త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amit Shah | స్వాతంత్య్ర‌ సమరయోధులను కాంగ్రెస్ అవ‌మానిస్తోంది : అమిత్ షా

Amit Shah | పార్టీ కార్య‌క్ర‌మాల్లో వందేమాతరం తొలి రెండు చరణాలను మాత్ర‌మే ఆలపించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఆ పార్టీ నిర్ణ‌యాన్ని దేశ వ్య‌తిరేక నిర్ణ‌యంగా షా అభివ‌ర్ణించారు.

D

National | Published On Aug 20, 2026, 2.49 pm IST

Amit Shah | స్వాతంత్య్ర‌ సమరయోధులను కాంగ్రెస్ అవ‌మానిస్తోంది : అమిత్ షా
Advertisement

Amit Shah | త్రినేత్ర‌.న్యూస్ : జాతీయ గేయం వందేమాత‌రం (Vande Mataram) విష‌యంలో అధికార బీజేపీ, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ (Congress) పార్టీ మ‌ధ్య వివాదం మ‌రింత ముదిరింది. పార్టీ కార్య‌క్ర‌మాల్లో వందేమాతరం తొలి రెండు చరణాలను మాత్ర‌మే ఆలపించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఆ పార్టీ నిర్ణ‌యాన్ని దేశ వ్య‌తిరేక నిర్ణ‌యంగా షా అభివ‌ర్ణించారు.

స్వాతంత్య్ర‌ సమరయోధులను (freedom fighters) ఆ పార్టీ అవమానిస్తోందని మండిప‌డ్డారు. వారి బుజ్జగింపు రాజకీయ విధానాలకు ఇది నిదర్శనమంటూ హ‌స్తం పార్టీపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్‌ 1937లో వందేమాతరాన్ని రెండు భాగాలుగా విభజించడం వల్లే దేశ విభజనకు బీజాలు పడ్డాయని షా ఆరోపించారు. గతంలో చేసిన తప్పుల నుంచి ఆ పార్టీ ఎలాంటి పాఠాలూ నేర్చుకోలేదని విమర్శించారు. ‘వందేమాతరం’ విషయంలోనూ అదే విధానాన్ని కొనసాగిస్తోందని అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వందేమాతరం’పై కాంగ్రెస్‌ తీసుకున్న వైఖరికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని ఈ సంద‌ర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

"1937లో బుజ్జగింపు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ వందే మాతరాన్ని రెండు భాగాలుగా విభజించింది. అక్కడి నుంచే ద్విజాతి సిద్ధాంతానికి బలం చేకూరి చివరకు దేశ విభజనకు దారితీసింది. వందే మాతర గేయానికి 150 సంవత్సరాలు పూర్తైన‌ సందర్భంగా ప్ర‌ధాని మోదీ నేతృత్వంలోని మా ప్ర‌భుత్వం ఆ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్ది.. పూర్తి గీతానికి చట్టబద్ధమైన రూపాన్ని కల్పించింది. కానీ, రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ మరోసారి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బుజ్జగింపు మార్గంలోనే పయనిస్తోంది. కాంగ్రెస్ కొన‌సాగిస్తున్న ఈ బుజ్జగింపు రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఐక్యంగా నిలబడి తమ గళాన్ని వినిపించాలి" అని షా పిలుపునిచ్చారు.

బుధవారం జరిగిన సీడ‌బ్ల్యూసీ సమావేశంలో ‘వందేమాతరం’ విష‌యంలో 1937లో పార్టీ చేసిన తీర్మానానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని కాంగ్రెస్‌ స్ప‌ష్టం చేసింది. వందేమాతర గేయం తొలి రెండు చరణాలను మాత్రమే పాడుతామని వెల్ల‌డించింది. హ‌స్తం పార్టీ నిర్ణ‌యంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Also Read..

విద్యార్థుల‌కు గూగుల్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏడాదిపాటు జెమిని ఏఐ ప్లాన్ ఫ్రీ..

ఆ వీడియోలు తీస్తే రూ.ల‌క్ష ప్రైజ్‌మ‌నీ.. ఇన్‌ఫ్ల్యూయెన్స‌ర్ల‌కు బీహార్ ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్‌

4 నెల‌ల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జ‌డ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!

Advertisement
Advertisement