త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | మంచి వ‌క్త కావాలంటే ఏం చేయాలి..? మోదీ ప్రశ్నకు టీచర్‌ సమాధానం.. న‌వ్వేసిన ప్రధాని..!

PM Modi | జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్య, పిల్లల ప్రవర్తన, స్క్రీన్‌ టైమ్‌, మాదకద్రవ్యాల ప్రభావం తదితర అంశాలపై ఉపాధ్యాయులతో ఆయన చర్చించారు. సమావేశంలో జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియోను కూడా మోదీ విడుదల చేశారు. ఉ

P

National | Published On Sep 5, 2026, 1.27 pm IST

PM Modi | మంచి వ‌క్త కావాలంటే ఏం చేయాలి..? మోదీ ప్రశ్నకు టీచర్‌ సమాధానం.. న‌వ్వేసిన ప్రధాని..!
Advertisement

PM Modi | జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్య, పిల్లల ప్రవర్తన, స్క్రీన్‌ టైమ్‌, మాదకద్రవ్యాల ప్రభావం తదితర అంశాలపై ఉపాధ్యాయులతో ఆయన చర్చించారు. సమావేశంలో జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియోను కూడా మోదీ విడుదల చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రను ఆయన గుర్తుచేశారు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళిగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.

మంచి స్పీకర్‌ కావాలంటే ఏం చేయాలి?

ఈ సంద‌ర్భంగా మోదీ తన ప్రసంగ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి ఓ ఉపాధ్యాయురాలిని మోదీ సలహా కోరారు. ‘‘నేను మీ విద్యార్థినైతే.. మంచి స్పీకర్‌గా మారేందుకు ఏం చేయాలి?’’ అని ప్రశ్నించారు. దీనికి ఆ ఉపాధ్యాయురాలు.. ‘‘ముందుగా ఆత్మవిశ్వాసం ఉండాలి’’ అని సమాధానమిచ్చారు. దీంతో అక్కడున్న ఉపాధ్యాయుల‌తో పాటు ప్ర‌ధాని సైతం న‌వ్వేశారు. అనంతరం ఆమె సరదాగా స్పందిస్తూ.. ‘‘సర్‌.. మీ ఆరా చూసిన తర్వాత నాకు కొంత సందేహం వచ్చింది’’ అని అనడంతో సమావేశంలో నవ్వులు పూశాయి. మంచిగా మాట్లాడటం పుట్టుకతో వచ్చే లక్షణం కాదని, నిరంతర సాధనతో దాన్ని మెరుగుపర్చుకోవచ్చని ఆ ఉపాధ్యాయురాలు వివ‌రించింది. ఆత్మవిశ్వాసం పెరగడానికి క్రమం తప్పకుండా సాధన చేయడం కీలకమని చెప్పారు. ఈ అంశాన్ని ప్రస్తావించిన మోదీ.. అనంతరం పిల్లలు, విద్యకు సంబంధించిన పలు విషయాలపై ఉపాధ్యాయులతో చర్చించారు.

పిల్లల్లో స్క్రీన్ టైమ్ వ్య‌స‌నంపై ఆందోళన

పిల్లల్లో పెరుగుతున్న స్క్రీన్‌ టైమ్‌పై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అది క్రమంగా వ్యసనంగా మారుతోందని అన్నారు. పిల్లలను క్రీడల వైపు మళ్లించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అయితే, క్రీడలంటే వీడియో గేమ్స్‌ కాదని, ఆరుబ‌య‌ట మైదానంలో ఆడే ఆటలను ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. సృజనాత్మక కార్యక్రమాల్లో పిల్లలను భాగస్వామ్యం చేయడం ద్వారా స్క్రీన్‌లపై వారి ఆసక్తిని తగ్గించవచ్చని చెప్పారు. సృజనాత్మకతను పెంపొందించే కార్యక్రమాలను పిల్లల దైనందిన జీవితంలో భాగం చేయాలని సూచించారు.

మాదకద్రవ్యాల ముప్పుపై అవగాహన కల్పించాలి

పిల్లల్లో మాదకద్రవ్యాల వినియోగం పెరగకుండా అవగాహన కల్పించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని మోదీ కోరారు. పెద్ద నగరాలు, విశ్వవిద్యాలయాల్లో ఒక విద్యార్థి మాదకద్రవ్యాలకు ఎలా బానిసగా మారుతున్నాడో గుర్తించడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుందని చెప్పారు. అందువల్ల ఉపాధ్యాయులే చొరవ తీసుకుని విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లల ప్రవర్తనలో వచ్చే చిన్నచిన్న మార్పులను కూడా ఉపాధ్యాయులు గమనించాలని.. సమస్యను తొలిదశలోనే గుర్తిస్తే పరిష్కరించే అవకాశం ఉంటుందని అన్నారు.

నిబంధనల కంటే పిల్లల జీవితమే ముఖ్యం

కొన్ని పెద్ద నగరాలు, విశ్వవిద్యాలయాల్లో చర్చకు వస్తున్న డ్రెస్‌ కోడ్‌ అంశాన్ని కూడా మోదీ ప్రస్తావించారు. నిబంధనలపై సరైన సమాచారం లేకపోవడం, లేదా వాటి ఉద్దేశాన్ని వివరించకుండానే అమలు చేయడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇలాంటి నిర్ణయాలపై పిల్లల్లో ఎలాంటి ప్రభావం పడుతోంది? వారి ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయా? అనే అంశాలను ఉపాధ్యాయులు పరిశీలించాలని సూచించారు. ఉపాధ్యాయుల బాధ్యత పాఠ్యపుస్తకాలు, సిలబస్‌కే పరిమితం కాకూడదని మోదీ అన్నారు. పిల్లల జీవితాలతో మమేకమై పనిచేయాలని సూచించారు. పిల్లల బాల్యాన్ని తొందరగా ముగిసిపోయేలా చేయకూడదని మోదీ అన్నారు. వారి బాల్యాన్ని కాపాడటంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. చదువుతోపాటు ఆటలు, సృజనాత్మకత, ఆరోగ్యంపై అవగాహన వంటి అంశాలకు పిల్లల జీవితాల్లో తగిన ప్రాధాన్యం ఉండేలా చూడాలని సూచించారు.

కాశీలో క్యాన్సర్‌ అవగాహన కార్యక్రమంపై..

కాశీ నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్న సమయంలో తాను ప్రారంభించిన రొమ్ము క్యాన్సర్‌ అవగాహన కార్యక్రమాన్ని కూడా మోదీ గుర్తుచేశారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం మహిళలు పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. ఒకేరోజు అత్యధిక మందికి స్క్రీనింగ్‌ నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించిన అనుభవాన్ని సానుకూల పరిణామంగా పేర్కొన్నారు. పిల్లల సమగ్ర అభివృద్ధికి చదువు ఒక్కటే సరిపోదని.. ఆటలు, సృజనాత్మక కార్యకలాపాలు, ఆరోగ్య అవగాహన కూడా అవసరమని మోదీ ఉపాధ్యాయులతో జరిగిన సంభాషణలో స్పష్టం చేశారు. పిల్లలు నేర్చుకునేందుకు, ఆరోగ్యంగా ఎదిగేందుకు అనుకూల వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని గుర్తుచేశారు.

Advertisement
Advertisement