త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TTD | హనుమంత వాహనంపై కోదండ రామునిగా మలయప్పస్వామి

TTD | తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం ఉదయం హనుమంత వాహనసేవ వైభవంగా జరిగింది. మలయప్పస్వామివారు కోదండ రాముని అలంకారంలో ధనుర్బాణాలు ధరించి, హనుమంతునిపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనంతో భక్తులు పులకించిపోయారు.

P

Devotional | Published On Oct 17, 2026, 3.15 pm IST

TTD | హనుమంత వాహనంపై కోదండ రామునిగా మలయప్పస్వామి
Advertisement

TTD | తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం ఉదయం హనుమంత వాహనసేవ వైభవంగా జరిగింది. మలయప్పస్వామివారు కోదండ రాముని అలంకారంలో ధనుర్బాణాలు ధరించి, హనుమంతునిపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనంతో భక్తులు పులకించిపోయారు. వాహనసేవ సందర్భంగా భక్తబృందాలు హరినామ సంకీర్తనలు, చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించాయి. మంగళవాయిద్యాల నడుమ సాగిన ఊరేగింపు భక్తులను ఆధ్యాత్మిక పారవశ్యంలో ముంచెత్తింది. మార్గమధ్యంలో భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీరాముడిపై అచంచలమైన భక్తి, అపారమైన పరాక్రమానికి హనుమంతుడు ప్రతీక. చతుర్వేద పండితుడిగా, శ్రీరాముని పరమభక్తుడిగా పేరొందిన ఆంజనేయస్వామిపై మలయప్పస్వామివారు విహరించడం ఈ వాహనసేవకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని చేకూర్చింది. శ్రీరాముడు, హనుమంతుడి మధ్య ఉన్న అనన్యమైన భక్తి సంబంధాన్ని ఈ సేవ స్మరింపజేసింది.

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు పుష్పక విమానంపై, రాత్రి 7 గంటలకు గజవాహనంపై శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. హనుమంత వాహనసేవలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు నరేష్ కుమార్, శాంతారామ్, రంగశ్రీ, జానకీ దేవి, సదాశివమ్‌, సీవీఎస్వో మురళీకృష్ణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement