ప్రాణహాని ఉందని హైకోర్టుకెక్కింది ఆ జంట.

విచారణలో భాగంగా ప్రభుత్వం తరుపు న్యాయవాది వాళ్ల సహజీవనానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. పురుషులకు చట్టబద్ధమైన వివాహ వయసు 21 ఏళ్లు ఉండాలని, కానీ ఈ కేసులో యువకుడికి 19 ఏళ్లే ఉన్నాయి కాబట్టి పెళ్లి చేసుకోవడానికి అర్హత లేని ఈ యువకుడిని సహజీవనం చేయడానికి కూడా అనుమతించకూడదు అని వాదించడంతో కోర్టు ఆ న్యాయవాది వాదనలను తోసిపుచ్చింది.

ఈ కేసును విచారించిన జస్టిస్ అనూప్ ధాండ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టం ప్రకారం పెళ్లి వయసు నిండలేదన్న ఒకే ఒక్క కారణంతో పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయలేమన్నారు. భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి జీవించే హక్కుతో పాటు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందన్నారు. 18 ఏళ్లు నిండిన ఏ మేజర్ అయినా ఎవరితో కలిసి జీవించాలనేది వాళ్ల వ్యక్తిగత నిర్ణయమన్నారు. సహజీవనం చేయడం నేరం కాదు కాబట్టి పెళ్లి వయసుతో సంబంధం లేకుండా వాళ్లకు వ్యక్తిగత రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. ఆ జంటకు రక్షణ కల్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement