త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Sridhar Babu | తెలంగాణ పాడి రైతుల‌కు మ‌రింత ఊతం

Minister Sridhar Babu | మెదక్ జిల్లా తూప్రాన్‌లోని ఊర్జా ఇండస్ట్రియల్ పార్క్‌లో సాబర్ (అమూల్)డెయిరీ మెగా ఇంటిగ్రేటెడ్ డెయిరీ ప్లాంట్‌కు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

S

Telangana | Published On Oct 4, 2026, 4.42 pm IST

Minister Sridhar Babu | తెలంగాణ పాడి రైతుల‌కు మ‌రింత ఊతం
Advertisement

ఊర్జా ఇండ‌స్ట్రియ‌ల్ పార్కులో సాబ‌ర్ డెయిరీకి భూమి పూజ
పాల్గొన్న ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీధ‌ర్ బాబు

Minister Sridhar Babu | త్రినేత్ర న్యూస్ : మెదక్ జిల్లా తూప్రాన్‌లోని ఊర్జా ఇండస్ట్రియల్ పార్క్‌లో సాబర్ (అమూల్)డెయిరీ మెగా ఇంటిగ్రేటెడ్ డెయిరీ ప్లాంట్‌కు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణలో డెయిరీ ప్రాసెసింగ్ రంగానికి ఈ ప్రాజెక్టు కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. సుమారు రూ.400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్‌లో ప్రారంభ దశలో రోజుకు 5 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉంటుందని చెప్పారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా సుమారు 350 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, పాల సేకరణతో పాటు డెయిరీ అనుబంధ విలువ గొలుసు ద్వారా దాదాపు 10 వేల మంది పాడి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి వివరించారు. సాబర్ డెయిరీ 2015లో తెలంగాణలో పాల కార్యకలాపాలను ప్రారంభించిందని, ప్రస్తుతం రాష్ట్రంలోని పాడి రైతుల నుంచి రోజుకు లక్ష లీటర్లకు పైగా పాలను సేకరిస్తోందని తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా పాలు, పెరుగు, పనీర్, ఐస్‌క్రీమ్, లస్సీ, నెయ్యి, మజ్జిగతో పాటు బేకరీ ఉత్పత్తులను తయారు చేయనున్న‌ట్లు పేర్కొన్నారు. దీంతో రైతులు ఉత్పత్తి చేసే పాలకు మరింత విలువ జోడించి, వారికి మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని అన్నారు. తెలంగాణలో పెద్ద సంఖ్యలో పాడి రైతులు, పాల ఉత్పత్తి చేసే కుటుంబాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. రైతులు, వ్యవస్థీకృత పాల సేకరణ, ఆధునిక ప్రాసెసింగ్ వ్యవస్థ, వినియోగదారుల మధ్య అనుసంధానాన్ని ఈ ప్రాజెక్టు మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు.

‘ఇన్వెస్ట్ తెలంగాణ’, ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యాల నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతోందనడానికి ఈ ప్రాజెక్టు నిదర్శనమని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. సహకార డెయిరీ విధానంలో వినియోగదారుడు చెల్లించే మొత్తంలో గణనీయమైన వాటా పాల ఉత్పత్తిదారుడికి చేరుతుందని తెలిపారు. అమూల్ రైతు కేంద్రీత మోడల్‌లో వినియోగదారుడు ఖర్చు చేసే ప్రతి రూపాయిలో సుమారు 80 శాతం వరకు పాల ఉత్పత్తిదారులకు చేరుతుందని చెప్పారు. ఈ విధానం రైతుల ఆదాయాన్ని, మొత్తం డెయిరీ రంగాన్ని మరింత బలోపేతం చేయగలదని అన్నారు.

ముఖ్యంగా పనీర్ వంటి నాణ్యమైన డెయిరీ ఉత్పత్తులు వినియోగదారులకు అందుబాటులోకి రావడం ప్రయోజనకరమని మంత్రి తెలిపారు. నాన్-డెయిరీ పనీర్‌కు సంబంధించి ఆందోళనలు ఉన్న నేపథ్యంలో, విశ్వసనీయమైన సహకార సంస్థ నుంచి నాణ్యమైన అసలైన డెయిరీ ఉత్పత్తులు అందుబాటులోకి రావడం వినియోగదారుల నమ్మకాన్ని పెంచుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు కేవలం పాల ప్రాసెసింగ్ ప్లాంట్ మాత్రమే కాదని, పాలు సేకరణ నుంచి రవాణా, ప్రాసెసింగ్, కోల్డ్‌చెయిన్, ప్యాకేజింగ్, పంపిణీ, రిటైల్, అనుబంధ సేవల వరకు పూర్తి స్థాయి డెయిరీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసే అవకాశం ఉందని శ్రీధర్‌బాబు తెలిపారు.

‘సహకార్ సే సమృద్ధి’, ‘వైట్ రివల్యూషన్ 2.0’లో భాగంగా డెయిరీ సహకార వ్యవస్థలను బలోపేతం చేయడం, రైతులకు మార్కెట్ అవకాశాలను విస్తరించడం, పాల ఉత్పత్తిదారులకు మరిన్ని అవకాశాలు కల్పించడం కీలకమని చెప్పారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, గ్రామీణ ఉపాధి, రైతు ఆధారిత విలువ గొలుసులను బలోపేతం చేసే పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సహకరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణను ఈ విస్తరణకు వేదికగా ఎంచుకున్న సాబర్ డెయిరీ, అమూల్ సంస్థలకు శ్రీధర్‌బాబు అభినందనలు తెలిపారు. పాడి రైతుల అభివృద్ధి, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తుల అందుబాటు, ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టుబడులకు తెలంగాణను మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.

Advertisement
Advertisement