త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | శంషాబాద్‌లో వెయ్యి కోట్ల విలువైన భూముల స్కాం : హ‌రీశ్‌రావు

Harish Rao | రైతుల ధాన్యం కొనుగోలు చేతగాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాదు గానీ, ప్రభుత్వ భూములను అందిన కాడికి కొల్లగొడుతున్నారు అని కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు విరుచుకుప‌డ్డారు.

S

Telangana | Published On May 26, 2026, 6.41 pm IST

Harish Rao | శంషాబాద్‌లో వెయ్యి కోట్ల విలువైన భూముల స్కాం : హ‌రీశ్‌రావు
Advertisement

170 ఎకరాల ప్రభుత్వ భూమి, పట్టా ఎలా అయ్యింది?
ఆర్డీవో, తహశీల్దార్ వేర్వేరు రిపోర్టులు ఇవ్వడం ఏమిటి?
ఆర్డీవోను కాదాని తహశీల్దార్ ప్రైవేటు భూమి అని ఎలా డిసైడ్ చేస్తారు?
బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు

Harish Rao | త్రినేత్ర.న్యూస్ : రైతుల ధాన్యం కొనుగోలు చేతగాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాదు గానీ, ప్రభుత్వ భూములను అందిన కాడికి కొల్లగొడుతున్నారు అని కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్ వెయ్యి కోట్ల స్కాంను ఆధారాలతో సహా బయట పెడుతున్నాం, సిట్ లేదా సీఐడీ విచారణ జరిపి ప్రభుత్వ భూములను కాపాడాలి. ఇందులో ఇన్వాల్వ్ అయిన వారిపై చర్యలు తీసుకోవాలి. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ ప‌రిధిలోని 173 నుంచి 183 మధ్య ఉన్న భూమిలో 170 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే కుట్ర జరిగింది. ఆ భూమి ప్రభుత్వ భూమి అని, దాన్ని ఆక్రమణకు గురి కాకుండా ఉండాలని ఆర్డీవో తహశీల్దార్‌కు చెప్పారు. అంతేకాదు ప్రొహిబిటరీ లిస్టు 22ఏలో పెట్టాలని ఆదేశించారు. ఇదే విషయం జనవరి 30, 2026 నాడు హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పొందుపరిచారు. ఇది ప్రభుత్వ భూమి అని ఫ్రిబవరి 24, 2026 నాడు తహశీల్దార్ తేల్చారు. నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 28, 2026 నాడు ఈ భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందుతుందని తహశీల్దార్ ఆర్డర్ పాస్ చేసిండు అని హ‌రీశ్‌రావు తెలిపారు.

ఎమ్మార్వోను కాపాడటంలో ఉన్న పెద్దలు ఎవరు?

నాలుగు రోజుల్లో ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమి ఎలా అయ్యింది. అంతే కాదు ఈ భూమిని భూ భారతి ఆన్‌లైన్‌లో కూడా పెట్టండి అన్నరు. ఆర్డీవో, తహశీల్దార్ రెండు భిన్నంగా ఇస్తే జీపీ రెవెన్యూ హైకోర్టుకు ఎలా ఇచ్చారు. ఏ ఆర్డర్ అయినా కలెక్టర్ అప్రువల్‌తో హైకోర్టుకు వెళ్తుంది, కలెక్టర్ ఎలా అప్రువల్ చేశారు. అడ్వకేట్ జనరల్ ఏ రకంగా అప్రువల్ చేశారు. రూ. 1000 కోట్ల విలువైన భూములు. ఇంత పెద్ద స్కాం జరిగితే అధికారులపై చర్యలు తీసుకోవడం లేదు. ఈ స్కాం గురించి పత్రికల్లో వస్తే, ఈ కేసులో కేవలం ఎమ్మార్వోను కలెక్టరేట్‌కు బ‌దిలీ చేసి ఊరుకున్న‌రు. ఏసీబీ అధికారులు రైడ్ వెళ్లారు. ప్రభుత్వ పెద్దలు ఏం చెప్పారో ఏసీబీ వాపస్ వచ్చింది. చిన్న బ‌దిలీతో స‌రిపెట్టారు. ముఖ్యమంత్రి అతి సన్నిహితుడు ఇందులో ఉన్నడు కాబట్టే ఏసీబీ వెనక్కి వచ్చింది, ఒత్తిడి కారణంగానే ఎమ్మార్వోను జస్ట్ బ‌దిలీ చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎమ్మార్వోను కాపాడటంలో ఉన్న పెద్దలు ఎవరు? బయటకు రావాలి అని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

170 ఎకరాలు ప్రభుత్వ భూమి పట్టా అని ఎలా ఎక్కించారు..

భూ భారతిలో భూమి చేరాలంటే.. దరఖాస్తు పెట్టాలి, ఆర్డీవో దాన్ని అప్రూవ్ చేయాలని భూభారతి చట్టం చెబుతుంది. కానీ ఎమ్మార్వో భూ భారతిలో పెట్టాలని చెప్పగానే అది భూ భారతిలో ఎంట్రీ అయిపోయింది. 170 ఎకరాలు ప్రభుత్వ భూమి పట్టా అని ఎలా ఎక్కించారు. పత్రికల్లో రాగానే.. ఎమ్మార్వోను కేవలం బ‌దిలీ చేసి భూమి మ్యుటేషన్ చేసుకున్నరు. ఎందుకు భూమిని వెనక్కి తీసుకోరు. ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టరు. టోటల్ పట్టా భూమిగా మార్చుకొని 170 ఎకరాలు ఎక్కించారు. వెయ్యి కోట్ల విలువైన భూమి వెనుక కలెక్టర్ ఉన్నడా, ప్రభుత్వ పెద్దలు ఉన్నరా..? రాత్రికి రాత్రి ఎట్లా ప్రైవేటు భూమి అయ్యింది. ఎమ్మార్వో ఆర్డ‌ర్‌ను సస్పెండ్ చేయాలి. సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి. హైకోర్టు ఆర్డర్ మీద అప్పీల్ వెళ్లండి. ఆ భూమిని తిరిగి నిషేధిత జాబితాలో పెట్టాలి. వందల వేల కోట్ల విలువైన ఆర్డీవో ఆర్డర్ ధిక్కరించి పట్టా భూమి మార్చారు. దీనిపై సిట్ లేదా సీఐడీ విచారణ జరిపించాలి. కలెక్టర్, సీసీఎల్ఏ, ఉన్నతాధికారులు ఉన్నరా ఆరా తీయాలి. ప్రభుత్వ పెద్దలు బయటకు రావాలి.
మీది నిజంగా ప్రజాపాలన అయితే, ఈ భూ కుంభకోణంలో భాగస్వామ్యం లేకపోతే, తప్పు చేయకపోతే మీ ప్రమేయం లేకపోతే తహసీల్దార్‌ను వెంటనే డిస్మిస్ చేయండి, ప్రభుత్వ భూమిని కాపాడండి అని హ‌రీశ్‌రావు అన్నారు.

ఆర్టీసీ డ్రైవర్‌పై సస్పెన్షన్ వేటు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

జగిత్యాలలో ఆర్టీసీ డ్రైవర్‌పై సస్పెన్షన్ వేటు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన డ్రైవర్ కావొచ్చు, ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ. రైతుల కష్టాలు చూడలేక ఒక మాట మాట్లాడిండు. డ్రైవర్ అశోక్ ధాన్యం కొనుగోలు చేయాలని మాట్లాడితే తప్పు ఎలా అవుతుంది. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్చ ఉంటుంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తారా? ప్రశ్నించే హక్కు ఆరో గ్యారెంటీ అన్న మీకు ఇంత నియంతృత్వ వైఖరి ఎందుకు.? సస్పెన్షన్ వెంటనే ఉపసంహరించుకోవాలని, ఎత్తివేయాలి డిమాండ్ చేస్తున్నం. లేదంటే ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌కు అండగా బీఆర్ఎస్ ఉంటుందని, న్యాయపోరాటం, ప్రత్యక్ష పోరాటానికి వెంటే ఉంటామని స్పష్టం చేస్తున్నామ‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement