Boda Kakarakaya | కరువు నేలలో ‘బోడ కాకరకాయ’ సాగు.. ఎకరాకు రూ. 7 లక్షలు సంపాదన
Boda Kakarakaya | అది మరాఠ్వాడా( Marathwada ) ప్రాంతం.. కరువు( Drought ) కరాళ నృత్యం చేస్తుంటుంది. సాగుకు సరిపడా నీరు ఉండదు. ఏవుసం చేసే ప్రతి రైతు( Farmer ) కన్నీరు పెట్టాల్సిందే. అలాంటి కరువు నేలలో ఓ యువ రైతు( Young Farmer ).. సిరులు కురిపిస్తున్నాడు. అడవిలో అరుదుగా లభించే బోడ కాకరకాయ( Boda Kakarakaya )ను సాగు చేసి.. ఎకరాకు రూ. 7 లక్షలు సంపాదిస్తున్నాడు. మరి ఆ యువ రైతు కృష్ణ ఫాల్కే( Krushna Phalke ) గురించి తెలుసుకోవాలంటే మహారాష్ట్ర( Maharashtra )లో అడుగుపెట్టాల్సిందే.
Agriculture | Published On May 24, 2026, 1.28 pm IST
Boda Kakarakaya | మహారాష్ట్రలోని ఫూలంభ్రి ప్రాంతం అది. వానాకాలంలో ఆ ప్రాంతమంతా పచ్చగా కళకళలాడుతుంది. స్థానికంగా వర్షాకాలం సమయంలో బోడ కాకరకాయ విరివిగా పండుతుంది. అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆ కాకరకాయను తీసుకురావాలని తన తాత అడవికి పంపేవాడు.
ఇక తన తాతకు బోడ కాకరకాయ ఎందుకు ఇష్టమో తెలుసుకోవాలని యువకుడు నిర్ణయించుకున్నాడు. ఎందుకు ఈ కూరగాయ మీకు ఇష్టమని అడిగినప్పుడు.. ప్రోటీన్ అధికంగా ఉంటుందని, విటమిన్లు కూడా పుష్కలంగా లభిస్తాయని తాత గారూ సమాధానం ఇచ్చారు. తాత మాటలు కృష్ణ ఫాల్కే మదిలో నాటుకుపోయాయి.
ఆ చిన్ననాటి జ్ఞాపకమే కృష్ణను బోడ కాకరకాయ సాగుపై దృష్టి సారించేలా చేసింది. తనకున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి.. బోడ కాకరకాయ సాగుకు పూనుకున్నాడు. 2018లో ఈ సాగు ప్రారంభించాడు. ఇప్పుడు ఎకరానికి దాదాపు రూ. 7 లక్షల సంపాదిస్తూ.. ఖర్చులు పోనూ రూ. 6.25 లక్షల వరకు ఆర్జిస్తున్నాడు. కృష్ణను ప్రేరణగా తీసుకుని 675 మంది రైతులు బోడ కాకర సాగును ప్రారంభించారు.
2016లో ఉద్యోగానికి రాజీనామా..
కృష్ణ 2015లో బీఎస్సీ అగ్రికల్చర్ పట్టా పుచ్చుకున్నాడు. ఆ తర్వాత యూపీఎల్ ఇండియా కంపెనీలో చేరాడు. దాదాపు ఏడాది కాలం పాటు ఉద్యోగం చేశారు. కానీ ఆ కార్పొరేట్ ఉద్యోగం అతనికి నచ్చలేదు. పని భారం ఎక్కువగా ఉండడంతో మానసికంగా ఇబ్బందిపడేవాడు. ఇదే కష్టం తన పొలంలో చేస్తే.. అంతకు అంత లాభాలు గడించొచ్చని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో 2016లో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇంటికి తిరిగొచ్చి పొలం బాట పట్టాడు.
బోడ కాకరకాయకున్న డిమాండ్‌తో..
2016లో తన కుటుంబానికి కేవలం 2.5 ఎకరాల భూమి మాత్రమే ఉండేది. ఇక ఆ భూమిలో 2017లో మిరప సాగు చేపట్టి లాభాలు గడించాడు. కానీ మనసు మాత్రం బోడ కాకరకాయ మీదనే ఉంది. స్థానికంగా ఉన్న గిరిజనులు జాతీయ రహదారులపై బోడ కాకరకాయలను అధిక ధరలకు విక్రయించడం కూడా కృష్ణ గ్రహించాడు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే ప్రతి ఒక్కరూ వర్షాకాలంలో ఈ కాకరకాయను ఇష్టంగా తింటారని కనుగొన్నాడు. అందుకే దీనికి అధిక డిమాండ్ ఉందన్న విషయాన్ని గ్రహించాడు. రక్తంలో చక్కెరను కూడా నియంత్రిస్తుంది కాబట్టి డయాబెటిక్ రోగులు కూడా ఇష్టంగా తింటారు.

అడవుల నుంచి విత్తనాలు సేకరించి..
ఈ క్రమంలో మొత్తానికి కృష్ణ తన వ్యవసాయ పొలంలో బోడ కాకరకాయ సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం.. ఇక అడవుల్లోకి వెళ్లి బోడ కాకరకాయ విత్తనాలను సేకరించాడు. 2018లో విత్తనాలు సేకరించి భద్రపరిచాడు. 2019లో సాగు మొదలుపెట్టాడు.
రెండు నెలల వ్యవధిలోనే దిగుబడి..
అయితే మరాఠ్వాడా కరువు పీడిత ప్రాంతం కాబట్టి.. తేమను కాపాడుకోవడానికి కాకర మొక్కలను దగ్గరగా నాటాడు. ఒక్కో మధ్య 4 అడుగుల దూరం, వరుసల మధ్య 3 అడుగుల దూరం ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. అర ఎకరా పొలంలో 600 నుంచి 700 గ్రాముల వరకు విత్తనాలు నాటాడు. ఇది తీగ జాతి పంట కావడంతో.. 15 -20 అడుగుల దూరంలో ఏడు అడుగుల ఎత్తులో వెదురు కర్రలను పాతాడు. తీగలు కర్రలపైకి పాకి.. పొదరిల్లు మాదిరి రూపాంతరం చెందుతుంది. అయితే మే నెలలో విత్తనాలు నాటగా.. రెండు నెలల వ్యవధిలోనే దిగుబడి రావడం మొదలైంది. జూన్ నెలఖారు నాటికి కోతకు వచ్చింది కాకరకాయ. ఇలా సెప్టెంబర్ మాసం వరకు ఈ పంటను కొనసాగింపు చేయొచ్చు.
ఎకరానికి 4.5 టన్నుల దిగుబడి.. రూ. 7 లక్షల ఆదాయం..
మొదటి సీజన్‌లో కేవలం అర ఎకరం నుంచి సుమారు 22 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ఈ కాకరకాయలను ఛత్రపతి సంభాజీనగర్ మార్కెట్‌లో కిలోకు రూ. 180 చొప్పున విక్రయించాడు కృష్ణ. అయితే వినియోగదారుల నుంచి అనూహ్యమైన స్పందన రావడంతో.. దీనికి మార్కెట్‌లో భారీగానే డిమాండ్ ఉందన్న విషయాన్ని కృష్ణ గ్రహించాడు. అలా రెండు ఎకరాల్లో పంటను సాగు చేస్తూ ప్రతి ఏడాది ఎకరానికి దాదాపు 4 నుంచి 4.5 టన్నుల వరకు దిగుబడిని సాధిస్తున్నాడు. అయితే జూన్ మాసంలో కిలో కాకరకాయలను రూ. 280 వరకు విక్రయించాడు కృష్ణ. వర్షాకాలం ముగిసే సమయం నాటికి ఆ ధర రూ. 140 నుంచి రూ. 170కి తగ్గుతుంది. ఇలా ఏడాదికి రూ. 7 లక్షల రాబడిని పొందుతున్నాడు కృష్ణ. నీటి అవసరం కూడా తక్కువే. మొత్తంగా ఎకరానికి పెట్టుబడి కింద రూ. 70 వేల నుంచి రూ. 80 వేల ఖర్చు అవుతుందని కృష్ణ తెలిపాడు.

అదనంగా రూ. 50 వేల ఆదాయం..
అయితే ఈ మొక్కలు అక్టోబర్ నెల వరకు దిగుబడిని ఇస్తాయి. ఆ తర్వాత తీగలు వాటంతట అవే ఎండిపోతాయి. ఆ వేర్లు మట్టిలోనే కలిసిపోతాయి. మళ్లీ ఏప్రిల్ నాటికి కొత్త చిగురు వస్తుంది.. మళ్లీ సహజంగా పెరుగుతాయి మొక్కలు. ఒక్కో తీగ ఏడు నుంచి ఎనిమిది ఏండ్ల వరకు పునరుత్పత్తి సాధిస్తుంది. ఇక ఇదే భూమిలో అక్టోబర్ నుంచి మొక్కజొన్న, శనగలను పండిస్తున్నాడు. ఈ పంటల వల్ల అదనంగా ఎకరానికి రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు ఆదాయం సంపాదిస్తున్నాడు కృష్ణ.
675 మంది రైతులు కృష్ణ బాటలోనే..
స్థానికంగా ఉన్న 675 మంది కృష్ణ బాటలోనే పయనిస్తున్నారు. బోడ కాకరకాయకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో.. రైతులందరూ ఈ సాగుపై దృష్టి పెట్టారు. కృష్ణ దగ్గర మెళవకులు నేర్చుకుని.. దిగుబడి సాధిస్తున్నారు. చాలా వరకు కృష్ణ పండించిన పంటను పొలం దగ్గరే కొనుగోలు చేస్తున్నారు. మిగిలితే ఛత్రపతి శంభాజీ నగర్ మండికి తరలించి విక్రయిస్తుంటామని కృష్ణ తెలిపాడు. భాందర, నాగ్‌పూర్, యావత్మల్, గోధానా, జలగావ్ వంటి ప్రాంతాల్లో బోడ కాకర సాగుపై రైతులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపాడు. విత్తనాలతో పాటు మొక్కలను కూడా రైతులకు ఉచితంగా అందజేసినట్లు పేర్కొన్నాడు.
కరువు పీడిత ప్రాంతంలో వందలాది రైతులకు మేలు..
అడవిలో లభించే బోడ కాకరకాయను సాగు చేసి లాభాలు గడించి తన అదృష్టాన్ని మార్చుకోవడంతో పాటు కరువు పీడిత ప్రాంతమైన మరాఠ్వాడాలో వందలాది మంది రైతులకు కొత్త మార్గాన్ని చూపించి.. ఆదాయాన్ని సృష్టించుకునే అవకాశం కల్పించాడు కృష్ణ.
తాజావార్తలు
- ●Stock Markets | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. పతనమైన చమురు ధరలు..
- ●Shooting at Food Festival | ఫుడ్‌ఫెస్టివల్‌లో కాల్పులు.. ఇద్దరు దుర్మరణం
- ●Uday Krishna Reddy | పరారీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
- ●Adilabad Airport | ఆదిలాబాద్ విమానాశ్రయానికి రూ.2,278 కోట్లు.. 2 వేల ఎకరాల భూసేకరణ
- ●Rain Update | నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
- ●UPSC Recruitment | బీఈడీ అర్హతతో యూపీఎస్సీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఉద్యోగాలు

Stock Markets | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. పతనమైన చమురు ధరలు..

Shooting at Food Festival | ఫుడ్‌ఫెస్టివల్‌లో కాల్పులు.. ఇద్దరు దుర్మరణం

Uday Krishna Reddy | పరారీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి

Adilabad Airport | ఆదిలాబాద్ విమానాశ్రయానికి రూ.2,278 కోట్లు.. 2 వేల ఎకరాల భూసేకరణ






