త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CTI | ఢిల్లీ నిరసన సెగ.. వ్యాపారులకు రూ.3వేల కోట్ల నష్టం!

CTI | దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు వ్యాపార రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. అక్టోబర్‌లో ఇప్పటివరకు జరిగిన ఆందోళనల కారణంగా వ్యాపారులకు సుమారు రూ.3వేల‌ కోట్ల నష్టం వాటిల్లిందని ఛాంబర్‌ ఆఫ్‌ ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ (సీటీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. రహదారుల దిగ్బంధం, రవాణా వ్యవస్థలో అంతరాయాలతో సరుకుల సరఫరా నిలిచిపోయిందని వెల్లడించింది.

P

National | Published On Oct 17, 2026, 4.15 pm IST

CTI | ఢిల్లీ నిరసన సెగ.. వ్యాపారులకు రూ.3వేల కోట్ల నష్టం!
Advertisement
  • నవరాత్రి, దీపావళి సీజన్‌లో మార్కెట్లపై తీవ్ర ప్రభావం
  • 700కుపైగా మార్కెట్లలో కొనుగోళ్లు డీలా..
  • సరఫరా వ్యవస్థకు ఆటంకం
  • దీపావళి నాటికి నష్టాలు రూ.10,000 కోట్లు దాటొచ్చ‌ని సీటీఐ అంచ‌నా

CTI | దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు వ్యాపార రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. అక్టోబర్‌లో ఇప్పటివరకు జరిగిన ఆందోళనల కారణంగా వ్యాపారులకు సుమారు రూ.3వేల‌ కోట్ల నష్టం వాటిల్లిందని ఛాంబర్‌ ఆఫ్‌ ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ (సీటీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. రహదారుల దిగ్బంధం, రవాణా వ్యవస్థలో అంతరాయాలతో సరుకుల సరఫరా నిలిచిపోయిందని వెల్లడించింది. శనివారం సీటీఐ అధ్యక్షుడు బ్రిజేశ్‌ గోయల్‌ ఈ వివరాలు వెల్లడించారు. అక్టోబర్‌ 10న జరిగిన తొలి నిరసనల‌తోనే వ్యాపార రంగానికి రూ.2వేల‌ కోట్ల నష్టం వాటిల్లిందని గోయల్‌ తెలిపారు. అనంతరం అక్టోబర్‌ 13 నుంచి 16 వరకు సెంట్రల్‌ ఢిల్లీలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. మెట్రో సేవలు నిలిచిపోవడం, సెంట్రల్‌ పార్క్‌ మూసివేత వంటి పరిణామాలతో మరో రూ.వెయ్యి కోట్ల నష్టం సంభవించిందని పేర్కొన్నారు. దీంతో ఈ నెలలో వ్యాపార రంగానికి జరిగిన మొత్తం నష్టం రూ.3వేల‌ కోట్లకు చేరిందని వివరించారు.

రిటైల్‌ రంగానికే ఎక్కువ ప్ర‌భావం

నవరాత్రి, దీపావళి పండుగల సీజన్‌లో నిరసనలు జరగడంతో వ్యాపార కార్యకలాపాలు మందగించాయి. రిటైల్‌ రంగానికి సుమారు రూ.1,800 కోట్ల నష్టం వాటిల్లినట్లు సీటీఐ అంచనా వేసింది. సదర్‌ బజార్‌, చాందినీ చౌక్‌, కశ్మీరీ గేట్‌, కరోల్‌బాగ్‌, కన్నాట్‌ ప్లేస్‌ వంటి ప్రధాన వాణిజ్య కేంద్రాలతోపాటు ఢిల్లీలోని 700కు పైగా మార్కెట్లపై ప్రభావం పడింది. సోనిపట్‌, పానిపట్‌, గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, నోయిడా, ఘజియాబాద్‌తోపాటు రాజస్థాన్‌ నుంచి ఢిల్లీకి రావాల్సిన 3 నుంచి 4 లక్షల మంది హోల్‌సేల్‌ కొనుగోలుదారులు రాలేకపోయారని సీటీఐ తెలిపింది. దీంతో హోల్‌సేల్‌ వ్యాపారానికి సుమారు రూ.600 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడించింది. ట్రక్కుల రాకపోకలు నిలిచిపోవడంతో పండుగల కోసం సిద్ధం చేసిన సరుకులు గోదాములకే పరిమితమయ్యాయని పేర్కొంది.

అన్ని రంగాలపైనా ప్రభావం

నిరసనల కారణంగా హాస్పిటాలిటీ, సేవల రంగాలకు రూ.300 కోట్లు, రవాణా, ఆటో-ట్యాక్సీ, పర్యాటక రంగాలకు రూ.180 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీటీఐ అంచనా వేసింది. అసంఘటిత రంగంపైనా ఆందోళనల ప్రభావం తీవ్రంగా పడిందని తెలిపింది. రోజువారీ కూలీలు, చేతివృత్తుల వారు, సరుకు లోడింగ్‌ కార్మికులు ఉపాధి కోల్పోవడంతో సుమారు రూ.120 కోట్ల నష్టం సంభవించిందని వివరించింది. ప్రతి వారం ఇలాంటి నిరసనలు కొనసాగితే దీపావళి నాటికి వ్యాపార రంగానికి జరిగే నష్టాలు రూ.10వేల‌ కోట్లు దాటే ప్రమాదం ఉందని గోయల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

నిరసనలకు ప్రత్యేక ప్రాంతాలు ఏర్పాటు చేయాలి

వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సీటీఐ కోరింది. దీపావళి వరకు సెంట్రల్‌ ఢిల్లీ, న్యూఢిల్లీ, ల్యూటెన్స్‌ జోన్‌ ప్రాంతాల్లో నిరసనలపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని విజ్ఞప్తి చేసింది. భవిష్యత్తులో బురారీ, రోహిణి, ద్వారక వంటి ఔటర్‌ ఢిల్లీ ప్రాంతాల్లో నిరసనలకు ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. అక్టోబర్‌లో జరిగిన రూ.3వేల‌ కోట్ల నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాపారులకు ఉపశమన ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ చేసింది. విద్యుత్‌, నీటి బిల్లులు, జీఎస్టీ చెల్లింపుల విషయంలో రాయితీలు కల్పించాలని కోరింది. దుకాణాలను బలవంతంగా మూసివేయాలని వ్యాపారులపై పోలీసులు ఒత్తిడి చేయకుండా చూడాలని, మార్కెట్లు తెరిచి ఉంచేందుకు తగిన భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది.

Advertisement
Advertisement