త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

సింగరేణి మనుగడకు పెను సవాళ్లు: రికార్డు బొగ్గు ఉత్పత్తి వెనుక కోల్ ఎక్స్ఛేంజ్ పోటీ మరియు డిజిటల్ విప్లవం!

దేశంలో బొగ్గు ఉత్పత్తి వరుసగా రెండో ఏడాది 1 బిలియన్ టన్నుల మైలురాయిని దాటింది. అదే సమయంలో కోల్ ఎక్స్ఛేంజ్, డిజిటలైజేషన్, ప్రైవేటీకరణ సంస్కరణలు బొగ్గు రంగాన్ని కొత్త దిశగా తీసుకెళ్తున్నాయి. అయితే ఈ మార్పులు తెలంగాణ జీవనాడి సింగరేణి భవిష్యత్తు, కార్మికుల ఉపాధి, పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయన్నది కీలక ప్రశ్నగా మారింది. రికార్డు ఉత్పత్తి వెనుక దాగి ఉన్న అవకాశాలు, సవాళ్లపై ఈ ప్రత్యేక విశ్లేషణ.

S

National | Published On Aug 5, 2026, 6.29 pm IST

సింగరేణి మనుగడకు పెను సవాళ్లు: రికార్డు బొగ్గు ఉత్పత్తి వెనుక కోల్ ఎక్స్ఛేంజ్ పోటీ మరియు డిజిటల్ విప్లవం!

సంక్షిప్త సారాంశం

బొగ్గు రంగంలో జరుగుతున్న మార్పులు కేవలం ఉత్పత్తి పెంపుతో ముగిసేవి కావు. వాటి ప్రభావం మార్కెట్, ఉపాధి, పర్యావరణం, ప్రభుత్వ రంగ సంస్థలపై కూడా పడనుంది. సాంకేతికత సామర్థ్యాన్ని పెంచుతున్నా, ఉద్యోగాలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రైవేట్ పోటీతో సింగరేణి వంటి సంస్థలు కొత్త సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. అభివృద్ధి–సంక్షేమం మధ్య సమతుల్యతను కాపాడుకోవడమే ఇప్పుడు అసలైన పరీక్ష.

Advertisement

    ఒకవైపు 1 బిలియన్ టన్నుల రికార్డు ఉత్పత్తి..

                                                                 మరోవైపు కోల్ ఎక్స్ఛేంజ్ పోటీ...

                                                                                                                 తెలంగాణ సింగరేణి మనుగడకు సవాళ్లు!

భారతదేశ శక్తి మరియు పారిశ్రామిక అవసరాలను తీర్చడంలో వెన్నెముకగా నిలుస్తున్న బొగ్గు రంగంలో గత ఐదేళ్లుగా అపూర్వమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన సంస్కరణలతో దేశీయ బొగ్గు ఉత్పత్తి వరుసగా రెండేళ్లుగా '1 బిలియన్ టన్నుల' (100 కోట్ల టన్నులకు పైగా) మైలురాయిని దాటి దూసుకుపోతోంది (FY 2024-25లో 1047 MT, FY 2025-26లో 1039 MT). ఒకవైపు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్', డిజిటలైజేషన్ మరియు తాజాగా 'కోల్ ఎక్స్ఛేంజ్' వంటి సంస్కరణలతో రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చినప్పటికీ, ఈ వృద్ధి వెనుక కొన్ని కీలకమైన సవాళ్లు, ముఖ్యంగా తెలంగాణ జీవనాడి అయిన సింగరేణి సంస్థ మనుగడపై తీవ్ర ప్రభావం చూపే అంశాలు దాగి ఉన్నాయి.

ఇవాళ లోక్‌సభలో బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే లిఖితపూర్వకంగా వెల్లడించిన ముఖ్యాంశాలు:

  • రికార్డు బొగ్గు ఉత్పత్తి: 2019-20లో 731 మిలియన్ టన్నులుగా ఉన్న దేశీయ బొగ్గు ఉత్పత్తి, గత రెండేళ్లలో 1 బిలియన్ టన్నుల మైలురాయిని దాటింది (FY 2024-25లో 1047.52 MT, FY 2025-26లో 1039 MT).

  • కోల్ ఎక్స్ఛేంజ్ రూల్స్, 2026: బొగ్గు, దాని ఉత్పత్తుల కొనుగోలు-అమ్మకాల కోసం ప్రభుత్వం ఒక నియంత్రిత ఆన్‌లైన్ ట్రేడింగ్ వేదికను (షేర్ మార్కెట్ లాంటి ఆన్‌లైన్ మార్కెట్) ఏర్పాటు చేసింది.

  • మొదటి మైలు కనెక్టివిటీ (FMC ప్రాజెక్టులు): రవాణా ఖర్చులను తగ్గించడానికి మొత్తం 1,319 మిలియన్ టన్నుల సామర్థ్యంతో 139 ప్రాజెక్టులను చేపట్టగా, ఇప్పటికే 589 మిలియన్ టన్నుల సామర్థ్యం గల 72 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి.

  • బొగ్గు గ్యాసిఫికేషన్ (Coal Gasification): బొగ్గును గ్యాస్‌గా మార్చే విధానం ద్వారా 2030 నాటికి 100 మిలియన్ టన్నుల సామర్థ్యం సాధಿಸಲು రూ.8,500 కోట్లు, రూ.37,500 కోట్లతో రెండు భారీ పథకాలు ఆమోదించబడ్డాయి.

  • డిజిటల్ మైన్ మానిటరింగ్ (సాంకేతిక పర్యవేక్షణ): రియల్ టైమ్ పర్యవేక్షణ కోసం 'కొయ్లా శక్తి డాష్‌బోర్డ్', అక్రమ మైనింగ్‌ను అరికట్టడానికి 'ఖనాన్ ప్రహారి' యాప్, గనుల్లో భద్రత కోసం AI కెమెరాలు, డ్రోన్ మ్యాపింగ్‌తో కూడిన ICCC కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి.

  • పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు (Renewable Energy): కోల్ ఇండియా సంస్థ నెట్-జీరో (కార్బన్ ఉద్గారాలు లేని స్థాయి) లక్ష్యంతో 2027-28 నాటికి 3 GW, 2029-30 నాటికి 9.5 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 558 MW ఏర్పాటయ్యింది.

  • మిషన్ కోకింగ్ కోల్ (Mission Coking Coal): దేశంలో కోకింగ్ కోల్ (స్టీల్ తయారీకి వాడే ప్రత్యేక బొగ్గు) వాషరీ (బొగ్గులోని మలినాలను శుభ్రం చేసే కేంద్రాలు) సామర్థ్యాన్ని 2030 నాటికి 58 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

  • ప్రైవేట్ అన్వేషణకు అవకాశం: గనుల అన్వేషణ (నిక్షేపాల గుర్తింపు) కోసం లైసెన్స్‌లతో సంబంధం లేకుండా ఇప్పటివరకు 44 ప్రైవేట్ సంస్థలను అక్రెడిటెడ్ ప్రాస్పెక్టింగ్ ఏజెన్సీలుగా (APA - గనులను గుర్తించే అధికారిక ప్రైవేట్ సంస్థలు) ప్రభుత్వం నోటిఫై చేసింది.

ఇదంతా బాగానే ఉన్నా  ఈ తాజా మార్పుల వల్ల  అనేక  నష్టాలు చవి చూసే అవకాశం లేకపోలేదు.  బొగ్గు ఉత్పత్తి పెంచుతున్నా,  సాంకేతిక వినియోగం ద్వారా లాభాలు ఉన్నా... కొన్ని సవాళ్లు మాత్రం  ఎదుర్కోక తప్పదు.  ఆ సవాళ్లపై ఈ విశ్లేషణ చదవండి.

1. రికార్డు ఉత్పత్తి మరియు అంతర్జాతీయ పర్యావరణ ఉచ్చు

దేశంలో బొగ్గు ఉత్పత్తి మరియు వినియోగం భారీగా పెరగడం పారిశ్రామికంగా పురోగతిని ఇస్తున్నప్పటికీ, అంతర్జాతీయంగా మారిన సమీకరణాల మధ్య ఇది పెద్ద సవాలుగా మారుతోంది. గ్లోబల్ వార్మింగ్, కార్బన్ ఉద్గారాల నియంత్రణ మరియు 'నెట్-జీరో' లక్ష్యాల సాధన కోసం ప్రపంచ దేశాలు ఒత్తిడి తెస్తున్న తరుణంలో, భారత్ మాత్రం తన విద్యుత్ అవసరాల కోసం ఇప్పటికీ బొగ్గుపైనే అత్యధికంగా ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వం క్లీన్ కోల్ ఇనిషియేటివ్స్, కోల్ గ్యాసిఫికేషన్ కోసం వేల కోట్లు కేటాయిస్తున్నా, బొగ్గు దహనం వల్ల జరిగే పర్యావరణ నష్టాన్ని పూర్తిగా నివారించడం ప్రస్తుతానికి సవాలుగానే ఉంది.

2. కోల్ ఎక్స్ఛేంజ్ పనితీరు మరియు సింగరేణి మనుగడకు విసురుతున్న సవాళ్లు

ఈ సంస్కరణల్లో అత్యంత ప్రధానమైనది 'కోల్ ఎక్స్ఛేంజ్ రూల్స్, 2026'. ఇంతకుముందు బొగ్గు అమ్మకాలు కేవలం లింకేజీలు లేదా ప్రత్యేక వేలాల ద్వారానే జరిగేవి.

  • పనితీరు ఎలా ఉంటుంది?: షేర్ మార్కెట్ లేదా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల మాదిరిగానే 'కోల్ ఎక్స్ఛేంజ్' అనేది ఒక నియంత్రిత ఆన్‌లైన్ ట్రేడింగ్ వేదిక. దీని ద్వారా క్యాప్టివ్, కమర్షియల్ మైనర్లు మరియు ఇండస్ట్రీలు నేరుగా ఆన్‌లైన్‌లో డెలివరీ ఆధారిత ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. ధరలు డిమాండ్ ఆధారంగా పారదర్శకంగా మారుతుంటాయి.

  • సింగరేణి మనుగడపై తీవ్ర ప్రభావం: తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) లాంటి ప్రాంతీయ ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ ఆన్‌లైన్ ఎక్స్ఛేంజ్ విధానం గట్టి సవాళ్లను విసురుతోంది. ఇప్పటివరకు స్థానిక పరిశ్రమలు మరియు విద్యుత్ కేంద్రాలకు సులభంగా బొగ్గు అమ్ముకున్న సింగరేణికి, ఈ ఎక్స్ఛేంజ్ పుణ్యమా అని దేశంలో ఎక్కడి నుంచైనా వచ్చే ప్రైవేట్ కమర్షియల్ మైనర్ల నుండి తీవ్రమైన పోటీ ఎదురుకానుంది. ప్రైవేట్ సంస్థలు తక్కువ ధరకు ఆఫర్ చేస్తే, సింగరేణి తన మార్కెట్ వాటాను కాపాడుకోవడానికి మరియు మనుగడను నిలుపుకోవడానికి తీవ్రమైన ధరల ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

3. డిజిటలైజేషన్: లాభం ఎవరికి? (ప్రభుత్వం, యాజమాన్యాలు వర్సెస్ కార్మికులు)

ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'కొయ్లా శక్తి డాష్‌బోర్డ్', 'ఖనాన్ ప్రహారి యాప్', AI-ఆధారిత వీడియో అనలిటిక్స్ మరియు ICCC కేంద్రాల వంటి డిజిటల్ విధానాల వల్ల ఎవరికి లాభం కలుగుతుందనేది పరిశీలిస్తే:

  • ప్రభుత్వం మరియు కంపెనీ యాజమాన్యాలకు పూర్తి లబ్ధి: గనుల్లో ఉత్పత్తి, నిల్వలు, రవాణా వివరాలు రియల్ టైమ్‌లో ప్రభుత్వానికి అందుతాయి. RFID వేబ్రిడ్జ్‌లు, GPS ట్రాకింగ్ వల్ల రవాణాలో జరిగే లీకేజీలు, దొంగతనాలు ఆగిపోయి నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. 'ఖనాన్ ప్రహారి' యాప్ ద్వారా అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట పడుతుంది.

  • కార్మికులకు భద్రత.. కానీ ఉపాధి లోపం: AI కెమెరాలు, డ్రోన్ మ్యాపింగ్ వంటి ఆధునిక సాంకేతికత గనులలో ప్రమాదాలను తగ్గించి కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పిస్తుంది. అయితే, ఇదే సమయంలో డిజిటలైజేషన్ మరియు సాంకేతిక యంత్రాల వాడకం వల్ల కార్మికులకు ఉద్యోగ, ఉపాధి లోపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదనే ఆందోళన తీవ్రంగా వ్యక్తమవుతోంది.

4. ప్రైవేటీకరణ వేగం, ఉపాధి భద్రత మరియు 'చీకటి సూర్యుల' తగ్గింపు

ప్రభుత్వం గనుల త్వరిత కార్యాచరణ కోసం సింగిల్ విండో అనుమతులు (PARIVESH 2.0), కోకింగ్ కోల్‌ను వ్యూహాత్మక ఖనిజంగా మార్చడం, అలాగే మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ (MDO) మోడ్‌ను తీసుకురావడం వంటి నిర్ణయాలతో ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేస్తోంది. వ్యాపారాలు వేగవంతం కావడానికి ఇవి దోహదపడినప్పటికీ, ప్రభుత్వ రంగంలో శాశ్వత ఉద్యోగ అవకాశాలు క్రమంగా తగ్గిపోయి, కాంట్రాక్ట్ విధానం పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, అండర్‌గ్రౌండ్ (భూగర్భ) గనులలో ప్రాణాలను సైతం లెక్కచేకుండా బొగ్గును వెలికితీస్తూ రంగానికి గుండెకాయలా నిలిచే బొగ్గు కార్మికుల సంఖ్య కూడా గత కొంతకాలంగా క్రమంగా తగ్గిపోతోంది. ముఖ్యంగా తెలంగాణలోని సింగరేణిలోనూ బొగ్గు పొరల్లో చెమటోడ్చి పనిచేసే ఆ 'చీకటి సూర్యుల' (భూగర్భ కార్మికుల) సంఖ్య గణనీయంగా తగ్గుతుండటం, డిజిటలైజేషన్ మరియు సాంకేతిక యంత్రాల వాడకం వల్ల కార్మికులకు ఉద్యోగ, ఉపాధి లోపిస్తుందనడంలో సందేహం లేకపోవడం కార్మిక లోకంలో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న మరో ప్రధాన వాస్తవం.

బొగ్గు రంగంలో డిజిటలైజేషన్, కోల్ ఎక్స్ఛేంజ్ ద్వారా పారదర్శకత, రికార్డు స్థాయి ఉత్పత్తి దేశ ఆర్థిక వృద్ధికి అవసరమే. అయితే, ఈ వేగవంతమైన ప్రైవేటీకరణ ,మార్కెట్ సంస్కరణల హోరులో తెలంగాణలోని సింగరేణి మనుగడకు సవాళ్లు విసురుతున్న ఈ పరిస్థితులను గమనించడం, ప్రాంతీయ సంస్థల ప్రయోజనాలు దెబ్బతలకుండా చూడటం, అలాగే కార్మికుల సంక్షేమం, 'చీకటి సూర్యుల' ఉపాధి భద్రత మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతను కాపాడుకోవడం ప్రభుత్వాల ముందున్న అసలైన మరియు అతిపెద్ద సవాలు.

Advertisement
Advertisement