త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asaduddin Owaisi | రాజ్యాంగం క‌ల్పించిన మ‌త‌ స్వేచ్ఛ ఇక ముస్లింల‌కు వ‌ర్తించ‌దా..? మ‌సీదు కూల్చివేత‌పై ఒవైసీ ఆగ్ర‌హం

Asaduddin Owaisi | సహరాన్‌పూర్ కలెక్టరేట్ పరిధిలో మ‌సీదును కూల్చివేయ‌డంపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్రంగా స్పందించారు. ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కు ఇకపై వర్తించదా..? అని ప్రశ్నించారు.

D

National | Published On Sep 5, 2026, 1.58 pm IST

Asaduddin Owaisi | రాజ్యాంగం క‌ల్పించిన మ‌త‌ స్వేచ్ఛ ఇక ముస్లింల‌కు వ‌ర్తించ‌దా..? మ‌సీదు కూల్చివేత‌పై ఒవైసీ ఆగ్ర‌హం
Advertisement

Asaduddin Owaisi | త్రినేత్ర‌.న్యూస్ : ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ కలెక్టరేట్ పరిధిలో ఉన్న‌ మసీదు కూల్చివేతపై (Saharanpur Mosque Demolition) ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్రంగా స్పందించారు. ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కు ఇకపై వర్తించదా..? అని ప్రశ్నించారు. కేవలం కక్ష సాధింపు చర్యల కోసం మసీదులను బుల్డోజర్లతో కూల్చివేయడం ఏంట‌ని నిల‌దీశారు.

"ఈ రోజు ఉదయం 5 గంటలకు సహ‌రాన్‌పూర్ కలెక్టరేట్ వద్ద (Saharanpur Collectorate) ఉన్న మసీదును కూల్చివేశారు. ముస్లింలకు రాజ్యాంగం క‌ల్పించిన‌ మత స్వేచ్ఛ హక్కు ఇకపై వర్తించదా..? కేవలం కొన్ని కార‌ణాల‌ను సాకుగా చూపి మా ప్రార్థనా స్థలాలను ఎందుకు నిరంతరం బుల్డోజ‌ర్ల‌తో కూల్చివేస్తున్నారు?" అని నిలదీశారు. ఈ మసీదు ఉనికిని నిరూపించే 1911 నాటి రికార్డులు కమిటీ వద్ద ఉన్నాయని ఈ సంద‌ర్భంగా ఒవైసీ తెలిపారు.

శతాబ్దానికి పైగా అక్కడ నిరంత‌రాయంగా ప్రార్థనలు జరుగుతున్నట్లు చెప్పారు. చ‌ట్ట ప్ర‌కారం ఇది ‘వక్ఫ్‌ బై యూజర్‌’ పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు. క‌లెక్ట‌రేట్ త‌ర్వాత మ‌సీదు రాలేద‌ని.. మ‌సీదు వ‌చ్చిన త‌ర్వాతే ఇక్క‌డ క‌లెక్ట‌రేట్ ఏర్పాటైంద‌ని స్ప‌ష్టం చేశారు. మ‌సీదును చూసి కొంద‌రికి క‌డుపు మంట‌గా ఉంద‌ని వ్యాఖ్యానించారు. అంత ఇబ్బందిగా ఉంటే మ‌సీదువైపు చూడ‌కండి అంటూ ధ్వ‌జ‌మెత్తారు. "కేవలం మీ కక్షతో మా మసీదును బుల్డోజ్ చేయలేరు. నా మత స్వేచ్ఛ మీ దయపై ఆధారపడి లేదు" అని ఆయన ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

కాగా, సహరాన్‌పూర్ కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న మసీదుపై వివాదం నెల‌కొంది. ఈ మసీదును ప్ర‌భుత్వ భూమిలో అక్ర‌మంగా నిర్మించారంటూ బజరంగ్ దళ్ మాజీ కోఆర్డినేటర్ వికాస్ త్యాగి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వివాదం తెర‌పైకి వ‌చ్చింది. దీనిపై విచారణ జరిపిన సిటీ మేజిస్ట్రేట్ కోర్టు ఈ ఏడాది జూలై 17న‌ ఈ మసీదును అక్రమ కట్టడంగా తేల్చింది. 30 రోజుల్లోగా దీన్ని తొలగించాలని ఆదేశించడంతో పాటు, దశాబ్దాలుగా ప్రభుత్వ భూమిని ఆక్రమించినందుకు గాను రూ.6.41 కోట్ల భారీ జరిమానా విధించింది. ఈ తీర్పును మ‌సీదు క‌మిటీ జిల్లా కోర్టులో స‌వాల్ చేసింది. ఈ మసీదు దాదాపు 100 నుంచి 150 ఏళ్ల నాటిదని, దీనికి సంబంధించి 1911 నాటి విద్యుత్ బిల్లు వంటి ఆధారాలు ఉన్నాయని వారు కోర్టులో వాదించింది. అయితే, ఈ ప‌త్రాల‌ను ప్ర‌భుత్వ యంత్రాంగం తోసిపుచ్చింది.

దీంతో ముస్లిం వర్గం దాఖలు చేసిన అప్పీలును జిల్లా కోర్టు తిరస్కరించింది. సిటీ మేజిస్ట్రేట్ ఉత్తర్వులను సమర్థించింది. కోర్టు తీర్పుతో శ‌నివారం ఉద‌యం అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య బుల్డోజర్లతో మసీదును కూల్చివేశారు. కూల్చివేత స‌మ‌యంలో అక్క‌డ ఎలాంటి ఉద్రిక్త‌త‌లు త‌లెత్త‌కుండా పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ఈ ప‌రిణామాల‌తో మ‌సీదు క‌మిటీ, ముస్లిం వ‌ర్గం భ‌గ్గుమ‌న్న‌ది. జిల్లా కోర్టు నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నట్లు మసీదు కమిటీ ప్ర‌క‌టించింది.

ఈ ఘ‌ట‌న‌పై కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మ‌సూద్ తీవ్రంగా మండిప‌డ్డారు. ఇది కేవ‌లం మ‌సీదు కూల్చి వేత స‌మ‌స్య మాత్ర‌మే కాద‌ని చెప్పారు. దేశ రాజ్యాంగాన్ని, చ‌ట్టాల‌ను ఉల్లంఘించ‌డ‌మేన‌ని ఆరోపించారు. ఖస్రా రికార్డుల ప్రకారం అది కలెక్టరేట్ భూమి అని చెబుతున్నప్పటికీ.. ఆ భూమి ఇప్పటికీ వహీద్ ఖాన్, యాకూబ్ ఖాన్ పేర్ల మీదే రిజిస్టర్ అయి ఉందని తెలిపారు. పైకోర్టును ఆశ్ర‌యించేందుకు కూడా స‌మ‌యం ఇవ్వ‌కుండా అత్యంత వేగంగా అప్పీల్‌ను కొట్టివేసి కూల్చివేత‌లు చేప‌ట్టార‌ని మ‌సూద్ మండిప‌డ్డారు.

Also Read..

పిల్ల‌ల్ని డిజిట‌ల్ వ్య‌స‌నం నుంచి బ‌య‌ట‌ప‌డేయాలి.. ఉపాధ్యాయుల‌కు ప్ర‌ధాని మోదీ సూచ‌న‌

రెండేండ్లు స‌మ‌య‌మివ్వండి.. టీచ‌ర్ల‌కు సీఎం రేవంత్ విజ్ఞ‌ప్తి

రూ.10వేల సిప్‌తో రూ.7 కోట్లు.. ఆదిత్య బిర్లా స్కీమ్ అద్భుతం..

Advertisement
Advertisement