నార్త్ గోవాలో ఉన్న బిర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 25 మంది ప్రాణాలను పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ఈ విషాద ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే క్లబ్ ఓనర్స్ దేశం విడిచి థాయ్‌లాండ్ పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ కేసులో నిందితులుగా ఉన్న క్లబ్ ఓనర్స్ అయిన ఇద్దరు అన్నదమ్ములు గౌరవ్ లుత్రా, సౌరభ్ లుత్రా ఇద్దరూ ఆదివారం ఉదయం 5.30 కు ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు విమానంలో వెళ్లిపోయారు. ఘటన జరిగిన తర్వాత పోలీసులు ఈ క్లబ్ ఓనర్స్‌పై కేసు నమోదు చేసి ఢిల్లీలో ఉన్న వీళ్ల నివాసానికి వెళ్తే అక్కడ లేరు. దీంతో వీరిపై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేయాలని ఇమిగ్రేషన్ బ్యూరోను కోరారు. అప్పటికే వాళ్లు దేశం విడిచి వెళ్లిపోయినట్టుగా విచారణలో తేలింది. ఘటన జరిగిన తర్వాత పోలీసులు తమపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని విచారిస్తారని అందుకే దేశం విడిచి వెళ్లిపోవాలని భావించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇతర నిందితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న ఓనర్స్‌ను అరెస్ట్ చేయడానికి సీబీఐ, ఇంటర్‌పోల్ అధికారులతో గోవా పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. క్లబ్‌కు సరైన డాక్యుమెంట్స్ లేకున్నా అనుమతులు జారీ చేసిన అధికారులపైన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిబంధనల ఉల్లంఘనతో మత్స్యశాఖ డైరెక్టర్ షమిలా మాంటెరోను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. క్లబ్ అనుమతులతో సంబంధం ఉన్న ఇతర అధికారులను కూడా పోలీసులు విచారిస్తున్నారు.