MLC Kavitha | త్రినేత్ర.న్యూస్ : పోరాటాల పురిటిగడ్డ కరీంనగర్‌లో తెలంగాణ ఉద్యమకారులతో కలిసి జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత భూ పోరాటానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎక్కడికక్కడ భూములను ఆక్రమించుకోవాలని ఉద్యమకారులకు కవిత పిలుపునిచ్చారు. మనం కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది.. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇస్తామన్న 250 గజాల స్థలం వెంటనే ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో కవిత పాల్గొని ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్లీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కరీంనగర్ గడ్డ మీద ఏ పోరాటం చేసిన అది సక్సెస్ అవుతుంది. ఇవాళ మనం ఉద్యమకారుల కోసం చేస్తున్న భూపోరాటం కూడా సక్సెస్ అవుతుంది. ఒక్క కరీంనగర్‌లో మాత్రమే కాదు.. అన్ని జిల్లాల్లో ప్రభుత్వం ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల భూమి ఇచ్చే వరకు పోరాటం చేస్తాం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విలువైన భూములు ఉంటాయి. కానీ అక్కడ కూడా వదలం. ప్రభుత్వం అక్కడ భూములు అమ్ముకోవాలని చూస్తోంది. కానీ ఉద్యమకారుల పోరాటం, చెమట ద్వారానే తెలంగాణ వచ్చింది. మనం కడుపు మాడ్చుకొని కొట్లాడితే తెలంగాణ వచ్చింది. ఎవరో కొట్లాడితే రాలేదు అని కవిత పేర్కొన్నారు. మనం బతుకమ్మ, బోనం ఎత్తినం.. మనం బతుకమ్మ, బోనం ఎత్తినం, వంట వార్పు అంటూ ఉద్యమాలు చేశాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనకు నష్టం జరిగితే ఓపిక పట్టాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల ద్వారా లబ్ధి పొందేందుకు వారికి ఎన్నో హామీలు ఇచ్చింది. పెన్షన్, సంక్షేమ బోర్డు, 250 గజాల జాగ ఇస్తామని మాట ఇచ్చింది. కానీ కనీసం ఉద్యమకారులను గౌరవించి వారికి శాలువాతో సన్మానం కూడా చేయలేదు అని కవిత ధ్వజమెత్తారు. మా వాటా ఇవ్వమని మాత్రమే మనం కోరుతున్నాం.. అమరవీరుల కుటుంబాలకు ఎంతో చేస్తామని మనం చెప్పాం. 12 వందల మంది అమరులైతే మనం 540 మందికి మాత్రమే మేలు చేశాం. ఎంతో మంది అమరవీరుల కుటుంబాల వారు వచ్చి వారి బాధలు నాకు చెప్పారు. జూన్ 2, ఆగస్ట్ 15, జనవరి 26 న ఇలా ఏ రోజు కూడా వారిని గౌరవించలేదు. ఇప్పుడు ఉద్యకారులంతా ఫోరంగా ఏర్పడి ఒక దగ్గరకు వచ్చారు. ఇక మన ఐక్యతను ప్రదర్శిద్దాం. తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మగౌరవంతో పాటు మా వాటా ఇవ్వమని మాత్రమే మనం కోరుతున్నాం. ఇస్తామన్న పెన్షన్, సంక్షేమ బోర్డు, 250 గజాల స్థలం మాత్రమే అడుగుతున్నాం. 12 ఏళ్లలో ఎంతో మంది ఉద్యకారులు చనిపోయారు. హాస్పిటల్‌లో చేరితే వారికి సాయం కూడా చేయలేదు. నిజంగా ఉద్యమకారుల కుటుంబాలు ఎంతో దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారని కవిత తెలిపారు. కమిటీలు జాన్తా నయ్.. తెలంగాణ వ్యతిరేకులు ఉద్యమ పార్టీలోకి వచ్చి మనపైనే పెత్తనం చెలాయిస్తూ కేసులు పెట్టారు. సెక్రటేరియేట్‌కు వెళ్తే మనల్నే ఇక్కడ ఏం పని అంటూ అవమానించారు. ఉద్యమకారులను ఉరికిచ్చి కొడుతామని కూడా బెదిరించారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఉద్యకారులకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు హామీలకు సంబంధించి ఒక్క ప్రకటన లేదు. అప్లికేషన్లు పెట్టుకోమన్నారు అంతే. వారిపై కేసులు లేవు అంటున్నారు. ఉద్యమకారులందరిపై కేసులు ఉంటాయా? తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ఎంతో మంది ఆగమయ్యారు? ఏ ఊరిలోకి, ఏ జిల్లాకు వెళ్లినా సరే అక్కడి ప్రజలు ఉద్యమకారులెవరో చెబుతారు. వాళ్లు చెప్పిన వారికే ప్రభుత్వం ఇస్తామన్న హామీలు నెరవేర్చాలి. ఇప్పుడు మళ్లీ కమిటీలు అంటున్నారు. కమిటీలు జాన్తా నయ్. ఉద్యమకారుల ఫోరం ఇచ్చిన డేటా ప్రకారమే ఉద్యమకారులను గుర్తించండి. ఆ డేటానే సీఎం కార్యాలయం ముందు పెడుదాం అని కవిత పేర్కొన్నారు. ఐదు ఎకరాల భూమి తెచ్చుకోవటం పెద్ద పనా? పోరాటాల ద్వారా తెలంగాణనే తెచ్చుకున్నాం. ఐదు ఎకరాల భూమి తెచ్చుకోవటం పెద్ద పనా? ప్రభుత్వం దిగివచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదు. మేము శాంతియుతంగా పోరాటం చేస్తామని ప్రభుత్వానికి చెబుతున్నా. ఎక్కడికక్కడ భూములను ఆక్రమించుకోవాలని ఉద్యమకారులకు నేను పిలుపునిస్తున్నా. ప్రభుత్వ పెద్దలు దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని కవిత తేల్చిచెప్పారు.