త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్‌!

Delhi Jantar Mantar Protest | ఓ వైపు ఇండియా కూటమి( INDIA Bloc ).. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ( Cockroach Janta Party ).. రెండూ తమ తమ నిరసనలతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని( NDA govt ) గుక్క దిప్పుకోకుండా చేస్తున్నాయి. సర్( SIR ) ప్రక్రియను రద్దు చేయాలంటూ, అనేక అక్రమాలకు పాల్పడిన సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్( CEC Jnanesh Kumar ) రాజీనామా చేయాలంటూ అటు ఢిల్లీ( Delhi )లో ఇటు దేశవ్యాప్తంగా ఆందోళనలు తారస్థాయికి చేరుకున్న నేపథ్యంలో.. దేశ రాజధానిలో పరిస్థితి.. బంద్‌ను తలపిస్తున్నది.

P

National | Published On Oct 9, 2026, 8.30 pm IST

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్‌!
Advertisement

శనివారం రాత్రి వరకు
ఇంటర్నెట్ సేవల నిలుపుదల
57 మెట్రో స్టేషన్ల మూసివేత..
అలా చేయొద్దని సుప్రీం సలహా
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే
రైళ్లు, బస్సులు దారి మళ్లింపు
రైళ్లల్లో ఢిల్లీకి వస్తున్న విద్యార్థులను
రాష్ట్రాల స్టేషన్లలో అడ్డుకుంటున్న పోలీసులు
జంతర్ మంతర్ వద్ద నిరసనకు
నిరాకరించిన ఢిల్లీ పోలీసులు
మరో అనువైన స్థలాన్ని
చూపించాలంటూ సుప్రీం ఆదేశం
భారీగా భద్రతా ఏర్పాట్లు.. రవాణాపై ఆంక్షలు
22వేల మంది సాయుధ సిబ్బంది రాక
మ‌రో 10వేల మందికి పైగా పోలీసుల మోహరింపు
12న అతి పెద్ద నిరసనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్

Delhi Jantar Mantar Protest | త్రినేత్ర న్యూస్ : ఓ వైపు ఇండియా కూటమి( INDIA Bloc ).. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ( Cockroach Janta Party ).. రెండూ తమ తమ నిరసనలతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని( NDA govt ) గుక్క దిప్పుకోకుండా చేస్తున్నాయి. సర్( SIR ) ప్రక్రియను రద్దు చేయాలంటూ, అనేక అక్రమాలకు పాల్పడిన సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్( CEC Jnanesh Kumar ) రాజీనామా చేయాలంటూ అటు ఢిల్లీ( Delhi )లో ఇటు దేశవ్యాప్తంగా ఆందోళనలు తారస్థాయికి చేరుకున్న నేపథ్యంలో.. దేశ రాజధానిలో పరిస్థితి.. బంద్‌ను తలపిస్తున్నది. అక్టోబర్ 10న (శనివారం) జంతర్ మంత‌ర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు పిలుపునిచ్చిన దరిమిలా.. ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్‌మంతర్‌ వద్ద నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ క్ర‌మంలో నిర‌స‌న తెలిపే ఏ ప్ర‌య‌త్నాన్నైనా చ‌ట్ట‌విరుద్ధ‌మేన‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. అలాగే, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో మెట్రో స్టేషన్లు మూత‌ప‌డ‌నున్నాయి. అలాగే, రైళ్ల రాకపోకలపై ఆంక్షలు, బస్సుల సేవల నిలిచిపోనున్నాయి. ఫ‌లితంగా ఢిల్లీ సరిహద్దులతో పాటు రాజధానిలో జనజీవనంపై ప్రభావం పడనుంది. నిరసనల నేపథ్యంలో భారీగా భద్రతా బలగాలను మోహరిస్తుండడంతో ఢిల్లీలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కాగా.. మెట్రో రైళ్లను నిలిపివేయవద్దంటూ.. నిరసనకు జంతర్ మంతర్ కాకుండా మరో అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలంటూ సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది.

57 మెట్రో స్టేషన్ల మూసివేత

నేటి రాత్రి 9 గంటల నుంచి 11వ తేదీ తెల్లవారుజాము వరకు ఢిల్లీలోని 57 మెట్రో స్టేషన్లను మూసివేయనున్నారు. దీంతో సెంట్రల్‌ ఢిల్లీలో రాకపోకలకు అంతరాయం కలగనుంది. న్యూఢిల్లీ, హజ్రత్‌ నిజాముద్దీన్‌ రైల్వే స్టేషన్లకు చేరుకోవాల్సిన మెయిల్‌, సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రాకపోకలను అక్టోబర్‌ 10 మధ్యాహ్నం 2 గంటల నుంచి 11వ‌ తేదీ తెల్లవారుజాము వరకు నిలిపివేయ‌నున్నారు. సెంట్రల్‌ ఢిల్లీకి వెళ్లే బస్సుల రాకపోకలను కూడా రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నిలిచిపోనున్నాయి. అలాగే, శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఢిల్లీ సరిహద్దుల వద్ద ఆంక్షలు విధించనున్నారు. బస్సులు, ట్రక్కులు, ట్రాక్టర్లు సహా భారీ వాహనాలను 11వ తేదీ తెల్లవారుజాము వరకు అనుమ‌తి ఉండ‌దు. ఈ చర్యలతో ఢిల్లీకి వచ్చే వాహనాల రాకపోకలపై ప్రభావం పడనుంది.

ఢిల్లీకి 22 వేల మంది సాయుధ భద్రతా సిబ్బంది

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 22 వేల మంది సాయుధ భద్రతా సిబ్బందిని ఢిల్లీకి తరలించారు. వీరికి అదనంగా 10 వేల మందికి పైగా ఢిల్లీ పోలీసులను నగరవ్యాప్తంగా మోహరించనున్నారు. న్యూఢిల్లీ పరిధిలో ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీతో కూడిన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘాను పెంచారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ భద్రతను కూడా పెంచారు. నిరసనల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వస్తున్న విద్యార్థి సంఘాల కార్యకర్తలను మార్గమధ్యంలో అడ్డుకుని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీ వెలుపల ఉన్న కొందరిని గృహనిర్బంధంలో ఉంచేందుకు ఏర్పాటు చేస్తున్నారు. నిరసనల్లో పాల్గొనవద్దంటూ భద్రతా సిబ్బంది ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యువత ఆందోళనలకు వెళ్లకుండా తల్లిదండ్రులు, ఇంట్లోని వారు నచ్చజెప్పాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇందుకోసం విస్తృతంగా ప్రచారం చేపట్టారు.

మ‌ద్యం దుకాణాలు బంద్‌

మరోవైపు, ఢిల్లీలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాలను శుక్ర, శనివారాల్లో మూసివేయనున్నారు. నిరసనల్లో పాల్గొనేవారిని, వారికి మద్దతు తెలిపేవారిని ‘దేశద్రోహులు’గా ముద్రవేస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న వీడియోలు పెద్ద సంఖ్యలో వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియోల్లో కొందరు మితవాద కార్యకర్తలు కర్రలు, లాఠీలు, ఆయుధాలతో కనిపిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు, కొన్ని రైతు సంఘాలు నిరసనల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చాయి. అదే స‌మ‌యంలో సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు మద్దతుగా సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జ‌రుగుతోంది. ఆయనను హిందూ సంస్కృతికి రక్షకుడిగా ప‌లువురు పేర్కొంటున్నారు.

మూడు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని పరిస్థితి

ఎన్నికల సంఘం విషయంలో గత మూడు దశాబ్దాల్లో దేశంలో ఇంతటి విభజన వాతావరణాన్ని తాము చూడ‌లేద‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు పేర్కొంటున్నారు. విద్యార్థుల నిరసనలను అడ్డుకునేందుకు ఇంత భారీగా భద్రతా బలగాలను మోహరించడం, రవాణాపై ఆంక్షలు విధించడం అసాధారణ పరిణామమని అభిప్రాయపడ్డారు. 1990లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతంగా సాగిన సమయంలోనూ ఇలాంటి పరిస్థితులు కనిపించలేదని గుర్తు చేస్తున్నారు. నిరసనకారులు పెద్ద ఎత్తున హింసకు పాల్పడే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తే, అందుకు సంబంధించిన నిఘా సమాచారం క‌చ్చిత‌మైంద‌యి ఉండాల‌ని అభిప్రాయపడ్డారు. ఒకవేళ అలాంటి ముప్పు లేకుండానే ఈ స్థాయిలో ఆంక్షలు విధిస్తే, అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ అవసరమే అయినప్పటికీ, నిరసన హక్కుపై ఆంక్షలు ప్రజాస్వామ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే ప్రశ్నను లేవ‌నెత్తుతున్నారు. గత దశాబ్ద కాలంలో రాజ్యాంగ సంస్థల తటస్థతపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు ఉన్న నమ్మకానికి సవాల్‌గా మారుతున్నాయ‌ని పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement