త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

E20 | ‘నీట్’ తరహాలోనే ఢిల్లీ వీధుల్లో మరో భారీ లొల్లి!

E20 | మొన్నటికి మొన్న 'నీట్' (NEET) అక్రమాలపై దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసిన ‘జెన్ జీ’ (Gen Z) యువతరం రగిలించిన ఉద్యమ సెగలు ఇంకా చల్లారనేలేదు.. అంతలోనే హస్తిన వేదికగా మరో పెను తిరుగుబాటు ఎగిసిపడునుందా! అన్న చర్చ దేశ రాజధానిలో జరుగుతోంది.

S

National | Published On Jul 31, 2026, 6.15 pm IST

E20 | ‘నీట్’ తరహాలోనే ఢిల్లీ వీధుల్లో మరో భారీ లొల్లి!

సంక్షిప్త సారాంశం

కీలక పరిణామాలు తెహసీన్ పూనావాలా ఆధ్వర్యంలోని 'టీమ్ భారత్' బృందాన్ని జూలై 29న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ చర్చలకు పిలిచారు. E10 పెట్రోల్ లభ్యత, E20 పై 20% డిస్కౌంట్, ARAI నివేదికల బహిర్గతం వంటి 6 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. చర్చలు జరిగిన మరుసటి రోజే (జూలై 30) పూనావాలాను నిర్బంధంలోకి తీసుకోవడం, సోషల్ మీడియా ఖాతా నిలిపివేయడం వివాదాస్పదమైంది. కేజ్రీవాల్, క్యాబ్ యూనియన్ల మద్దతు లభిస్తున్నప్పటికీ, ఇది కేవలం సామాన్యుడి జేబుకు సంబంధించిన రాజకీయ రహిత పోరాటమని చెబుతూ, E10 పెట్రోల్ తిరిగి అందుబాటులోకి తెచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని 'టీమ్ భారత్' తెగేసి చెప్పింది.

Advertisement
  • హస్తినలో 'E20' మంటలు.. కేంద్రం ముందే కనిపెట్టిందా?

E20 | త్రినేత్ర.న్యూస్ : మొన్నటికి మొన్న 'నీట్' (NEET) అక్రమాలపై దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసిన ‘జెన్ జీ’ (Gen Z) యువతరం రగిలించిన ఉద్యమ సెగలు ఇంకా చల్లారనేలేదు.. అంతలోనే హస్తిన వేదికగా మరో పెను తిరుగుబాటు ఎగిసిపడునుందా! అన్న చర్చ దేశ రాజధానిలో జరుగుతోంది. ఆర్టీఐ (RTI) పేపర్లు, సాంకేతిక నివేదికలు చేతపట్టుకుని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో సవాలు చేస్తోంది 'టీమ్ భారత్'. E20 పెట్రోల్ విధానంపై జెన్ జీ తరహాలో టీమ్ భారత్ అనే ఈ యంగ్ బ్రిగేడ్ గళమెత్తుతుంటే.. నిన్నటి నీట్ పోరాటాన్ని గుర్తుచేస్తూ కేంద్ర పాలకులు మళ్లీ దిగిరాక తప్పని పరిస్థితి నెలకొంది!

"లీటరుకు ఏమైనా మిగులుతుందనుకుంటే.. ఇంజిన్ తుస్సుమంటోంది! మైలేజీ పడిపోయి జేబుకు కన్నం పడుతోంది!" ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో సామాన్య వాహనదారుల నోట వినిపిస్తున్న ప్రధాన ఆవేదన ఇది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన E20 (20 శాతం ఇథనాల్ కలిపిన) పెట్రోల్ విధానం ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతోంది. ఒకవైపు ఇంధన దిగుమతుల భారం తగ్గుతుందని ప్రభుత్వం చెబుతుంటే, మరోవైపు పాత వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయని, మైలేజ్ పడిపోతోందని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు.

అసలు ఏమిటీ ‘టీమ్ భారత్’? ఎవరీ యంగ్ బ్రిగెడ్స్ ?

సోషల్ మీడియా ప్రచారాలకే పరిమితం కాకుండా, శాస్త్రీయ ఆధారాలు, చట్టపరమైన పత్రాలతో కేంద్ర ప్రభుత్వ విధానాలను క్షేత్రస్థాయిలో సవాలు చేస్తున్న పౌర వేదిక 'టీమ్ భారత్'. ఈ సంస్థకు ప్రముఖ సామాజిక విశ్లేషకుడు, టీవీ ప్యానలిస్ట్ తెహసీన్ పూనావాలా, కార్పొరేట్ విశ్లేషకుడు దినేష్ తాంతియా (Co-founder) ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. రత్న, సౌరవ్ దాస్ వంటి స్వతంత్ర జర్నలిస్టులు, ఆటోమొబైల్ నిపుణురాలు నిధి శర్మ, ఆర్టీఐ ఆక్టివిస్టులు ఈషాన్ భరద్వాజ్, నచికేత తదితరులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. నిరసనలు చేయడం మాత్రమే కాకుండా.. ARAI (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) నుంచి ఆర్టీఐల ద్వారా సమాచారం రాబట్టడం, వివిధ మోడళ్ల కార్లలో E20 పెట్రోల్ వల్ల వస్తున్న లోపాలను రికార్డు చేసి శాస్త్రీయంగా ప్రశ్నించడం వీరి శైలి.

ఎన్నడూ లేని విధంగా చారిత్రాత్మక ముందస్తు చర్చలు.. ఆ వెంటనే నిర్బంధాలు!

సాధారణంగా ఏ నిరసన అయినా ఉధృతమయ్యాక స్పందించే కేంద్ర ప్రభుత్వం, ఈసారి అనూహ్యంగా అడుగు ముందుకేసింది. జూలై 29న కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ, ఆయన యంత్రాంగం టీమ్ భారత్ ప్రతినిధులను 'కర్తవ్య భవన్' వేదికగా అధికారిక చర్చలకు ఆహ్వానించారు. ఇది నిజంగా అనూహ్యమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జెన్ జి ఉద్యమం సెగ కారణంగానే కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్చలకు ఆహ్వానించడం జరిగిందని అర్థం అవుతోంది.

కేంద్ర మంత్రి సమక్షంలో టీమ్ భారత్ ప్రతినిధులు 6 కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు:

1. E10 పెట్రోల్ లభ్యత: ప్రస్తుతం రోడ్లపై ఉన్న 80% కంటే ఎక్కువ వాహనాలు (2023 కంటే ముందు తయారైనవి) E10కి మాత్రమే అనుకూలం. కాబట్టి E10 పెట్రోల్‌ను తప్పనిసరిగా రీటైల్ బంకుల్లో అందుబాటులో ఉంచాలి.

2. E0 (ప్యూర్ పెట్రోల్) ధర తగ్గింపు: అసలు ఇథనాల్ కలపని స్వచ్ఛమైన పెట్రోల్‌ను అందుబాటులోకి తెచ్చి, దాని ధర తగ్గించాలి.

3. E20 పై 20% డిస్కౌంట్: కలపడం వల్ల ప్రభుత్వానికి తగ్గిన వ్యయాన్ని వినియోగదారుడికి బదిలీ చేస్తూ E20 పై 20 శాతం రాయితీ ఇవ్వాలి.

4. డేటా బహిరంగపరచడం: E20 వల్ల ఇంజిన్‌లపై పడే ప్రభావంపై చేసిన పరిశోధనల శ్వేతపత్రాన్ని (ARAI రిపోర్టులు) బయటపెట్టాలి.

5. వాహనదారులకు నష్టపరిహారం: E20 పెట్రోల్ వాడకం వల్ల హోస్ పైపులు, గ్యాస్కెట్లు, ఇంజిన్లు పాడైపోయిన వాహనదారులకు కంపెనీల ద్వారా లేదా ప్రభుత్వం ద్వారా ఉచిత పరిష్కారం చూపాలి.

6. ప్రయోజనాల ఘర్షణ (Conflict of Interest): కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కుటుంబానికి ఇథనాల్ డిస్టిలరీల వ్యాపారాలతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలి.

అయితే, ఈ చర్చలు సానుకూలంగా జరిగాయని భావిస్తున్న మరుసటి రోజే (జూలై 30) పోలీసులు తెహసీన్ పూనావాలాను నిర్బంధంలోకి తీసుకోవడం, ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను నిలిపివేయడం కలకలం రేపింది. కేంద్ర ప్రభుత్వ తీరుపై టీమ్ ఇండియా ప్రతినిధులు మండిపడుతున్నారు.

జేబుకి కన్నం.. రూ. 80,000 కోట్ల భారం!

ఇథనాల్ కలపడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందన్న వాదనను టీమ్ భారత్ తప్పుపట్టడం లేదు. కానీ, తగిన ముందస్తు తయారీ లేకుండా హడావుడిగా E20 ని రుద్దడం వల్ల గత మూడేళ్లలో భారతీయ వాహనదారులు అదనంగా రూ. 80,000 కోట్లు పెట్రోల్ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చిందన్న నివేదికలను బయటపెట్టి ఈ టీం ప్రశ్నలు సంధిస్తోంది. మరో వైపు మైలేజీ 10% నుండి 15% వరకు పడిపోవడం వల్ల లీటరు పెట్రోల్ ధర పరోక్షంగా పెరిగిపోతోందని సామాన్య వాహనదారులు వాపోతున్నారు. దీనివల్ల చక్కెర మిల్లుల యజమానులు, ఇథనాల్ తయారీదారుల గల్లా పెట్టెలు నిండుతున్నాయే తప్ప, దేశ ప్రజలకూ లేదా చెరకు రైతులకూ దక్కింది ఏమీ లేదనేది టీమ్ భారత్ నేతల ప్రధాన ఆరోపణ.

ఊపందుకుంటున్న మద్దతు

ఈ వివాదం ఇప్పుడు రాజకీయ రూపు కూడా దాలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈ అంశంపై టౌన్‌హాల్ సమావేశాలు నిర్వహిస్తుండగా, ఆగస్టు 4 నుంచి ఢిల్లీ టాక్సీ, క్యాబ్ ఆపరేటర్ల యూనియన్లు తమ నిరసన వ్యక్తం చేస్తూ వీధుల్లోకి రానున్నాయి. ఎన్ని రాజకీయ సభలు జరిగినా.. "మా వేదికపై ఏ రాజకీయ నాయకుడికీ చోటు లేదు, మా పోరాటం కేవలం ఇథనాల్-పెట్రోల్-సామాన్యుడి జేబు గురించే!" అని టీమ్ భారత్ స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం నిజాయితీగా స్పందించి, E10 పెట్రోల్‌ను మళ్లీ బంకుల్లో అందుబాటులోకి తెచ్చే వరకు ఈ లొల్లి సద్దుమణిగేలా కనిపించడం లేదు. పాలకుల నిర్ణయాలు కాగితాల మీద బాగానే ఉన్నా.. అవి సామాన్యుడి ఇంజిన్‌ను బలితీసుకోకూడదనేదే తమ పోరాటం ముఖ్య ఉద్దేశమని టీమ్ భారత్ చెబుతోంది.

Advertisement
Advertisement