త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amit Shah | మూడోసారి అధికారంలోకి వ‌స్తే యూసీసీ

Amit Shah | ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలు చేస్తామని ప్రకటించారు. లక్నోలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు.

P

National | Published On Oct 30, 2026, 2.51 pm IST

Amit Shah | మూడోసారి అధికారంలోకి వ‌స్తే యూసీసీ
Advertisement
  • అక్టోబ‌ర్ 30 యూపీ చ‌రిత్ర‌లో కీల‌క‌మైన రోజు
  • ఇదే రోజున అయోధ్య‌లో రామ‌భ‌క్తుల‌పై కాల్పులు
  • ప్ర‌తిప‌క్షాల‌పై హోంమంత్రి అమిత్‌ షా విమ‌ర్శ‌లు

Amit Shah | ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలు చేస్తామని ప్రకటించారు. లక్నోలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. అక్టోబర్‌ 30వ తేదీ యూపీ చరిత్రలో కీలకమైన రోజని అమిత్‌ షా పేర్కొన్నారు. 1990లో ఇదే రోజున అయోధ్యలో రామభక్తులపై కాల్పులు జరిగాయని గుర్తుచేశారు. ‘రామభక్తులపై కాల్పులు జరిపిన మీరు ఏ ముఖం పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు? మీరు కాల్పులు జరిపితే.. మేం రామమందిరం నిర్మించాం. ప్రజలు మిమ్మల్ని మూడో తరంతో సహా క్షమించరు’ అంటూ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. కల్యాణ్‌ సింగ్‌ ప్రభుత్వం గురించి ఆలోచించకుండా వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేశారని పేర్కొన్నారు.

అంగ‌దుడి పాదంలా స్థిరంగా..

యూపీలో బీజేపీ ప్రభుత్వం అంగదుడి పాదంలా స్థిరంగా ఉందని, దాన్ని ఎవరూ కదిలించలేరని అన్నారు. ఎస్పీ, కాంగ్రెస్‌ పార్టీలు మ్యాచ్‌లో ఓడిపోయి ఓటు చోరీ అంటూ అంపైర్‌పై ఆరోపణలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో చర్చకు బీజేపీ సిద్ధంగా ఉందని, ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినా ప్రతి అంశానికి సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. యోగి ఆదిత్యనాథ్‌ పాలనపై అమిత్‌ షా ప్రశంసలు కురిపించారు. కఠిన పాలనతో రాష్ట్రాన్ని మాఫియాల నుంచి విముక్తి చేసినందుకు యోగిని అభినందించారు. 2027 ఎన్నికలకు కార్యకర్తలంతా ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అర్జునుడిలా లక్ష్యంపై దృష్టి పెట్టి మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలన్నారు. 2014లో యూపీలో బీజేపీకి కేవలం 44 మంది ఎమ్మెల్యేలే ఉన్నారని, నిరాశాజనక పరిస్థితుల్లోనూ పార్టీని బలోపేతం చేశానని గుర్తుచేశారు. సంస్థాగతంగా పార్టీ బలపడటంతో 2014 లోక్‌సభ ఎన్నికల్లో 41 శాతం ఓట్లతో 73 స్థానాలు గెలుచుకున్నామని చెప్పారు. 2016లో నోట్ల రద్దు సమయంలో అఖిలేశ్‌ యాదవ్‌కు రాత్రంతా నిద్రపట్టలేదని వ్యాఖ్యానించారు. అనంతరం 40 శాతం ఓట్లతో 312 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్నామని తెలిపారు.

మూడోసారి అధికారమే లక్ష్యం

2027 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా లక్నోలోని డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు పంకజ్‌ చౌధరి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఉప ముఖ్యమంత్రులు బ్రజేశ్‌ పాఠక్‌, కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, పార్టీ నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. స్వాగతోపన్యాసం చేసిన పంకజ్‌ చౌధరి.. ఇది సాధారణ సమావేశం కాదని, పార్టీ సంస్థాగత బలాన్ని సమీక్షించి, భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించే కీలక భేటీగా పేర్కొన్నారు. 2027 ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీజేపీని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. మూడు విడతల్లో జరగనున్న సమావేశంలో రాజకీయ తీర్మానం, ఎన్నికల సన్నద్ధత, సంస్థాగత కార్యక్రమాలపై చర్చించనున్నారు. బలహీనంగా ఉన్న ప్రాంతాలు, బూత్‌లపై ప్రత్యేక దృష్టి సారించి పార్టీ బలోపేతానికి వ్యూహాలు రూపొందించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, సుపరిపాలన, ప్రజాసేవ, పేదల సంక్షేమ కార్యక్రమాలను రాజకీయ తీర్మానంలో ప్రస్తావించనున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు ఎన్నికల దిశానిర్దేశం చేయడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం.

ట్యాగ్స్:

Amit ShahAyodhya Ram MandirBjp PartyOctober 30Telugu NewsUCCUttar Pradesh
Advertisement
Advertisement