త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nitesh Rane Bakrid Remark | ‘మటన్‌కు బదులు కాగితం తిని చూడు’.. వర్చువల్ బక్రీద్ వ్యాఖ్యలపై బీజేపీ మంత్రి నితేశ్ రాణేకు సొంత పార్టీ నేత షాక్

బక్రీద్ పండుగను 'వర్చువల్'గా జరుపుకోవాలన్న మహారాష్ట్ర మంత్రి నితేశ్ రాణే వ్యాఖ్యలపై బీజేపీలోనే దుమారం లేపుతోంది. సొంత పార్టీ నేత హాజీ అరాఫత్ ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

J

National | Published On May 26, 2026, 6.36 pm IST

Nitesh Rane Bakrid Remark | ‘మటన్‌కు బదులు కాగితం తిని చూడు’.. వర్చువల్ బక్రీద్ వ్యాఖ్యలపై బీజేపీ మంత్రి నితేశ్ రాణేకు సొంత పార్టీ నేత షాక్
Advertisement

Nitesh Rane Bakrid Remark | త్రినేత్ర.న్యూస్ : మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో ఇప్పుడు 'వర్చువల్ బక్రీద్' (Virtual Bakrid) వ్యవహారం తీవ్ర దుమారం లేపుతోంది. పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కఠిన చట్టాలను సమర్థిస్తూ.. బక్రీద్ పండుగను పర్యావరణహితంగా లేదా వర్చువల్‌గా జరుపుకోవాలంటూ మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నాయకుడు నితేశ్ రాణే (Nitesh Rane) చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయనకు బీజేపీకే చెందిన నేత హాజీ అరాఫత్ షేక్ (Haji Arafat Shaikh) దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. మటన్ రుచి తెలియాలంటే "మటన్‌కు బదులుగా ఓసారి కాగితం తిని చూడు" అంటూ ఘాటు విమర్శలు చేశారు.

ఆయన తండ్రి మాంసం షాపు నుంచే పైకొచ్చారు

కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణే కుమారుడైన నితేశ్ రాణే కుటుంబ నేపథ్యాన్ని హాజీ అరాఫత్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. "నితేశ్ రాణే కాస్త అర్థం చేసుకోవాలి. ఇది ఈద్ పండుగ. పైగా ఆయనకు కూడా సొంతంగా ఓ మాంసం దుకాణం ఉంది. ఆయన తండ్రి ఒకప్పుడు మాంసం షాపు నడుపుతూనే క్రమంగా మంత్రి స్థాయికి, కేంద్రంలో కీలక నేత స్థాయికి ఎదిగారు. చెంబూర్‌లో వాళ్ల అమ్మగారి పేరు మీద వాళ్లకో హోటల్ కూడా ఉంది. అక్కడ అద్భుతమైన పీతలు, చేపలు, మటన్ మసాలా దొరుకుతాయి. కాబట్టి నితేశ్ రాణే అర్థం చేసుకోవాలి. ఆదివారం పూట మటన్ తినే అలవాటు ఉంటే.. ఒకసారి దానికి బదులు కాగితం తిని చూడాలి, అప్పుడు దాని రుచి ఏంటో తెలుస్తుంది" అని ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ అరాఫత్ వ్యాఖ్యానించారు.

కబేళా వ్యాపారుల బాధలు అర్థం చేసుకోండి

బక్రీద్ (Bakrid 2026) పండుగ సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా మాంసం విక్రయదారులు పడుతున్న ఇబ్బందులను అరాఫత్ ప్రస్తావించారు. మేకలను తరలిస్తున్న వాహనాలను అడ్డుకుంటున్నారని, దీనివల్ల కేవలం ముస్లింలు మాత్రమే కాకుండా హిందూ కటికవారు, ధన్‌గర్ సామాజిక వర్గానికి చెందిన వారు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "వాళ్లంతా ఏడాదికి ఒకసారే నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు. మీ చెంబూర్ షాపులో మీ వ్యాపారం బాగానే సాగుతోంది.. మరి మా వ్యాపారం సంగతి కూడా కాస్త ఆలోచించండి" అని చురకలంటించారు. తండ్రి నారాయణ్ రాణే దగ్గర సలహాలు తీసుకోవాలని సూచించిన అరాఫత్.. నితేశ్ రాణేకు ముందస్తు ఈద్ శుభాకాంక్షలు చెబుతూ, పండుగ రోజు తమ ఇంటికి వచ్చి మటన్ తినాలని ఆహ్వానించారు.

నితేశ్ రాణే అసలేం మాట్లాడారంటే?

ఇటీవల ముంబైలో మీడియాతో మాట్లాడిన నితేశ్ రాణే.. పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడే సంస్థలు కేవలం హిందూ పండుగలనే ఎందుకు టార్గెట్ చేస్తాయని ప్రశ్నించారు. "దీపావళికి టపాసులు కాల్చొద్దు, హోలీకి నీళ్లు వృథా చేయొద్దు అని పెటా (PETA) లాంటి సంస్థలు, పర్యావరణవేత్తలు చెబుతుంటాయి. అలాంటప్పుడు రాబోయే బక్రీద్‌ను కూడా పర్యావరణహితంగా ఎందుకు చేసుకోకూడదు? 'వర్చువల్ బక్రా ఈద్' ఎందుకు చేసుకోకూడదు?" అని ఆయన అడిగారు.

బక్రీద్ తర్వాత మురుగుకాల్వల్లో రక్తం పారుతున్నా జంతు హక్కుల సంఘాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయని నితేశ్ ప్రశ్నించారు. అంతేకాకుండా, ఆవుల అక్రమ రవాణా, గోమాంసం విక్రయాలకు పాల్పడే వారిపై 'మకోకా' (MCOCA) వంటి కఠిన చట్టాలను ప్రయోగిస్తూ దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఆయన గట్టిగా సమర్థించారు.

Advertisement
Advertisement