త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | UGC నిబంధ‌న‌ల‌ను పునఃప‌రిశీలిస్తాం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

Supreme Court | విద్యా సంస్థల్లో సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన వివాదాస్ప‌ద‌ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) 2026 నిబంధ‌న‌ల‌ను పునఃస‌మీక్షించేందుకు ఒక ప్ర‌త్యేక నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేయ‌డాన్ని ప‌రిశీలిస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు (Supreme Court)కు కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది.

D

National | Published On Nov 5, 2026, 4.49 pm IST

Supreme Court | UGC నిబంధ‌న‌ల‌ను పునఃప‌రిశీలిస్తాం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
Advertisement

Supreme Court | త్రినేత్ర న్యూస్ : ఉన్నత విద్యా సంస్థల్లో (higher education institutions) కుల వివక్షను అరిక‌ట్టే దిశ‌గా కేంద్రం కీల‌క అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే విద్యా సంస్థల్లో సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన వివాదాస్ప‌ద‌ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) 2026 నిబంధ‌న‌ల‌ను పునఃస‌మీక్షించేందుకు ఒక ప్ర‌త్యేక నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేయ‌డాన్ని ప‌రిశీలిస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు (Supreme Court)కు తెలిపింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనాలతో కూడిన త్రిస‌భ్య ధర్మాసనం ఎదుట కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయాన్ని వెల్లడించారు. ఏ వర్గానికి చెందిన విద్యార్థి కూడా అభద్రతాభావానికి లేదా వివక్షకు గురికాకుండా, అందరి ప్రయోజనాలను కాపాడేలా చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. "ప్రతి విద్యార్థి సంరక్షణను ప్రభుత్వం చూసుకుంటుంది. ఎవరికీ ఎలాంటి అభద్రతాభావం కలగకూడదు. ఎవరూ అసంతృప్తి చెందకూడదు. యువత ప్రయోజనాలను కూడా మేము దృష్టిలో ఉంచుకుంటున్నాము. ప్రభుత్వం ఒక కమిటీని నియమించే ఆలోచనలో ఉంది" అని కోర్టుకు తెలిపారు. ఈ సంద‌ర్భంగా స్పందించిన సీజేఐ ధ‌ర్మాస‌నం.. విశ్వవిద్యాల‌యాల్లో కుల వివ‌క్ష‌, ర్యాగింగ్‌ను అరిక‌ట్టేందుకు నిర్దిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. విద్యార్థులంద‌రి ప్ర‌యోజ‌నాల‌ను కాపాడాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని నొక్కి చెప్పింది. అయితే ఈ నిబంధనలను మరింత పరిశీలించేందుకు కేంద్రం కొంత సమయం కోరడంతో కోర్టు విచారణను వాయిదా వేసింది.

ఉన్నత విద్యాసంస్థల్లో కులం, మతం, లింగం, పుట్టిన ప్రదేశం లేదా వైకల్యం ఆధారంగా జరిగే వివక్షను అరికట్టేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) 'ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్' (Promotion of Equity in Higher Education Institutions) నిబంధ‌న‌ల‌ను తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ప్రధానంగా ఎస్సీ (SC), ఎస్టీ (ST), ఓబీసీ (OBC) విద్యార్థులపై జరిగే వివక్షను అరికట్టేలా రూపొందించార‌ని.. ఇది జనరల్ కేటగిరీ విద్యార్థులను మినహాయించేలా ఉందని ప‌లువురు సుప్రీంకోర్టులో పిటిష‌న్లు వేశారు. ఈ నిబంధనలు సమాజంలో విభజనలకు దారితీస్తాయనే ఆందోళనల నేపథ్యంలో.. సుప్రీంకోర్టు ఈ నిబంధనలపై మధ్యంతర స్టే విధించింది. అంతకుముందు అమల్లో ఉన్న 2012 నాటి నిబంధనలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ నేప‌థ్యంలోనే నిబంధ‌న‌ల‌ను పునఃస‌మీక్షించే ఆలోచ‌న‌ను కేంద్రం వ్య‌క్త‌ప‌రిచింది.

Also Read..

మ‌ళ్లీ కెమెరాముందుకు సీఎం విజ‌య్ .. కానీ ....

ధంతేర‌స్ వేళ ఊరిస్తున్న బంగారం ధ‌ర‌లు.. ఈటీఎఫ్‌ల‌లో పెట్టుబడులకు ఇదే సరైన సమయమా?

డిసెంబ‌ర్ 20 నుంచి 29 వ‌ర‌కు.. ప‌దిరోజుల పాటు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలు: టీటీడీ

Advertisement
Advertisement