త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

V Srinivas Goud | ఓబీసీ కుల గణన చేయ‌కుంటే ఢిల్లీని దిగ్బంధిస్తాం

V Srinivas Goud | ఓబీసీ కుల గ‌ణ‌న చేయ‌కుంటే దేశవ్యాప్తంగా ల‌క్ష‌లాది మందితో ఢిల్లీని దిగ్బంధిస్తామ‌ని మాజీ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ హెచ్చ‌రించారు. అన్ని ఓబీసీ సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి త‌మ పోరాటాన్ని ఉదృతం చేస్తామ‌న్నారు.

S

National | Published On Oct 4, 2026, 5.56 pm IST

V Srinivas Goud | ఓబీసీ కుల గణన చేయ‌కుంటే ఢిల్లీని దిగ్బంధిస్తాం
Advertisement
  • దేశవ్యాప్తంగా ఓబీసీ సంఘాల‌ను ఏకం చేస్తాం
  • ల‌క్నో ఓబీసీ జాతీయ స‌దస్సులో మాజీ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్

V Srinivas Goud | త్రినేత్ర న్యూస్‌: ఓబీసీ కుల గ‌ణ‌న చేయ‌కుంటే దేశవ్యాప్తంగా ల‌క్ష‌లాది మందితో ఢిల్లీని దిగ్బంధిస్తామ‌ని మాజీ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ హెచ్చ‌రించారు. అన్ని ఓబీసీ సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి త‌మ పోరాటాన్ని ఉదృతం చేస్తామ‌న్నారు. దేశంలో సుమారు 80 కోట్ల జనాభా ఉన్న ఓబీసీలకు విద్య, ఉద్యోగాలు, ప్రమోషన్లు, చట్టసభల్లో తగిన రిజర్వేషన్లు కల్పించినప్పుడే సామాజిక సమానత్వం సాధ్యమవుతుందన్నారు. ఓబీసీల రిజర్వేషన్ల సాధనకు మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలకు బీసీల మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కస్తూర్బా ఆడిటోరియంలో జాతి జనగణన సంఘర్ష్ సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఓబీసీ జాతీయ సదస్సులో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు.

దేశవ్యాప్తంగా జనగణనలో ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ ను కేటాయించి ఓబీసీ కులగణన నిర్వహించాలి. దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీ సంఘాలు, నాయకులను ఐక్యం చేసి ఒకే తాటిపైకి తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకునిరావాలి. ప్రతి రాష్ట్రంలో పర్యటిస్తూ ఓబీసీ సంఘాలను సంఘటితం చేసి దశలవారీగా ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించాలి. చివరకు లక్షలాది మందితో దేశ రాజధాని ఢిల్లీని దిగ్బంధించే స్థాయిలో ఉద్యమాన్ని చేపట్టాలని సదస్సులో తీర్మానం చేశాం.

ఇప్పుడు సాధించుకోకపోతే మళ్లీ అవకాశం రాదు. ఓబీసీ కులగణనను కచ్చితంగా సాధించుకుని తీరాలి. జన గణనలో ఓబీసీల జనాభాకు సంబంధించిన కచ్చితమైన గణాంకాలు లేకపోవడం వల్ల బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు కోర్టుల్లో నిలబడటం లేదు.

ఈ స‌ద‌స్సులో ఇండియన్ నేషనల్ లీగ్ అధ్యక్షులు ప్రొఫెసర్ మహమ్మద్ సులేమాన్, మాజీ ఎంపీ ప్రొఫెసర్ డా.రామ్ బక్షిసింగ్ వర్మ, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సూరజ్ యాదవ్ మండల్, డాక్టర్ ఈశ్వర్ ధ్యాన్, ఉమేష్ కోర్రం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement