త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

X Money | ఎలాన్ మ‌స్క్ ఎక్స్ (X) నుంచి ఇక బ్యాంకింగ్ సేవ‌లు.. ఎక్స్ మ‌నీ లాంచ్‌.. డిజిట‌ల్ బ్యాంకింగ్‌, 6 శాతం వ‌డ్డీ..

X Money | ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X) తన డిజిటల్ పేమెంట్స్, బ్యాంకింగ్ సేవ ఎక్స్ మనీ (X Money)ని అమెరికాలో ఎంపిక చేసిన ప్రీమియం, ప్రీమియం ప్లస్ సబ్‌స్క్రైబర్ల కోసం ప్రారంభించింది. ఈ సేవ ద్వారా న‌గ‌దు బదిలీలు, డైరెక్ట్ డిపాజిట్లు, బిల్లుల చెల్లింపులు, వడ్డీ వచ్చే క్యాష్ అకౌంట్, అలాగే వీసా డెబిట్ కార్డు వంటి సేవలను ఒకే ప్లాట్‌ఫామ్‌లో అందిస్తోంది.

S

Business | Published On Jul 28, 2026, 2.10 pm IST

X Money | ఎలాన్ మ‌స్క్ ఎక్స్ (X) నుంచి ఇక బ్యాంకింగ్ సేవ‌లు.. ఎక్స్ మ‌నీ లాంచ్‌.. డిజిట‌ల్ బ్యాంకింగ్‌, 6 శాతం వ‌డ్డీ..
Advertisement

X Money | ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X) తన డిజిటల్ పేమెంట్స్, బ్యాంకింగ్ సేవ ఎక్స్ మనీ (X Money)ని అమెరికాలో ఎంపిక చేసిన ప్రీమియం, ప్రీమియం ప్లస్ సబ్‌స్క్రైబర్ల కోసం ప్రారంభించింది. ఈ సేవ ద్వారా న‌గ‌దు బదిలీలు, డైరెక్ట్ డిపాజిట్లు, బిల్లుల చెల్లింపులు, వడ్డీ వచ్చే క్యాష్ అకౌంట్, అలాగే వీసా డెబిట్ కార్డు వంటి సేవలను ఒకే ప్లాట్‌ఫామ్‌లో అందిస్తోంది. ఎక్స్ మనీ ద్వారా వినియోగదారులు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా వెంటనే డబ్బు పంపించ‌వచ్చు, స్వీకరించ‌వచ్చు. ఈ సేవలో సాధారణ జీతం వచ్చే తేదీకి రెండు రోజుల ముందుగానే డైరెక్ట్ డిపాజిట్ పొందే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ఇంటి అద్దె చెల్లించడం, వైర్ ట్రాన్స్‌ఫర్లు పంపడం, చెక్కులు మెయిల్ చేయడం, వివిధ బిల్లులు చెల్లించడం వంటి పనులను నేరుగా ఎక్స్ యాప్ లేదా ఎక్స్ వెబ్ సైట్ ద్వారా పూర్తి చేయవచ్చు.

6 శాతం వ‌డ్డీ, వీసా డెబిట్ కార్డు..

ఎక్స్ మనీ ఖాతాలో కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా వడ్డీ లభించే క్యాష్ అకౌంట్‌ను కూడా అందిస్తోంది. ప్రీమియం ప్లస్ సభ్యులకు వారి ఎక్స్ మనీ ఖాతాపై వార్షికంగా 6 శాతం ఏపీవై (APY) వడ్డీ లభిస్తుంది. ప్రీమియం సభ్యులు కూడా నిర్దిష్ట డైరెక్ట్ డిపాజిట్ అర్హతలను పూర్తి చేస్తే ఇదే 6 శాతం ఏపీవై ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. వినియోగదారుల కోసం 24 గంటలు, వారానికి ఏడు రోజుల పాటు ప్రత్యేక కస్టమర్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటుందని ఎక్స్ ప్రకటించింది. ఎక్స్ మనీతో పాటు ఎక్స్ కార్డ్ (X Card) పేరుతో ప్రత్యేక మెటల్ వీసా డెబిట్ కార్డును కూడా కంపెనీ లాంచ్ చేసింది. వీసా అంగీకరించే ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో ఈ కార్డును ఉపయోగించవచ్చు. ఈ కార్డు ద్వారా అర్హత కలిగిన కొనుగోళ్లపై 3 శాతం క్యాష్‌బ్యాక్, ప్రపంచవ్యాప్తంగా ఉచిత ఏటీఎం విత్‌డ్రాయల్స్, విదేశీ లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలు లేకపోవడం, అలాగే అనధికారిక లావాదేవీల నుంచి రక్షణ కల్పించే వీసా జీరో లయబిలిటీ పాలసీ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

పూర్తి స్థాయిలో సెక్యూరిటీ..

భద్రత పరంగా ఎక్స్ మనీ ఖాతాలను పాస్‌కీస్ సాంకేతికతతో రక్షిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వినియోగదారులు తమ అవసరానికి అనుగుణంగా లావాదేవీల పరిమితులు నిర్ణయించుకోవడం, ఎంపిక చేసిన ట్రాన్సాక్షన్లకు అదనపు ధ్రువీకరణను తప్పనిసరి చేయడం వంటి భద్రతా నియంత్రణలను కూడా ఉపయోగించుకోవచ్చు. వీసా భద్రతా వ్యవస్థల ద్వారా కార్డు లావాదేవీలకు అదనపు రక్షణ లభిస్తుంది. ఎక్స్ మనీ లావాదేవీలు డిఫాల్ట్‌గా ప్రైవేట్‌గా ఉంటాయి. అయితే, కావాలనుకుంటే మాత్రమే వినియోగదారులు ఎంపిక చేసిన లావాదేవీలను తమ ఎక్స్ టైమ్‌లైన్‌లో షేర్ చేసుకోవచ్చు. ఎక్స్ భాగస్వామ్య బ్యాంకు ద్వారా ఎక్స్ మనీ ఖాతాల్లోని నిధులకు 2.5 లక్షల డాలర్ల వరకు ఎఫ్‌డీఐసీ (FDIC) బీమా రక్షణ ఉంటుంది. అలాగే క్యాష్ స్వీప్ ప్రోగ్రామ్ ద్వారా అర్హత కలిగిన డిపాజిట్లను పలు భాగస్వామ్య బ్యాంకుల్లో విభజించడం ద్వారా గరిష్ఠంగా 1 కోటి డాలర్ల వరకు ఎఫ్‌డీఐసీ బీమా రక్షణ పొందే అవకాశం ఉంటుంది.

ప్ర‌స్తుతానికి అమెరికాలోనే..

ప్రస్తుతం ఎక్స్ మనీ సేవ అమెరికాలో 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. తాజా వెర్షన్‌కు యాప్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత అర్హులైన వినియోగదారులకు మనీ ట్యాబ్ కనిపిస్తుంది. అక్కడి నుంచి నమోదు ప్రక్రియ పూర్తి చేసి ఈ సేవను ప్రారంభించ‌వచ్చు. భవిష్యత్తులో మరింత మంది వినియోగదారులకు ఎక్స్ మనీ సేవలను విస్తరించే దిశగా పని చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement