త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CJI Justice Surya Kant | న్యాయం కోసం ధైర్యంగా నిలబడాలి

CJI Justice Surya Kant | న్యాయం కోసం ధైర్యంగా నిలబడాలని, వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షిస్తూ రాజ్యాంగ విలువలను కాపాడాలని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్‌ సూర్యకాంత్‌ న్యాయ విద్యార్థులకు పిలుపునిచ్చారు. న్యాయవృత్తిలో రాణించాలంటే చట్టాలపై పట్టు ఉంటే సరిపోదని.. నిజాయితీ, ధైర్యంతోపాటు సమాజంలో అణగారిన వర్గాల గొంతుకను వినగలిగే వినయం ఉండాలని సూచించారు.

P

National | Published On Oct 17, 2026, 3.44 pm IST

CJI Justice Surya Kant | న్యాయం కోసం ధైర్యంగా నిలబడాలి
Advertisement
  • చట్టాలపై అవగాహనతోపాటు మానవీయ దృక్పథం అవసరం
  • రాజ్యాంగ విలువలను కాపాడాలి..
  • వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించాలి
  • న్యాయ విద్యార్థులకు సీజేఐ సూర్యకాంత్‌ పిలుపు

CJI Justice Surya Kant | న్యాయం కోసం ధైర్యంగా నిలబడాలని, వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షిస్తూ రాజ్యాంగ విలువలను కాపాడాలని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్‌ సూర్యకాంత్‌ న్యాయ విద్యార్థులకు పిలుపునిచ్చారు. న్యాయవృత్తిలో రాణించాలంటే చట్టాలపై పట్టు ఉంటే సరిపోదని.. నిజాయితీ, ధైర్యంతోపాటు సమాజంలో అణగారిన వర్గాల గొంతుకను వినగలిగే వినయం ఉండాలని సూచించారు. బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ) 34వ వార్షిక స్నాతకోత్సవంలో శనివారం ఆయన ప్రసంగించారు. న్యాయ విద్య కేవలం పుస్తకాల్లోని అంశాలు, చట్టపరమైన సూత్రాలకే పరిమితం కాకూడదన్నారు. భిన్నమైన ఆలోచనలు, అభిప్రాయాలను అర్థం చేసుకుంటూ సమాజానికి సేవ చేసేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.

భిన్నాభిప్రాయాలను గౌరవించాలి

న్యాయ విద్యార్థులకు అభినందనలు తెలియజేయడంతోపాటు వారి నుంచి సమాజం ఎంతో ఆశిస్తోందని సూర్యకాంత్ పేర్కొన్నారు. క్రిమినల్‌, రాజ్యాంగ చట్టాలపై అవగాహన సంపాదించడమే న్యాయ విద్య లక్ష్యం కాదని స్పష్టం చేశారు. మనకు భిన్నంగా ఆలోచించే వ్యక్తులను కలవడం, వారి అభిప్రాయాలను అర్థం చేసుకోవడం ద్వారా న్యాయ విద్యకు నిజమైన విలువ చేకూరుతుందన్నారు. సమాజంలోని విభిన్న వర్గాల సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. న్యాయవృత్తి బలహీన మనస్కులకు స‌రైంది కాద‌ని సీజేఐ అభిప్రాయ‌ప‌డ్డారు. చట్టాలు, కోర్టు తీర్పులపై పరిజ్ఞానంతోపాటు న్యాయం కోసం నిలబడే ధైర్యం, ఎవరికీ వినిపించని గొంతుకలను ఆలకించే వినయం అవసరమన్నారు. వృత్తి జీవితంలో సౌలభ్యం కోసం విలువలను పక్కన పెట్టవద్దని, తాత్కాలిక ప్రయోజనాల కోసం అడ్డదారులు తొక్కవద్దని హితవు పలికారు. విద్యాసంస్థలో నేర్చుకున్న విలువలు భవిష్యత్తులో వృత్తిపరమైన నిర్ణయాలకు మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు.

సమాజానికి సేవ చేయాలి

న్యాయవాదులు అన్యాయాన్ని తొలగించడంలో, వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడటంలో, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించగలరని సూర్యకాంత్‌ పేర్కొన్నారు. న్యాయవృత్తి ద్వారా సమాజానికి సేవ చేయడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. దేశం పట్ల తమకున్న విస్తృత బాధ్యతను నూతన న్యాయ పట్టభద్రులు గుర్తించాలని సూచించారు. వారు కేవలం న్యాయ నిపుణులుగానే కాకుండా సమాజంలో ఆశలు నింపే వ్యక్తులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement