త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Digital Addiction | యువతను మింగేస్తున్న ‘డిజిటల్ వ్యసనం’: కేంద్ర ఆర్థిక సర్వే తీవ్ర హెచ్చరిక

భారతీయ యువత, పిల్లలు తీవ్రమైన 'డిజిటల్ వ్యసనానికి' (Digital Addiction) లోనవుతున్నారని ఆర్థిక సర్వే 2026 ఆందోళన వ్యక్తం చేసింది. అధిక స్క్రీన్ టైమ్ కారణంగా పిల్లల్లో ఏకాగ్రత లోపం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి పెరుగుతున్నాయని, దీనిని అరికట్టేందుకు పాఠశాలల స్థాయి నుంచే చర్యలు తీసుకోవాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలు డిజిటల్ వ్యసనానికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

J

National | Published On Jan 29, 2026, 6.57 pm IST

Digital Addiction | యువతను మింగేస్తున్న ‘డిజిటల్ వ్యసనం’: కేంద్ర ఆర్థిక సర్వే తీవ్ర హెచ్చరిక
Advertisement
  • పిల్లల్లో ముదిరిన డిజిటల్ వ్యసనం
  • మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
  • నిద్రలేమి, డిప్రెషన్, చదువులో వెనుకబాటు
  • స్మార్ట్‌ఫోన్ల వినియోగంపై కేంద్రం ఆందోళన

Digital Addiction | త్రినేత్ర.న్యూస్: డిజిటల్ విప్లవం ఓవైపు అభివృద్ధిని తీసుకొస్తుంటే, మరోవైపు అది యువత భవిష్యత్తుకు సవాలుగా మారుతోంది. నిజానికి డిజిటల్ విప్లవం వల్ల దేశంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. చాలా రంగాలు డిజిటల్ విప్లవాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్తున్న నేపథ్యంలో.. తాజాగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన 'ఎకనామిక్ సర్వే 2025-26' (Economic Survey 2026), భారతీయ యువత, పిల్లలలో పెరుగుతున్న 'డిజిటల్ అడిక్షన్' (Digital Addiction) పై ప్రమాద ఘంటికలు మోగించింది. స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమింగ్ పట్ల మితిమీరిన ఆకర్షణ పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని నివేదిక స్పష్టం చేసింది.

ప్రమాదకర స్థాయిలో స్క్రీన్ టైమ్

సర్వే వెల్లడించిన గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయి. భారతదేశంలో 5 ఏళ్లలోపు పిల్లలు రోజుకు సగటున 2.2 గంటలు మొబైల్ లేదంటే టీవీ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. నిపుణులు సూచించిన లిమిట్‌తో పోలిస్తే ఇది రెండు రెట్లు ఎక్కువ. 15-29 ఏళ్ల యువతలో ఇంటర్నెట్ వినియోగం దాదాపుగా 100 శాతానికి చేరుకుంది. ఇది కేవలం అవసరాలకు మాత్రమే కాకుండా, వ్యసనంగా మారి వారి ఉత్పాదకతను దెబ్బతీస్తోందని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది.

మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

అధిక స్క్రీన్ టైమ్ వల్ల పిల్లలు, యువతలో అనేక దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని సర్వే పేర్కొంది. ఆందోళన (Anxiety), ఒత్తిడి, డిప్రెషన్, ఆత్మన్యూనతా భావం పెరుగుతున్నాయి. అర్ధరాత్రి వరకు ఫోన్లు వాడటం వల్ల నిద్రలేమి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది వారి జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను దెబ్బతీస్తోంది. వర్చువల్ ప్రపంచంలో మునిగిపోవడం వల్ల వాస్తవ ప్రపంచంతో సామాజిక బంధాలు తగ్గిపోతున్నాయి.

Also Read: Ultra-Processed Food | ఆర్థిక సర్వే 2026 హెచ్చరిక: 14 ఏళ్లలో 150 శాతం పెరిగిన జంక్ ఫుడ్ విక్రయాలు – ముంచుకొస్తున్న ఆరోగ్య ముప్పు

గేమింగ్ డిజార్డర్ అండ్ సైబర్ ముప్పు

సోషల్ మీడియాతో పాటు ఆన్‌లైన్ గేమింగ్ కూడా యువతను పట్టిపీడిస్తోంది. దీనిని సర్వే 'గేమింగ్ డిజార్డర్' గా అభివర్ణించింది. ఇది పిల్లల్లో దూకుడు స్వభావాన్ని (Aggression), ఒంటరితనాన్ని పెంచుతోంది. అలాగే, సైబర్ బెదిరింపులు (Cyber bullying), ఆన్‌లైన్ మోసాల బారిన పడే ప్రమాదాన్ని కూడా ఇది పెంచుతోంది.

సర్వే సూచనలు

ఈ సమస్యను పరిష్కరించడానికి తాజా ఆర్థిక సర్వే కొన్ని కీలక సిఫార్సులు చేసింది. సోషల్ మీడియా వినియోగానికి కఠినమైన వయస్సు పరిమితులు (Age-based limits) విధించాలి. పాఠశాలల్లో 'డిజిటల్ వెల్‌నెస్ కరిక్యులమ్' (Digital Wellness Curriculum) ను ప్రవేశపెట్టి, పిల్లలకు ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన కల్పించాలి. ఇళ్లలో, పాఠశాలల్లో మొబైల్స్ వాడకూడని సమయాలను (No-device hours) పాటించాలి. పిల్లలు ఆడుకోవడానికి, సాంఘికంగా కలవడానికి 'ఆఫ్‌లైన్ యూత్ హబ్స్' (Offline Youth Hubs) ఏర్పాటు చేయాలి. మానసిక సమస్యలు ఉన్నవారికి అండగా నిలిచే 'టెలి-మానస్' (Tele-MANAS) వంటి హెల్ప్‌లైన్ సేవలను విస్తరించాలని ఆర్థిక సర్వే సిఫార్సులు చేసింది.

డిజిటల్ సౌకర్యాలు అవసరమే అయినప్పటికీ, అవి మన పిల్లల భవిష్యత్తును నాశనం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఆర్థిక సర్వే హెచ్చరించింది.

Also Read: Economic Survey 2026 | ఎకనామిక్ సర్వే 2026: ‘వికసిత్ భారత్’ వైపు భారత ఆర్థిక వ్యవస్థ.. ఈసారి వృద్ధి రేటు 7.4 శాతం

Advertisement

తాజావార్తలు

Advertisement